Gujarat Election Results: ఆశర్యకర ఫలితాలు రానున్నాయి: ఆప్
ABN , First Publish Date - 2022-12-07T18:23:41+05:30 IST
ఎంసీడీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదే ఉత్సాహంతో గుజరాత్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పింది. గుజరాత్‌కు ఆప్‌కు ఆశాజనక ఫలితాలు రావంటూ..
న్యూఢిల్లీ: ఎంసీడీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదే ఉత్సాహంతో గుజరాత్ (Gujarat) ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పింది. గుజరాత్‌కు ఆప్‌కు ఆశాజనక ఫలితాలు రావంటూ ఎగ్జిట్ పోల్ వేసిన అంచనాలు తప్పుతాయని, ఆశ్చకరమైన ఫలితాలు రాబోతున్నాయని తెలిపింది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారంనాడు వెలువడనుండగా, రెండు రాష్ట్రాలను ఆప్ కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.
''ఆప్‌ను ఏవిధంగానైనా నిలువరించాలని బీజేపీ కోరుకుంటోంది. తమ బలగాలను మొత్తం దింపింది. గుజరాత్ అసెంబ్లీ ఫలితాలు వెలువడే సమయంలోనూ నేను ప్రజల మధ్యే ఉంటాను. ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయి. గుజరాత్‌లో ఎగ్జిట్ పోల్స్ జోస్యం తప్పబోతోంది. నేను పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలతో సంబరాల్లో పాల్గొంటాను'' అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఆప్ నేతలు అమ్ముడుపోరు...
ఎంసీడీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులంతా ఆప్‌తోనే ఉంటారని భగవంత్ సింగ్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ వారిని సంప్రదించ లేదని, ఆప్ అభ్యర్థులు అమ్మకానికి లేరని ఆయన తెగేసి చెప్పారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, మరో 15 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీని కేజ్రీవాల్ ఎంసీడీ ఎన్నికల్లో చరమగీతం పాడారని అన్నారు. విద్వేష రాజకీయాలను ప్రజలు ఇష్టపడలేదని, స్కూలు, పాఠశాలలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకే ప్రజలు ఓటు వేశారని చెప్పారు.