Gujarat Polls: 15 రోజుల్లో 25 ర్యాలీలు.. మోదీ సుడిగాలి ప్రచారం

ABN , First Publish Date - 2022-11-19T19:06:51+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అధికార బీజేపీ ఉధృతంగా ప్రచారం సాగించేందుకు వ్యూహరచన చేసింది. ఇదులో భాగంగా రాబోయే 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా..

Gujarat Polls: 15 రోజుల్లో 25 ర్యాలీలు.. మోదీ సుడిగాలి ప్రచారం

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Polls) ప్రచారం ఊపందుకుంటోంది. అధికార బీజేపీ ఉధృతంగా ప్రచారం సాగించేందుకు వ్యూహరచన చేసింది. ఇదులో భాగంగా రాబోయే 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 25 ర్యాలీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రచారం సాగించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం గుజరాత్ చేరుకున్న మోదీ వల్సద్‌లోని జువా గ్రామంలో జరిగే ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత గుజరాత్‌లో మోదీ పర్యటిస్తుండటం ఇది రెండోసారి. నవంబర్ 6న గుజరాత్ పర్యటన సందర్భంగా వల్సద్ జిల్లా కప్రాడలో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. భావ్‌నగర్‌లో జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరయ్యారు.

రెండు, మూడవ రోజు పర్యటనల్లో...

కాగా, గుజరాత్ పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారంనాడు సోమ్‌నాథ్ దేవాలయాన్ని మోదీ సందర్శించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో నాలుగు ర్యాలీల్లో పాల్గొంటారు. వెరవాల్, దొరార్జీ, అమ్రేలి, బోటాద్‌‌లో ఆయన ర్యాలీలు ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలోని ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేదు. మూడో రోజు పర్యటనలో భాగంగా సోమవారంనాడు మూడు ర్యాలీల్లో మోదీ పాల్గొంటారు. సురేంద్ర నగర్, బరౌచ్, నవ్‌సారి నియోజకవర్గాల్లో ఆయన ప్రచార ర్యాలీలు ఉంటాయి.

చెరో 15 ర్యాలీల్లో అమిత్‌షా, నడ్డా

కాగా, గుజరాత్‌కే చెందిన హోం మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలోని చెరో 15 ర్యాలీల్లో పాల్గోనున్నారు. గుజరాత్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఒక్కొక్కరు కనీసం 2,3 రోజులు ప్రచార కార్యక్రమంలో పాల్గొని, 2 నుంచి 3 వరకూ ర్యాలీల్లో ప్రసంగిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీహార్ నుంచి నవీన్, ఎంపీలు రాధా మోహన్ సింగ్, నిషికాంట్ డూబే, సత్య పాల్ సింగ్ తదితర ప్రముఖలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. ఈసారి 140 సీట్లలో గెలుపు లక్ష్యంగా చేసుకుంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 8న కౌటింగ్ జరిపి, ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2022-11-19T19:08:33+05:30 IST