Gujarat Assembly Election: వీరు ఐదుసార్లు విజేతలు... మళ్లీ ఆశీర్వదించాలంటున్నారు...
ABN , First Publish Date - 2022-11-23T16:03:11+05:30 IST
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలు కోరుతున్నవారిలో ఏడుగురు చాలా అనుభవజ్ఞులు. వీరు కనీసం
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలు కోరుతున్నవారిలో ఏడుగురు చాలా అనుభవజ్ఞులు. వీరు కనీసం ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా పని చేశారు, మరోసారి ప్రజా సేవా భాగ్యాన్ని కోరుతున్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ నేతలు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి. కాగా ఎన్నికలు వచ్చే నెల 1, 5 తేదీల్లో జరుగుతాయి, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వచ్చే నెల 8న జరుగుతుంది.
కనీసం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులు ... యోగేష్ పటేల్ (మంజల్ పూర్), పబుభ మనేక్ (ద్వారక), కేశు నక్రానీ (గరియాధర్), పురుషోత్తమ్ సోలంకి (భావ్ నగర్ గ్రామీణం), పంకజ్ దేశాయ్ (నడియాడ్).
భారతీయ ట్రైబల్ పార్టీ (BTP) వ్యవస్థాపకుడు చోటు వాసవ, మధు శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బీటీపీ అధ్యక్షునిగా చోటు వాసవ కుమారుడు మహేశ్ వాసవ వ్యవహరిస్తున్నారు. చోటు కోరిన స్థానాన్ని ఆయన కుమారునికి ఇవ్వడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మధు శ్రీవాస్తవకు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు.
ఈ ఏడుగురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో నిరంతరం సత్సంబంధాలను కొనసాగిస్తుండటం, కుల సమీకరణాల వల్ల తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. యోగేష్ పటేల్, పబుభ మనేక్, చోటు వాసవ ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఎనిమిదోసారి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
నక్రానీ, శ్రీవాస్తవ ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు, తాజాగా ఏడోసారి విజయఢంకా మోగించేందుకు కృషి చేస్తున్నారు. దేశాయ్, సోలంకి ఐదుసార్లు గెలిచి, ఆరోసారి బరిలో నిలిచారు. యోగేష్ పటేల్ విజయ పరంపర 1990లో మొదలైంది. అప్పట్లో ఆయన జనతాదళ్ పార్టీ తరపున రావ్‌పుర శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 75 ఏళ్లు పైబడినవారికి టిక్కెట్లు ఇవ్వరాదని బీజేపీ తనకు తాను విధించుకున్న నిబంధనను పక్కనబెట్టి ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఈ విధంగా టిక్కెట్ పొందినవారు ఆయన ఒక్కరే. దీంతో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధిక వయస్కుడు ఆయనే. రావ్‌పుర నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, మంజల్‌పూర్ నుంచి రెండుసార్లు ఆయన గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2012లో మంజల్‌పూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పుడు మరోసారి తనను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరుతున్నారు.
విజయ్ రూపానీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పటేల్ పని చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన పబుభ మనేక్ ఎన్నిక ఈసారి వివాదాస్పదం అయింది. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ కారణంగా ఆయన శాసనసభ్యత్వం చెల్లనిదైపోయింది. ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఆయన ప్రాతినిధ్యంవహిస్తున్న ద్వారక నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఆయనకు ఉపశమనం కల్పించలేదు కానీ ప్రజాప్రతినిధి లేని స్థానంగా ద్వారకను ప్రకటించవద్దని ఆదేశించింది. మనేక్ 1990, 1995, 1998లలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2002లో కాంగ్రెస్ అభ్యర్థిగానూ, 2007లో బీజేపీ అభ్యర్థిగానూ విజయం సాధించారు.
గిరిజన నేత చోటు వాసవ మొదట జనతాదళ్ అభ్యర్థిగా 1990లో జగడియా నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. 1998లో జనతా దళ్, ఆ తర్వాత జనతా దళ్ (యునైటెడ్) పార్టీల అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2017లో భారతీయ ట్రైబల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి, గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో బీటీపీ తరపున ఆయన కుమారుడు మహేశ్ పోటీ చేస్తున్నారు. కానీ ఆయన మద్దతుదారుల డిమాండ్ మేరకు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన కుమారుడు మహేశ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇదిలావుండగా, చోటు వాసవ 2004, 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, పరాజయంపాలయ్యారు.
వఘోడియాలో బలమైన నేతగా పేరున్న మధు శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఐదుసార్లు బీజేపీ తరపున పోటీ చేసి గెలిచినప్పటికీ, ఈసారి ఆయనకు ఆ పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాస్తవ మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల బరిలో దిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 1998, 2002, 2007, 2012, 2017లలో బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన బెస్ట్ బేకరీ కేసులో సాక్షిని బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
కేశు నక్రానీ ఏడోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన భావ్‌నగర్ జిల్లాలోని గరియాధర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 1995 నుంచి 2007 వరకు సిహోర్ స్థానం నుంచి, 2012, 2017లలో గరియాధర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో గరియాధర్ నియోజకవర్గం ఏర్పాటైంది.
పురుషుత్తమ్ సోలంకి గ్రామీణ భావ్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కోలీ సామాజిక వర్గ నేత. ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన 1998 నుంచి 2007 వరకు ఘోఘో స్థానం నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గ్రామీణ భావ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2012 నుంచి 2017 వరకు గ్రామీణ భావ్ నగర్ నుంచే విజయం సాధించారు. ఆయన మత్స్యశాఖ మంత్రిగా పని చేసిన కాలం (2008)లో రూ.400 కోట్ల ఫిషరీస్ స్కామ్‌లో ఆరోపణలను ఎదుర్కొన్నారు. కోలీ సామాజిక వర్గంలో సోలంకికి మంచి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఈ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.
పంకజ్ దేశాయ్ 1998 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నుంచి బీజేపీ చీఫ్ విప్‌గా పని చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన నడియాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
విశ్లేషకుల కథనం ప్రకారం, ఈ అభ్యర్థుల్లో చాలా మంది క్షేత్ర స్థాయి నుంచి ఎదిగినవారే. పార్టీ పట్ల వారికిగల విధేయత వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది. యోగేష్ పటేల్ జనసంఘ్ రోజుల నుంచి కార్యకర్తగా పని చేస్తున్నారు. పార్టీలో సంఘర్షణను ఎదుర్కొన్నప్పటికీ ఆయన పార్టీకి విధేయంగానే ఉన్నారు. వీరంతా ముఖ్యంగా కార్యకర్తలతో అవినాభావ సంబంధాలను కొనసాగిస్తుండటం మరో విశేషం.