Samantha: మయోసైటిస్ ప్రాణాంతకమా?
ABN , First Publish Date - 2022-11-01T17:05:50+05:30 IST
ఒళ్లు నొప్పులు సర్వసాధారణమే! అయితే వాటికి ఇంకొన్ని లక్షణాలు తోడైతే దాన్ని మయోసైటిస్‌గా అనుమానించాలి. ప్రతి 10 వేల నుంచి లక్ష మందిలో ఒకరిని వేధించే ఈ వ్యాధి
ఒళ్లు నొప్పులు సర్వసాధారణమే! అయితే వాటికి ఇంకొన్ని లక్షణాలు తోడైతే దాన్ని మయోసైటిస్‌గా అనుమానించాలి. ప్రతి 10 వేల నుంచి లక్ష మందిలో ఒకరిని వేధించే ఈ వ్యాధి, తాజాగా ప్రముఖ నటి సమంతకూ సోకింది. మయోసైటిస్ అనే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
ప్రాణాంతకమా?
జబ్బు తీవ్రమైతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. గుండె కూడా ఓ కండరమే! కాబట్టి గుండె దెబ్బతింటే అది కొట్టేకునే వేగం గాడి తప్పి, గుండె ఆగిపోయే పరిస్థితి సైతం తలెత్తవచ్చు. 20 నుంచి 25ు మందిలో ఈ పరిస్థితి ఉంటుంది.
శరీరం ట్రిగ్గర్ అయితే...
మయోసైటి్‌సకు జన్యుపరమైన మేకప్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు,పర్యావరణం ఇలా వేర్వేరు కారణాలుంటాయి. వీటి మూలంగా శరీరం ట్రిగ్గర్ అయినప్పుడు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ మొదలవుతుంది.
అసలేం జరుగుతుంది?
శరీరంలోకి వ్యాధికారక క్రిములు చొరబడితే, రక్తంలోని తెల్ల రక్తకణాలు, క్రిములతో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. మయోసైటిస్‌లో అకారణంగా యాంటీబాడీలు విడుదలై, కండరాల్లోని ప్రొటీన్‌ను డ్యామేజ్ చేయడం మొదలుపెడతాయి. దాంతో కండరంలో వాపు మొదలై, బలహీనపడుతుంది. దీనికి తోడు మయోసైటిస్‌కు సంబంధించిన ఇతరత్రా లక్షణాలు కూడా మొదలవుతాయి.
సమంతకు కొత్త కష్టం
సాధారణంగా వ్యాధి నిరోధక వ్యవస్థ, శరీరంలోకి చొరబడే వ్యాధికారక క్రిములను సంహరిస్తూ, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది క్రమం తప్పి, శరీరం మీదే తిరగబడుతుంది. ఆ పరిస్థితే ‘మయోసైటిస్’. ఈ వ్యాధిలో ప్రధానంగా కండరాలు ఇన్‌ఫ్లమేషన్ (నొప్పి, వాపు)కు గురై, క్షీణిస్తాయి. ఈ వ్యాధిలో రకాలూ ఉన్నాయి. మయోసైటిస్ రకం, కండరాలు దెబ్బతిన్న తీవ్రతల ఆధారంగా వ్యాధిని గుర్తించి చికిత్స చేయవలసి ఉంటుంది. శరీర జీవక్రియలు సక్రమంగా కొనసాగడానికి కండరాలు తోడ్పడతాయి. మయోసైటిస్ మూలంగా కండరాలు దెబ్బతిన్నప్పుడు, వాటి ఆధారంగా పని చేసే అవయవాల పనితీరు కూడా కుంటుపడుతుంది. కొన్ని మయోసైటి్‌సలలో ఊపిరితిత్తులు, గుండె కండరాలు కూడా దెబ్బతిని, ఆయా అవయవాల సామర్ధ్యం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. కాబట్టి సకాలంలో గుర్తించాలంటున్నారు వైద్యులు.
ప్రధానంగా మూడు రకాలు
లక్షణాలు, ప్రభావానికి గురైన కండరాల ఆఽధారంగా, మయోసైటి్‌సను ఐదు నుంచి పది విభాగాలుగా విభజించవచ్చు. కానీ పాలీ మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, డెర్మటో మయోసైటిస్ అనే మూడు ప్రధాన మయోసైటిస్‌లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి రెండూ చికిత్సకు లొంగితే, డెర్మటోమయోసిస్ చికిత్సకు లొంగకుండా మొండిగా వేధిస్తుంది. అయితే పేరు కొత్తగా ఉంది కదా? అని ఇదేదో అరుదైన వ్యాధి అనుకుంటాం. కానీ నిజానికి ప్రతి 10 వేల నుంచి లక్ష మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుందనీ, వారంలో ఈ వ్యాధి సోకిన కనీసం ఒకరిద్దరైనా తనను సంప్రతిస్తూ ఉంటారనీ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శివరామ్ రావు అంటున్నారు. మన శరీరంలోని ఆటో యాంటీబాడీలే మన కండరాల ప్రొటీన్‌ను దెబ్బతీసే మయోసైటిస్ ఫలితంగా కండరాలు బలహీనపడతాయి.
డెర్మటో మయోసిస్: చర్మం మీద ర్యాషెస్ (దద్దుర్లు) మొదలవుతాయి. కొన్ని కేన్సర్లలో ఈ రకం మయోసైటిస్ కూడా కనిపిస్తుంది. 25 నుంచి 40 ఏళ్ల వారిలో, పెద్దల్లో ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ప్రభావం చేతులు, కాళ్లలోని పై కండరాల మీదే ఎక్కువగా ఉంటుంది.
