Himachal Results: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-12-08T14:57:25+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ఓవైపు జరుగుతుండగా, వెలువడుతున్న ఫలితాలు, ఆధిక్యాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్నాయి. ప్రజలు కాంగ్రెస్ ..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ఓవైపు జరుగుతుండగా, వెలువడుతున్న ఫలితాలు, ఆధిక్యాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ తీర్పునిచ్చారని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా వీరభద్ర సింగ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే మధ్యాహ్నం 2 గంటల వరకూ వెలువడిన ఫలితాలు, ఆధిక్యాల పరంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ముందంజలో ఉంది. 68 స్థానాల్లో కాంగ్రెస్ 34 సీట్లు గెలుచుకోగా, 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పుపై ప్రతిభా వీరభద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజాతీర్పు ఉందని, భయపడే అవసరమే లేదని అన్నారు. ఎమ్మెల్యేలందరినీ ఛండీగడ్‌లో కానీ, రాష్ట్రంలో కానీ కలుసుకుంటామని, గెలిచిన అభ్యర్థులంతా తమతోనే ఉంటారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌కు మోదీ పదేపదే వచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని, రాష్ట్రంలో పార్టీ ఓడిపోతుందనే విషయం బీజేపీకి తెలిసినందునే కాలికిబలపం కట్టుకుని మోదీ తిరిగారని ఆమె అన్నారు.