S Jai Shankar: పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు దిమ్మితిరిగే సమాధానం
ABN , First Publish Date - 2022-12-16T12:24:37+05:30 IST
ఉగ్రవాదంపై పాక్ జర్నలిస్టు ఒకరు అడిగిన ప్రశ్నకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ దిమ్మతిరిగే సమాధానం ..
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదంపై పాక్ జర్నలిస్టు ఒకరు అడిగిన ప్రశ్నకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S. Jai Shankar) దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న అడగాల్సిన మంత్రిని అడగాలని చెబుతూ.. ''మీ మంత్రినే (పాక్) అడగండి'' అని సూటి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలైందో ఈ ప్రపంచం మర్చిపోలేదని, ఆ దేశం (పాక్) ఎన్ని మాటలు మాట్లాడినా, నిజం ప్రతి ఒక్కరికి తెలుసునని, ఉగ్రవాద కేంద్రంగానే వాళ్లను ప్రపంచం చూస్తోందని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం అనుసరించార్సిన విధాలలపై ఐక్యరాజ్యసమితి (United Nations) భద్రతా మండలిలో చర్చ జరిగింది. ఈ సమావేశానంతరం మీడియాతో జైశంకర్ మాట్లాడారు. ఉగ్రవాదన్ని భారత్ కంటే ఎవరూ మెరుగ్గా ఉపయోగించుకోలేరంటూ పాక్ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. యావత్ ప్రపంచం ఆ దేశాన్ని ఉగ్రవాద కేంద్రంగా చూస్తోందన్నారు.
''గత రెండున్నరేళ్లుగా మన ఆలోచనలన్నీ కరోనా మమహ్మారి చుట్టూనే ఉన్నాయి. ప్రపంచం ఏమాత్రం తెలివితక్కువది కాదు. ఉగ్రవాదం ఎక్కడ మొదలైందనే విషయాన్ని యావత్ ప్రపంచం మరచిపోదు. ఇతర దేశాలను వేలెత్తిచూపే వాళ్లు ముందుకు తామేంటో గుర్తుచేసుకోవాలని'' అని పాక్‌కు చురకలు అంటించారు. 2011లో హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌లో పర్యటించారని, అప్పుడు హిన రబ్బాని ఖర్ మంత్రిగా ఉన్నారని అన్నారు. ఆ సమయంలో పాక్‌ను ఉద్దేశించి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ, పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు అవి కేవలం పొరుగువారినే కాటేయాలని ఆశించరాదని, చివరకి అవి వారిని కూడా కాటేస్తాయని చెప్పారని అన్నారు. కానీ, పాకిస్థాన్‌కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదని, ఆ దేశంలో ఏమి జరుగుతోందో అందరికీ తెలుసునని జై శంకర్ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ ఇకనైనా తమ చేష్టలను మార్చుకుని, పొరుగుదేశాల పట్ల స్నేహంగా ఉండాలని హితవు పలికారు. ఇవాళ ప్రపంచం ఆర్థిక వృద్ధి, ప్రగతి, అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్న విషయాన్ని ఆ దేశం (పాక్) అర్ధం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు.