Heart Attackతో సడన్ డెత్‌లు! కారణమిదే..!
ABN , First Publish Date - 2022-12-23T11:48:22+05:30 IST
మొదటి, రెండో వేవ్‌ల్లో కొవిడ్ (covid) బారిన పడిన వారిలో చాలా మంది ఇప్పటికీ ఆ ప్రభావానికి గురవుతూనే ఉన్నారు! అప్పటిదాకా
కొవిడ్ తర్వాత పెరిగిన కేసులు.. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ
హృదయ స్పందనల్లో తేడా.. కుప్పకూలిపోతున్న యువత
హృద్రోగుల్లో రాత్రిపూట పనిచేసేవారి సంఖ్య దాదాపు 10%
కదలకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం,
ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగంతో ముప్పు అధికం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మొదటి, రెండో వేవ్‌ల్లో కొవిడ్ (covid) బారిన పడిన వారిలో చాలా మంది ఇప్పటికీ ఆ ప్రభావానికి గురవుతూనే ఉన్నారు! అప్పటిదాకా సాధారణంగా కనిపించినవారు అకస్మాత్తుగా గుండెపోటు(Heart Attck)తో కుప్పకూలడం.. హృదయవైఫల్యంతో ఆస్పత్రులపాలు కావడం.. అకాలమరణాల వంటివి ఇటీవలికాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్(covid)కు ముందుతో పోలిస్తే.. ఇప్పుడు హృద్రోగ కేసులు పెరిగాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నే తీసుకుంటే.. నగరంలోని కార్డియాలజిస్టు(Cardiologist)ల వద్దకు రోజుకు సగటున 40 నుంచి 50 మంది గుండె ఇబ్బందులతో వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందునా ఇటీవలికాలంలో తమ వద్దకు వస్తున్నవారిలో.. 20 నుంచి 35 ఏళ్ల వారు 40 శాతం, 30 నుంచి 45 ఏళ్ల వారు 35 శాతం, 45 నుంచి 65 ఏళ్ల వారు 25 శాతం వరకు ఉంటున్నట్లు కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
ఒత్తిడి తట్టుకోలేక..
కొవిడ్‌తోపాటు.. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక చెడు కొలెస్టరాల్, స్థూలకాయం, ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, యాంత్రిక జీవనం, ఉరుకులు పరుగులు, రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం/పనిపై ధ్యాస పెట్టడం, ఆహార శైలి.. ఇవన్నీ గుండెకు చేటుగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ బాధితుల్లో తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుంటే గుండెజబ్బుల ముప్పు ఎక్కువని హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం పేరిట రాత్రింబవళ్లూ పని చేస్తున్నారని.. ఇలా పొద్దస్తమానం ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిచేయడం మంచిది కాదని పేర్కొన్నారు. జీవగడియారానికి విరుద్ధంగా మన జీవనశైలి ఉంటే శరీరం దాన్ని తట్టుకోలేక ఒత్తిడికి గురవుతుందని హెచ్చరించారు. రాత్రి పూట పనిచేసే(Night Works) వారిలో గుండె జబ్బులు అధికంగా ఉంటున్నాయని.. తమ వద్దకు వస్తున్న బాధితుల్లో 10 శాతం దాకా ఇలాంటివారే ఎక్కువగా ఉంటున్నారని వారు వివరించారు.
దుర్వ్యసనాలతో ముప్పు..
పోగతాగే వారిలో రక్తం గడ్డ కట్టి స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని వైద్యులు తెలిపారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే ధూమపాన పియ్రులకు గుండెపోటు ప్రమాదం 10 రెట్లు ఎక్కువని.. మాదకద్రవ్యాలు వినియోగించేవారిలో కూడా స్ట్రోక్ ముప్పు ఎక్కువని వారు వివరించారు. డ్రగ్స్ వాడకం వల్ల గుండె రక్తనాళాలు కుదించుకుపోయి రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడుతాయని హెచ్చరించారు. గుండె భద్రంగా ఉండాలంటే ఇలాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడంతోపాటు.. పౌష్టికాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, కంటినిండా నిద్ర పోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఒకే చోట కదలకుండా ఎక్కువసేపు కూర్చుని పనిచేయొద్దని, పనిప్రదేశాల్లో ప్రతి అరగంట/గంటకు లేచి అటూ ఇటూ కాసేపు నడవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఐటీ ఉద్యోగులలో..
ఇటీవలికాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల(Software employees)లో ఎక్కువ మంది మధుమేహం, హృద్రోగాల బారినపడుతున్నారు. వారు రోజులో ఎక్కువసేపు పనిచేయడం, రాత్రి పగలు మేలుకుంటుండడంతో వారి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ల్యాప్‌ట్యాప్(Laptop) ముందు ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అక్కడే కూర్చోని ఏదో ఒకటి తినడం వల్ల బరువు పెరుగుతుంది. అందుకే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో నడుము చుట్టు కొలత ఎక్కువగా ఉండడం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు ఉంటున్నాయి. ఇవి గుండె పోటు ముప్పును పెంచుతాయి. ఇతరులతో పోలిస్తే.. డెస్క్ వర్క్(Desk work) చేసే వారిలో గుండెపోటు ప్రమాదం 20% ఎక్కువ.
- డాక్టర్ గోపీచంద్ మన్నం, ఎండీ, స్టార్ ఆస్పత్రి
కొవిడ్ ప్రభావమూ
గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరికీ అది కొవిడ్‌వల్లనే అని నిర్ధారించలేం. గుండెపై కరోనా వైరస్ ప్రభావం మొదట్లో ఉన్నంత ఇప్పడు లేదు. అయితే.. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడనివారితో పోలిస్తే కరోనా సోకినవారిలో హృద్రోగాల ముప్పు 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. కొవిడ్‌కు ముందు.. ఆస్పత్రులకు వచ్చే హృద్రోగుల సంఖ్య నెలకు 4500 నుంచి 5000 దాకా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5000 నుంచి 6000కు పెరిగింది.
- డాక్టర్ పీసీ రథ్, కార్డియాలజీ విభాగాధిపతి, అపోలో ఆస్పత్రి
30 శాతం మంది
గుండెపోటు ఎప్పుడు వచ్చినా 30 శాతం మంది చనిపోతున్నారు. అక్యూట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి.. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికేచనిపోతున్నారు. చాలా మంది గుండెపోటును గుర్తించక నిర్లక్ష్యం చేస్తున్నారు. గుండెపోటు వస్తే తగిన విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే హృదయస్పందనలు ఆగి కుప్పకూలిపోతారు.కొవిడ్, లాక్‌డౌన్ సమయం(Lockdown time)లో చాలా మంది ఇంట్లోనే గడపడం వల్ల వ్యాయమం అలవాటు తగ్గిపోయింది. హృద్రోగుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
- డాక్టర్ శరత్‌రెడ్డి, సీనియర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, మెడికవర్ ఆస్పత్రి