Donald Trump: వచ్చే వారం కీలక ప్రకటన చేస్తా.. డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-11-08T20:17:08+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు కీలక సంచలన కామెంట్ చేశారు. వచ్చే వారం కీలక ప్రకటన చేయబోతున్నానంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Donald Trump: వచ్చే వారం కీలక ప్రకటన చేస్తా.. డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో దిగనున్నారా.. అంటే.. అవుననే అంటున్నారు ఆయన మద్దతుదారులు. ఈ విషయంలో డోనాల్ట్ ట్రంప్ ఇప్పటివరకూ ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ.. ఆయన సోమవారం ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వచ్చే వారు తాను ఓ భారీ ప్రకటన చేయబోతున్నానంటూ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ఆ ప్రకటన ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ఎన్నికల్లో తన రంగ ప్రవేశం గురించేనన్న టాక్ అమెరికా వర్గాల్లో వైరల్ అవుతోంది.

2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్(Joe Biden) చేతిలో ఓటమి చెందినా కూడా ట్రంప్ ఏనాడు తన అపజయాన్ని అంగీకరించలేదు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటూ గతంలో అనేక మార్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇక సోమవారం ఓహాయో రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మరింత స్పష్టమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘‘నవంబర్ 15న మార్ ఏ లాగో నివాసంలో నేను ఓ భారీ ప్రకటన చేయబోతున్నా’’ అని ట్రంప్ చెప్పగానే అక్కడి వారు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ హడావుడి చేసేశారు. ఆయన ప్రకటన రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించేనంటూ రిపబ్లికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు(Mid-term Elections) జరగనున్నాయి. ప్రస్తుత ప్రతినిధుల సభ(House of Representatives) సభ్యులందరి పదవీ కాలం త్వరలో ముగియనుండంతో.. ప్రజలు కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారు. దీనితో పాటూ కొన్ని రాష్ట్రాల గవర్నర్ పోస్టులు, పెద్దల సభ సెనెట్‌‌లోని(Senate) మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రతినిధుల సభలో అధికార డెమోక్రాట్(Democrats) ప్రతినిధుల సంఖ్య 220 కాగా.. ప్రతిపక్ష రిపబ్లికన్(Republican) పార్టీ వారి సంఖ్య 212. ఇక సెనెట్‌లో డెమోక్రాట్ల సంఖ్య 50 కాగా రిపబ్లికన్‌ల సంఖ్య మరో 50. సెనెట్‌లో ఇరు పక్షాలకూ సమానబలం ఉంది. ఈ ఎన్నికలు బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రటిక్ పార్టీకి పెను సవాలు విసరనున్నాయి. ‘‘మీరందరూ కదలి వచ్చి ఓటేస్తే.. ప్రజాస్వామ్యం బతుకుతుంది.’’ అంటూ ఆయన ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ పాలనపై ఇదో రెఫరెండమ్ అని అక్కడి రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

పెరుగుతున్న జీవన వ్యయాలు, అబార్షన్ హక్కులు, మహిళా హక్కులు, తుపాకీ సంస్కృతి, నేరాలు, వలసలు, విద్య, వాతావరణ మార్పులు ఇత్యాది అంశాలన్నీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. బైడెన్ పాపులారిటీ పడిపోతున్నట్టు ఇప్పటికే కొన్ని సర్వేలు సూచించాయి. ఇక ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వెనుకబడితే.. రెండేళ్ల తరువాత జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రెట్లకు ఓటమి తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి. మిడ్ టర్మ్‌లో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే డోనాల్డ్ ట్రంప్ వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఖరారైపోతుంది. అంతేకాకుండా.. అమెరికా చట్టసభల్లో రిపబ్లికన్లకు బలం పెరిగి.. అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నాలకు గండికొట్టే శక్తి సమకూరుతుంది.

Updated Date - 2022-11-08T20:21:20+05:30 IST