Gujarat polls: రాహుల్ ముఖం చాటేయడానికి కారణం చెప్పిన అమిత్‌షా

ABN , First Publish Date - 2022-11-20T19:03:41+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి ముఖం చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఛలోక్తులు.. విసిరారు. గుజరాత్‌కు

Gujarat polls: రాహుల్ ముఖం చాటేయడానికి కారణం చెప్పిన అమిత్‌షా

తాపీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల (Gujarat polls) ప్రచారానికి ముఖం చేయడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఛలోక్తులు విసిరారు. గుజరాత్‌కు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఆ కారణంగానే రాహుల్ బాబా గుజరాత్‌కు రాకుండా వేరోచోట్ల తిరుగుతున్నారని అన్నారు. గుజరాత్‌లోని తాపీ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చోటుచేసుకుందని చెప్పారు.

''బీజేపీ ప్రభుత్వం 1990 నుంచి గుజరాత్‌లో అధికారంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం తాము చేసిన పనులే మాట్లాడతాయని అంటోంది. 1990 నుంచి అధికారంలోనే లేనప్పుడు కాంగ్రెస్ చేసిన పనులేమిటి? ప్రజలను ఆ పార్టీ తప్పుదారి పట్టిస్తోంది. ఏళ్ల తరబడి అధికారంలో లేని వాళ్లు ఏ పని చేశామని చెప్పుకుంటారు? కాంగ్రెస్ సిగ్గుపడాలి'' అని అమిత్‌షా అన్నారు. మోదీ ప్రభుత్వం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు రూ.1000 కోట్లు కేటాయిస్తే బీజేపీ ప్రభుత్వం దానికి రూ.1 లక్ష కోట్లకు పెంచిందని చెప్పారు. గుజరాత్‌లో ఆ పార్టీ చేసిందేమీ లేదు కాబట్టే ఎన్నికల ప్రచారానికి రాహుల్ ముఖం చేటేశారని అన్నారు.

ఏభై ఏళ్లుగా 370 అధికరణను రద్దు చేసే సాహసం కాంగ్రెస్ చేయలేకపోయిందని, పైగా 370 అధికరణ రద్దు చేస్తే రక్తం ఏరులై పారుతుందంటూ వ్యాఖ్యలు చేసిందన్నారు. అయితే మోదీ ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసి చూపించిందని చెప్పారు. రక్తం పారడం మాట అటుంచి, కనీసం ఒక్క రాయి విసరడానికి కూడా ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారని అన్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించాలని ప్రయత్నించే పాక్, ఇతర దేశాలకు ఎలా గుణపాఠం చెప్పాలో మోదీకి బాగా తెలుసునని, పల్వామా, ఉరి దాడుల అనంతరం మోదీ పది రోజుల్లో పాక్‌లో సర్జికల్ దాడులు నిర్వహించారని, సురక్షితంగా సైనికులు వెనక్కి వచ్చారని చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 35,000 మంది ప్రవాస భారతీయులను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చిందన్నారు. కాగా, 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్‌లో వరుసగా 27 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండగా, ఈసారి (ఏడవది) కూడా అధికారం తమదేనని చెబుతోంది.

Updated Date - 2022-11-20T19:05:37+05:30 IST