Gujarat election 2022: కాంగ్రెస్‌వన్నీ కుల రాజకీయాలే: మోదీ

ABN , First Publish Date - 2022-11-28T18:28:11+05:30 IST

కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలను ప్రచారం చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కుల రాజకీయాల కారణంగానే ఆ పార్టీని ప్రజలు అధికారం..

Gujarat election 2022: కాంగ్రెస్‌వన్నీ కుల రాజకీయాలే: మోదీ

అహ్మదాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీ కుల రాజకీయాలను (Caste politics) ప్రచారం చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. కుల రాజకీయాల కారణంగానే ఆ పార్టీని ప్రజలు అధికారం నుంచి దించేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ సాగించాలనుకుంటే కుల రాజకీయాలను దూరంగా పెట్టి, పనితీరును మార్చుకోవాలని సూచించారు. భావ్‌నగర్‌లోని పాలీతానా సిటీలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌ ప్రజలు తాము సురక్షితంగా లేమనే అభిప్రాయంతో ఉండేవారని, బాంబు పేలుళ్లు సర్వసాధారణంగా ఉండేవని చెప్పారు. రోజు విడిచి రోజు బాంబు పేలుళ్ల ఘటనలో రాష్ట్రంలో చోటుచేసుకునేవని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూతపడిన దుకాణాల షట్టర్లు తెరుచుకున్నాయని, ఇప్పుడు గుజరాత్ ప్రజలంతా భద్రతాభావంతో ఉన్నారని, ఇది బీజేపీ ఇచ్చిన బహుమతి అని అన్నారు.

పోలింగ్ రోజున ప్రజలు ప్రతి బూత్‌కూ పెద్దఎత్తున వెళ్లి ఓటింగ్ చేయాలని ప్రధాని కోరారు. ''రాష్ట్రంలో కమలం వికసించేలా చూడాలి. అందుకోసం మీరంతా కష్టపడి పనిచేసి ప్రతి సీటులోను బీజేపీకి ఘనవిజయం చేకూర్చాలి. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలోనే గుజరాత్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాం. ఇందుకు మీ సపోర్ట్ అవసరం'' అని ఆయన అన్నారు. ఒకానొక సమయంలో ప్రజలు ఉపాధి కోసం గుజరాత్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం గుజరాత్‌కు వస్తున్నారని, రాష్ట్రంలో శ్రీఘ్ర పారిశ్రామికాభివృద్ధే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. 2014 వరకూ కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 60 గ్రామాలకు మాత్రమే ఇంటర్నెట్ అనుసంధానం ఉండేదని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో మూడు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం రూ.1600 నుంచి 1,700 వరకూ యూరియా బ్యాగ్‌పై సబ్సిడీ ఇస్తోందని, దీంతో రైతులు కేవలం ఒక్కో బ్యాగ్‌కు రూ.200 నుంచి రూ.300 చెల్లిస్తే సరిపోతోందని ప్రధాని అన్నారు.

Updated Date - 2022-11-28T18:28:12+05:30 IST