US Capitol: క్యాపిటల్‌పై దాడి వెనుక డోనాల్డ్ ట్రంప్‌ కుట్ర.. అమెరికా నివేదిక

ABN , First Publish Date - 2022-12-20T20:10:20+05:30 IST

గతేడాది అమెరికా చట్టసభల వేదిక యూఎస్ క్యాపిటల్‌పై దాడి కేసును దర్యాప్తు చేసిన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ సభ) కమిటీ.. నాటి ఘటనలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని సోమవారం తేల్చింది.

US Capitol: క్యాపిటల్‌పై దాడి వెనుక డోనాల్డ్ ట్రంప్‌ కుట్ర.. అమెరికా నివేదిక

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది అమెరికా చట్టసభల వేదిక యూఎస్ క్యాపిటల్‌పై(US Capitol) దాడి ఉదంతాన్ని దర్యాప్తు చేసిన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ సభ) కమిటీ.. నాటి ఘటనలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పాత్ర ఉందని సోమవారం తేల్చింది. అమెరికాపై తిరుగుబాటు సహా పలు క్రిమినల్ నేరాలు ఆయనపై మోపి దర్యాప్తు జరపాలంటూ న్యాయశాఖకు తాజాగా సూచించింది. 2020 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి అనంతరం ట్రంప్.. ఎన్నికల్లో అవకతవకల కారణంగానే తాను ఓడిపోయానంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ట్రంప్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. ఫలితంగా.. 2021 జనవరి 6న ట్రంప్ అభిమానులు క్యాపిటల్‌ను ముట్టడించి అల్లకల్లోలం సృష్టించారు. ఆ సమయంలో బైడెన్ గెలుపును ధృవీకరించేందుకు కొలువు తీరిన చట్టసభ సభ్యులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అమెరికా చరిత్రలో ఈ ఘటన ఓ చీకటిరోజుగా మిగిలిపోయింది.

ట్రంప్ మద్దతుతోనే ఆయన అభిమానులు క్యాపిటల్‌ను ముట్టడించారని నాటి నుంచీ బైడెన్ నేతృత్వంలోని డెమోక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వంపై తిరుగుబాటుగా అభివర్ణించింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో డెమోక్రాట్ల ఆధిక్యం ఉన్న దిగువ సభ.. ‘క్యాపిటల్‌పై దాడి’లో ట్రంప్‌ పాత్ర ఎంతో తేల్చేందుకు ఓ కమిటీని(House Committee) నియమించింది. ప్రజలను ఉసిగొల్పడం, తిరుగుబాటుకు ప్రేరేపించడం తదితర నాలుగు క్రిమినల్ నేరాలకు ట్రంప్‌ పాల్పడ్డారని తాజాగా తేల్చింది. దాడికి పాల్పడ్డ వారికి ట్రంప్ సహాయసహకారాలు అందించారని తన నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. కమిటీలోని ఏడుగురు డెమోక్రటిక్ పార్టీ సభ్యులతో పాటూ ఇద్దరు రిపబ్లికన్ నేతలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. కమిటీ నిర్ణయాలను అమెరికా న్యాయశాఖకు పంపించాలని తీర్మానించారు.

ఈ పరిణామంపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకప్పుడు నన్ను అధ్యక్షపదవి నుంచి దింపేసే ప్రయత్నం చేసిన డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు ఏకపక్షంగా నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు యత్నిస్తోంది. వాళ్లకు అర్థం కానీ విషయం ఏంటంటే..ఈ చర్యలతో నేను మరింత శక్తివంతుణ్ణి అవుతా.. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వారందరూ నాకు మద్దతుగా నిలుస్తారు’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. హౌస్ కమిటీ సూచనలకు న్యాయశాఖ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కమిటీ రికమెండేషన్లపై ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ న్యాయశాఖకు ఉంది.

ఇక ట్రంప్‌పై నేరారోపణ జరిగినా(Indictment) లేక క్యాపిటల్ దాడిలో ఆయన పాత్ర ఉన్నట్టు రుజువైనా(Conviction) వచ్చే ఇబ్బంది ఏమీ లేదని అమెరికా న్యాయనిపుణులు చెబుతున్నారు. అధ్యక్ష పదవికి సంబంధించి అమెరికా రాజ్యాంగం కేవలం మూడు అర్హతలను మాత్రమే ప్రస్తావించింది. అమెరికాలో పుట్టి, స్థానికంగా నివసిస్తూ నిర్దేశిత వయసున్న వారు అధ్యక్ష పదవి చేపట్టేందుకు అర్హులు. దీంతో..వచ్చే ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ గెలిచి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపినా ఆశ్చర్యపోనవసరం లేదని అక్కడి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే..అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికాపై తిరుగుబాటు చేసిన వారు కేంద్ర ప్రభుత్వ పదవులు చేపట్టేందుకు అనర్హులు. ఇప్పటికే అమెరికా న్యాయశాఖ ట్రంప్‌పై వచ్చిన తిరుగుబాటు అభియోగాలపై దర్యాప్తు చేస్తోంది. దీంతో..తదుపరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ట్రంప్ తిరుగుబాటుకు పాల్పడినట్టు రుజువైనా దీన్ని కోర్టులో సవాలు చేసేందుకు ఆయనకు అనేక మార్గాలున్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 14వ సవరణ తనకు వర్తించదంటూ ట్రంప్ సాంకేతిక అంశాల ఆధారంగా వాదించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - 2022-12-20T21:08:31+05:30 IST