Gujarat Election 2022: బీజేపీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రెండ్రోజుల్లో రెండో ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2022-11-09T17:02:51+05:30 IST
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపుడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బారడ్...
గాంధీనగర్: గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపుడుతున్న తరుణంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బారడ్ (Bhagwan Barad) బుధవారంనాడు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ (Bjp)లో చేరిపోయారు. పదిసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి, గిరిజన నేతగా మంచి పేరున్న మోహన్‌సిన్హ్ రథ్వా మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మరుసటి రోజే భగవాన్ బారడ్ రాజీనామా చేసి బీజేపీ తీర్థం తీసుకోవడం కీలక పరిణామం. రెండ్రోజుల్లో ఇద్దరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేరడం కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే పరిణామంగా చెబుతున్నారు.
గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని తలాలా నియోజకవర్గం ఎమ్మెల్యేగా బరద్ (63) ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆయన గెలిచారు. తన రాజీనామా లేఖను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్‌కు ఆయన పంపారు. స్పీకర్ నిమాబెన్ ఆచార్యకు కూడా అందజేశారు. బరద్‌ను తమ పార్టీలోకి రావాల్సిందిగా అహ్మదాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శఇ ప్రదీప్ సిన్హ్ వాఘేలా ఆహ్వానించారు.
కార్యకర్తలతో సంప్రదించాకే...
సుమారు 4,000 మంది తన మద్దతుదారులతో సంప్రదించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు బారడ్ చెప్పారు. బీజేపీ కోరితే ఎన్నికల్లో పోటీకి దిగుతానని, పోల్ టిక్కెట్ ఇస్తామనే ముందస్తు షరతు తీసుకుని మాత్రం బీజేపీలోకి చేరడం లేదని తెలిపారు. "నేను బీజేపీలో చేరుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి ప్రచారంలో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండానే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు ఇతర అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేస్తాను. గిర్ సోమనాథ్, జునాగఢ్‌లోని తొమ్మిది సీట్లలో బీజేపీ గెలుపు కోసం పనిచేస్తాను'' అని బారడ్ చెప్పారు. అహిర్ కమ్యూనిటీలో బారడ్‌కు మంచి పలుకుబడి ఉంది. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.