పాలీ మయోసైటిస్: వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. విపరీతమైన కండరాల నొప్పులుంటాయి. సాధారణంగా చేయి పైభాగంలోని కండరాలు, తొడల్లోని కండరాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. కొందర్లో అన్నవాహిక కండరాలు దెబ్బతిని ఆహారం మింగడం కష్టమవుతుంది.
ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్: పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కండరాల నొప్పులు క్రమేపీ పెరిగిపోతూ, కూర్చుంటే పైకి లేవలేని పరిస్థితి వస్తుంది.
లక్షణాల మీద ఓ కన్నేసి...
ఒళ్లు నొప్పులతో బయటపడే ఈ వ్యాధిని కనిపెట్టడం తేలికే! సాధారణంగా ఒళ్లు అలసిపోతే ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఈ వ్యాధిలో ఒళ్లు నొప్పులు క్రమేపీ పెరుగుతూ, వాటికి ఇంకొన్ని లక్షణాలు తోడవుతాయి. అవేంటంటే...
ఒళ్లు నొప్పులు, జ్వరం
కూర్చుంటే లేవడం కష్టంగా ఉంటుంది
చేతులు పైకి లేపలేరు
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది
మింగడం కష్టమవుతుంది
నీళ్లు తాగుతున్నప్పుడు, ముక్కులో నుంచి నీళ్లు బయటకు రావడం
గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా తగ్గడం, ఇర్రెగ్యులర్ హార్ట్‌బీట్ (అరిథ్మియా)
నిర్ధారణే కీలకం
మయోసైటిస్ రకం, తీవ్రత, యంటీబాడీ రకం, జరిగిన నష్టాలను కొన్ని పరీక్షలతో గుర్తించవచ్చు. మయోసైటిక్ ప్యానల్ అనే రక్తపరీక్షతో యాంటీబాడీ రకాన్నీ, మజిల్ బయాప్సీతో కండరానికి జరిగిన నష్టాన్నీ తెలుసుకోవచ్చు.
నిర్లక్ష్యం ప్రమాదకరం
ఒళ్లు నొప్పులను పెయిన్ కిల్లర్‌తో తగ్గించుకోవచ్చు. కానీ ఆ అవసరం పెరుగుతున్నా, కండరాల నొప్పులకు తోడు ఇతరత్రా లక్షణాలు తోడవుతున్నా, నొప్పులు తగ్గకుండా పెరుగుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. మయోసైటి్‌సగా నిర్థారణ అయితే చికిత్సతో దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇలా కాకుండా మయోసైటి్‌సను నిర్లక్ష్యం చేస్తే, వ్యాధి క్రమేపీ తీవ్రమై గుండె, ఊపిరితిత్తులు ప్రభావితమై ప్రాణాంతక పరిస్థితికి దారి తీయవచ్చు.
ఈ జాగ్రత్తలూ తప్పనిసరి
చికిత్సను కొనసాగిస్తూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...
ప్రొటీన్ మూలంగా కిడ్నీలు పాడవకుండా, నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
కండరాలకు వ్యాయమాన్ని అందించే ఫిజియోథెరపీ చేయాలి. కండర నష్టాన్ని అరికట్టడం కోసం పోషకాహారం తీసుకోవాలి.
వ్యాధినిరోధకశక్తిని మందులతో అణచి ఉంచే చికిత్స తీసుకుంటారు కాబట్టి, తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి జనసమ్మర్థ ప్రదేశాలకు దూరంగాఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి.
చికిత్స ఇలా...
వ్యాధి నిరోధకశక్తి మూలంగా తలెత్తే వ్యాధి కాబట్టి దాన్ని అణచి ఉంచడమే లక్ష్యంగా మయోసైటిస్ చికిత్స సాగుతుంది. ఇందుకోసం స్టిరాయిడ్ ఇంజెక్షన్లను వాడుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్టిరాయిడ్ పెయిరింగ్ డ్రగ్స్ కూడా వాడుకోవలసి ఉంటుంది. అలాగే యాంటీబాడీలను తటస్థం చేయడం కోసం ఐవిఐజి ఇంజెక్షన్ (ఇమ్యునో గ్లాబ్యులిన్) తీసుకోవలసి ఉంటుంది. అయితే వ్యాధి కారణాన్ని బట్టి చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. వైరల్ మయోసైటిస్ తక్కువ వ్యవధిలోనే తగ్గిపోతుంది. అలా కాకుండా వ్యాధినిరోధక శక్తి వల్ల వచ్చినదైతే, చికిత్సతో తగ్గినా, మళ్లీ తిరగబెట్టే అవకాశాలుంటాయి. అలాగే జబ్బు హఠాత్తుగా తలెత్తితే, స్టిరాయిడ్లు తీసుకోవడం, వ్యాధి తీవ్రతను బట్టి ‘ఐవిఐజి’, ‘రెటిక్యుమాబ్’ అనే ఇంజెక్షన్స్ తీసుకోవలసి ఉంటుంది. వాటితో శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ అదుపులోకి వస్తుంది. అయితే స్టిరాయిడ్లను ఎక్కువ కాలం వాడలేం కాబట్టి, వ్యాధి పెరగకుండా నియంత్రణలో ఉంచడం కోసం ఇతరత్రా మందులు వాడుకోవలసి ఉంటుంది. ఈ చికిత్సను ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు తీసుకోవాలి. కొంత మందికి జీవితాంతం కొనసాగించవలసిన అవసరం ఉంటుంది.
-డాక్టర్. శివరామ్ రావు,
సీనియర్ న్యూరాలజిస్ట్,
యశోద హాస్సిటల్స్, సికింద్రాబాద్.