Gujarat Elections: నదిలోకి దూకిన మాజీ ఎమ్మెల్యేకు బీజేపీ టికెట్
ABN , First Publish Date - 2022-11-10T16:08:28+05:30 IST
వచ్చే నెలలో గుజరాత్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ (BJP) పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది
న్యూఢిల్లీ: వచ్చే నెలలో గుజరాత్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ (BJP) పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా 160 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది. రెండో విడతలో మిగతా స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల మోర్బీ (Morbi) జిల్లాలో వంతెన కూలిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 135 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతీయ (60) లైఫ్ ట్యూబ్ ధరించి నదిలో దూకి బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడాయనకు బీజేపీ మోర్బీ టికెట్‌ను కేటాయించింది. మోర్బీ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మీర్జాను పక్కనపెట్టింది.
నదిలో కొట్టుకుపోతున్న బాధితులను రక్షించేందుకు కాంతిలాల్ (Kantilal Amrutiya) నదిలోకి దూకడమే ఆయనకు టికెట్‌ను తెచ్చిపెట్టిందని పలువురు చెబుతున్నారు. నిజానికి బీజేపీ ఒరిజనల్ జాబితాలో కాంతిలాల్ పేరు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాతే ఆయన పేరు జాబితాకెక్కింది. గుజరాత్‌ను బీజేపీ 22 సంవత్సరాలుగా పాలిస్తోంది. అయితే, ఇటీవల మోర్బీ దుర్ఘటనతో ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారింది. గుజరాత్‌కు చెందిన వాల్‌క్లాక్ తయారీ కంపెనీ ఒరేవాకు బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టు అప్పగించడం తీవ్ర వివాదాస్పదమైంది.
ఒరేవా కంపెనీ గడియారాలు, రిస్ట్‌వాచ్‌లు, ఫ్యాన్లు, ఈ-బైక్‌లు, ఎల్‌ఈడీ బల్బులు తయారు చేస్తుంది. మౌలిక సదుపాయాల నిర్వహణలో ఆ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోయినా 15 సంవత్సరాల కాంట్రాక్టును ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ బ్రిడ్జ్ పునరుద్ధరణ నేపథ్యంలో ఏడు నెలలపాటు మూతలోనే ఉంది. ఆ తర్వాత దీనిని తెరిచారు. టికెట్ ధరను రూ. 17గా నిర్ణయించారు. ఫ్లోరింగ్ బలంగా చేసినా తుప్పుపట్టిన కేబుల్స్‌ను మార్చకపోవడంతో 500 మంది జనం బ్రిడ్జికిపైకి చేరగానే కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కంపెనీ అధికారులు, టికెట్ విక్రయదారులు, సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. అయితే, ఒరేవా కంపెనీ పెద్దలు మాత్రం తప్పించుకున్నారు. కాగా, గుజరాత్‌లోని 182 స్థానాలకు డిసెంబరు 1, 5న రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఫలితాలు ప్రకటిస్తారు.