Himachal polls: మూడింట రెండు వంతుల మెజారిటీతో మేమే గెలుస్తాం: కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-11-08T18:37:43+05:30 IST
సిమ్లా: సమష్టి నాయకత్వంతో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పార్టీ దివంగత నేత వీరభద్ర సింగ్ తరువాత కొత్త తరం యువనేతలతో పార్టీ నూతనోత్తేజంతో ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా..
న్యూఢిల్లీ: సమష్టి నాయకత్వంతో హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh) ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పార్టీ దివంగత నేత వీరభద్ర సింగ్ తరువాత కొత్త తరం యువనేతలతో పార్టీ నూతనోత్తేజంతో ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా (Randeep Surjewala) మంగళవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ గత ఏడాది కన్నుమూశారు.
''పార్టీలో ఇప్పటికే కొత్తతరం నేతలు సత్తా చాటుతున్నారు. వీరిలో ఎవరైనా సరే పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరు" అని సూర్జేవాలా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ మూడింట రెండు వంతుల సీట్లు గెలుచుకునే దిశగా దూసుకుపోతోందని, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తన సొంత సీటును కాపాడుకోవడం కూడా కష్టమేనని ఆయన చెప్పారు. "జైరామ్ ఠాకూర్ విఫల ముఖ్యమంత్రి. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆయన ఏమాత్రం సమర్ధత లేని ముఖ్యమంత్రి. క్లాసు తప్పని వ్యక్తిని ఎలా ప్రమోట్ చేస్తారు? జైరామ్ ఠాకూర్ విషయంలో హిమాచల్ వాసులు ఇదే పని చేయనున్నారు. ఆయనకు ఉద్వాసన చెప్పనున్నారు'' అని సూర్జేవాలా తెలిపారు.
ప్రియాంక మా జాతీయ నేత, రాహుల్ అంటే భయమెందుకు?
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రాపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ప్రియాంక గాంధీ తమ పార్టీ జాతీయ నేత అని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఆమె సారథ్యం వహిస్తున్నారని చెప్పారు. ఇతర సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ దూరంగా ఉండటంపై మాట్లాడుతూ, పార్టీ మాజీ అధ్యక్షుడిని (రాహుల్) చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. ''రాహుల్ అంటే బీజేపీకి ఎందుకంత భయం? రాహుల్ గాంధీ పేరు విన్నా, చివరకు ఆయన నీడ చూసినా ఎందుకు భయపడుతోంది?'' అని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు రాహుల్ సిమ్లాలో ఉంటారని చెప్పారు.
బీజేపీ నుంచి పాఠాలు అవసరం లేదు..
ఆర్థిక పరమైన చిక్కుల గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోందంటూ బీజేపీ ప్రశ్నించడాన్ని సూర్జేవాలా కొట్టివేశారు. ఆర్థికపరమైన తెలివితేటలు తమకు ఉన్నాయన్నారు. ప్రభుత్వాలను ఎలా నడపాలో తమకు తెలుసునని, గతంలో విజయవంతంగా ప్రభుత్వాలను నడిపామని, ఇచ్చిన హామీలకు అనుగుణంగానే వాటిని నెరవేర్చి తీరుతామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలు వ్యాప్తి చేసే వాళ్లు కాంగ్రెస్‌కు జ్ఞానోపదేశాలు ఇవ్వాల్సిన పని లేదని అన్నారు.