Munugode By Election: రేపే ‘మునుగోడు’ పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2022-11-02T19:46:22+05:30 IST
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక (Munugode By Election) ఈ నెల 3వ తేదీన(గురువారం) జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు.
నల్లగొండ: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక (Munugode By Election) ఈ నెల 3వ తేదీన(గురువారం) జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రశాంతంగా పోలింగ్ పూర్తి చేసేందుకు భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తు, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు అన్నింటిపైనా దృష్టి సారించారు. నల్లగొండ జిల్లా చండూరులోని జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేశారు. వారికి కేటాయించిన రూట్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా తమ తమ పోలింగ్ కేంద్రాలకు పోలీస్ భద్రత నడుమ బుధవారం సాయంత్రమే చేరుకున్నారు. ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులు పంకజ్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి ఎన్నికల సామాగ్రి పంపిణీని పర్యవేక్షించారు. పోలింగ్ రోజు పాటించాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఉప ఎన్నికలో మొత్తం 45మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy), టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు కాగా, ఇందులో పురుషులు 1,21,720, మహిళలు 1,20,128 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా అందులో 1,000మంది పోలీసులు ఉన్నారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ (ఓపీవో)తో పాటు నియోజకవర్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర బలగాలతో సంయుక్తంగా పోలింగ్ బూత్‌లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.