Midterm elections: సెనెట్‌పై పట్టునిలుపుకున్న డెమోక్రాట్లు
ABN , First Publish Date - 2022-11-13T22:06:56+05:30 IST
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ పెద్దల సభ సెనెట్‌లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీపై పైచేయి సాధించింది.
వాషింగ్టన్: హోరాహోరీగా సాగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(Midterm elections) అధికార డెమోక్రటిక్ పార్టీ(Democratic party).. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీపై(Republican party) పైచేయి సాధించింది. బిల్లుల ఆమోదానికి కీలకమైన పెద్దల సభ సెనెట్‌పై(Senate) తన పట్టునిలుపుకుంది. డెమోక్రాట్ అభ్యర్థులు కార్టెజ్ మాస్టో, మార్క్ కెల్లీ తాజాగా విజయం సాధించడంతో సెనెట్‌లో డెమోక్రాట్ల సంఖ్య 50కి చేరుకుంది. 100 సీట్లున్న సెనెట్‌లో రిపబ్లికన్ల సంఖ్య ప్రస్తుతం 49. జార్జియా సెనెట్ స్థానానికి డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో డెమోక్రాట్లు ఓడిపోయినా..వారికి నష్టం ఉండదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సెనెట్‌లో ఓ బిల్లు పాసవ్వాలంటే కనీసం 51 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. ఇక ఏదైనా బిల్లుకు అనుకూల ఓట్లు 50, వ్యతిరేక ఓట్లు మరో యాభై వచ్చిన సందర్భాల్లో పీటముడి తెంచేందుకు వైస్‌ప్రెసిడెంట్ కమలా హారిస్(Kamala Harris) తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కమలా హారిస్ అధికార పార్టీ అభ్యర్థి కావడంతో.. జో బైడెన్(Joe biden) తన బిల్లులకు సెనెట్ ఆమోదాన్ని సునాయసంగా దక్కించుకోగలుగుతారు.
ఈ పరిణామాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు మింగుడుపడటం లేదు. ఈ ఎన్నికల్లో తమ హవా కనిపిస్తుందని ఆశించిన వారికి చివరకు నిరాశే మిగిలింది. సెనెట్‌పై ఆధిపత్యం కోరకున్న వారికి ఇందుకు విరుద్ధమైన ఫలితం ఎదురైంది. ఈ అపజయాలకు బాధ్యత ఎవరు వహించాలన్న చర్చ ఇప్పటికే పార్టీలో మొదలైంది. చర్చ అంతా ట్రంప్ చుట్టూనే తిరుగుతోంది. పలు స్థానాల్లో ఆయన రంగంలోకి దింపిన ప్రముఖులు అపజయాన్ని మూటకట్టుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు భారీ ఊరటనిచ్చాయి. తగ్గుతున్న బైడెన్ పాపులారిటీ, పెరుగుతన్న ద్రవ్యోల్బణం తదితర అంశాలు డెమోక్రాట్ల విజయావకాశాలు తగ్గిస్తాయన్న భయాలు ఈ విజయంతో తొలగిపోయాయి. అంతేకాకుండా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీ పడరన్న ఊహాగానాలకూ తాత్కాలికంగా తెరపడింది.