Himachal Polls: Himachal Polls: బీజేపీ బూటకాలు ఇక్కడ చెల్లవు: ఖర్గే

ABN , First Publish Date - 2022-11-09T18:38:22+05:30 IST

సిమ్లా: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే తొలి ప్రసంగంలోనే బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ తన బూటకపు మాటలతో దేశ ప్రజలందరినీ ఫూల్స్ ..

Himachal Polls: Himachal Polls: బీజేపీ బూటకాలు ఇక్కడ చెల్లవు: ఖర్గే

సిమ్లా: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే తొలి ప్రసంగంలోనే బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ తన బూటకపు మాటలతో దేశ ప్రజలందరినీ ఫూల్స్ (Fools) చేయగలదేమో కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలను మాత్రం ఫూల్స్ చేయలేదని అన్నారు. బనుటిలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తూ, హిమాచల్ ప్రజలు బాగా చదువుకున్న వారని, ప్రతీ విషయాన్ని అర్ధం చేసుకోగలరని, ఓటింగ్ సమయంలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని, ఉద్యోగాలిస్తామనే బూటకపు వాగ్దానాలతో బీజేపీ అందర్నీ నమ్మించినా ఇక్కడి ప్రజలు మాత్రం మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు.

కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ తరచు ఆడిపోసుకుంటుందని, హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్లు, పాఠశాలలు సహా అన్ని సౌకర్యాలు కాంగ్రెస్ హయాంలోనే కల్పించామని, బీజేపీ ఏడేళ్లలో చేసినదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఆ హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తుందని భరోసా ఇచ్చారు. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.600 కోట్లతో స్టార్టఫ్ ఫండ్ ఏర్పాటు, లక్ష ఉద్యోగాల కల్పన, 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతినెలా రూ.1.500 సహాయం అందిస్తామన్నారు.

బీజేపీ తప్పుడు వాగ్దానాలు, అబద్ధాల ప్రచారంతోనే తరచు ఎన్నికల్లో గెలుస్తుంటుందని విమర్శించారు. ''మీరు నిజం ఎందుకు చెప్పరు? నిజం మాట్లాడి ఓట్లు అడగండి'' అని బీజేపీని ఉద్దేశించి ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక గురించి ఏ ఒక్కరికీ తెలియదని అన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఎన్నికలే ఉండవన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకమే ఉండదని చెప్పారు.

Updated Date - 2022-11-09T18:41:27+05:30 IST