Bypolls Begin: మెయిన్‌పురి లోక్‌సభతో సహా 6 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-05T07:45:46+05:30 IST

దేశంలో మెయిన్‌పురి లోక్ సభతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది....

Bypolls Begin: మెయిన్‌పురి లోక్‌సభతో సహా 6 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Mainpuri Bypolls Begin

న్యూఢిల్లీ : దేశంలో మెయిన్‌పురి లోక్ సభతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.(Mainpuri Lok Sabha) ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్, ఖతౌలీ, ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు(6 Assembly Seats) ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది.హోరాహోరీగా సాగుతున్న ఉప ఎన్నికల పర్వం ఆసక్తికరంగా మారింది.(High Voltage Battle)

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎస్పీ నాయకురాలు,ములాయం సింగ్ కోడలు డింపుల్ యాదవ్ మెయిన్‌పురి స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతివ్యూహంలో భాగంగా ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు మాజీ నమ్మకస్తుడు రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దించింది.యూపీలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీలు రేసులో లేవు.

ఎస్పీ ఎమ్మెల్యే ఆజం ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీలపై వేర్వేరు కేసుల్లో అనర్హత వేటు పడటంతో యూపీలోని రాంపూర్ సదర్, ఖతౌలీలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఖాన్ పై అనర్హత వేటు వేయగా, 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యే శిక్ష ఎదుర్కొన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించిన తర్వాత రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన స్థానంలో ఆయన కుమారుడు అనిల్ కుమార్ పోటీ చేస్తుండగా, అక్కడ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ ను పోటీకి దింపింది.

శాసనసభ్యుడు బిజయ్ రంజన్ సింగ్ బరిహా మృతితో ఒడిశాలోని పదంపూర్ స్థానం ఉప ఎన్నిక సాగుతోంది. ఇక్కడ 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి మరణించిన తర్వాత భానుప్రతాప్‌పూర్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. బీహార్‌లోని కుర్హానీలో ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సహానీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలను సాగుతోంది.ఈ హై ఓల్టేజీ ఉప ఎన్నికల ఓటింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

Updated Date - 2022-12-05T09:17:50+05:30 IST