Gujarat Assembly Polling: గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-05T07:25:46+05:30 IST
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ పర్వం సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది...
అహ్మదాబాద్(గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ పర్వం సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది.(Gujarat Assembly Polling)14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం పోలింగ్ సాగుతోంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ ఇతర జిల్లాల్లో 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ ప్రక్రియ ఆరంభమైంది.(Polling Begin) రెండో దశ ఓటింగ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)(Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)(Aam Aadmi Party), కాంగ్రెస్‌తో సహా 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
93 స్థానాల్లో సాగుతున్న పోలింగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని కూటమి భాగస్వామి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇతర పార్టీల్లో భారతీయ గిరిజన పార్టీ (BTP) 12 మంది అభ్యర్థులను, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 44 మంది అభ్యర్థులను నిలబెట్టింది. 285 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.
2.51 కోట్ల ఓటర్లు...
1.29 కోట్ల మంది పురుషులు,1.22 కోట్ల మంది మహిళలు సహా మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లు రెండవ దశ ఎన్నికల కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశ పోలింగ్ కోసం 14,975 పోలింగ్ స్టేషన్‌లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.పోలింగ్ కోసం 1.13 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 18 నుంచి 19 ఏళ్లలోపు 5.96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
బరిలో నిలిచిన ప్రముఖులు...
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు చెందిన ఘట్లోడియా (అహ్మదాబాద్ జిల్లా), పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ బీజేపీ టిక్కెట్‌పై పోరాడుతున్న విరామ్‌గామ్ స్థానం (అహ్మదాబాద్), అల్పేష్ ఠాకూర్ పోటీ చేస్తున్న గాంధీనగర్ సౌత్ రెండవ దశ పోలింగ్ పర్వంలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు. బనస్కాంత జిల్లాలోని వడ్గామ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ పోటీ చేస్తున్నారు. ఛోటా ఉదేపూర్ జిల్లాలోని జెట్‌పూర్ నుంచి గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సుఖ్‌రామ్ రత్వా బరిలో ఉన్నారు. వడోదర జిల్లాలోని వఘోడియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ రెబల్ అభ్యర్థి మధు శ్రీవాస్తవ్ పోటీ చేస్తున్నారు.