Kim Jong Un: క్షిపణి ప్రయోగమా? వారసురాలి పరిచయమా?
ABN , First Publish Date - 2022-11-21T13:44:26+05:30 IST
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కాలు కదిపినా సంచలనమే, కామ్‌గా ఉన్నా సంచలనమే. ఆయన ప్రతి కదలికపైన ప్రపంచ దృష్టి ఉంటుంది. శత్రుదేశం..
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కాలు కదిపినా సంచలనమే, కామ్‌గా ఉన్నా సంచలనమే. ఆయన ప్రతి కదలికపైన ప్రపంచ దృష్టి ఉంటుంది. శత్రుదేశం అమెరికాను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగ స్థలికి తన కూతురు కిమ్ జు-ఏ (Kim Ju-ae)ను కిమ్ గత శనివారం తీసుకురావడంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది క్షిపణి ప్రయోగమా? కిమ్ నాల్గవ తరం వారసురాలు ఆమేనని ప్రకటించేందుకు ఆయన చేసిన ప్రయత్నమా? అనే చర్చ మొదలైంది. కిమ్ తన కుమార్తెతో కనిపించడం కూడా ఇదే తొలిసారి. దాంతో కొరియాలో నాలుగో తరం ఆనువంశిక పాలనకు ఆయన సంకేతాలిచ్చారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
కిమ్ భార్య, పిల్లల గురించి నార్త్ కొరియా మీడియో ఇంతవరకూ అధికారికంగా వెల్లడించిన దాఖలాలు కానీ, ప్రపంచానికి తెలిసింది కానీ చాలా తక్కువ. తాజాగా తండ్రీకూతుళ్లిద్దరూ చేతిలో చేయివేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో, బ్యాక్‌గ్రౌండ్‌లో బాలిస్టిక్ మిసైల్, అధికారులతో ఆయన మాట్లాడుతున్నట్టు, క్షిపణులను పరిశీలిస్తున్నట్టు ఉన్న ఫోటోలను ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ ఐసీఎన్ఏ (ICNA) ప్రచురించింది. దీంతో కిమ్ వ్యూహాత్మకంగానే తన కుమార్తెను ప్రమాదకర క్షిపణి ప్రయోగస్థలికి తీసుకువచ్చి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాలుగోతరం వారసులుగా కూడా తమ వారే ఉంటారని చెప్పడం కిమ్ ఉద్దేశం కావచ్చని వారు భావిస్తున్నారు.
సియోల్ స్పై ఏజెన్సీ కథనం ప్రకారం, నార్త్ కొరియా వ్యవస్థాపక నేత కిమ్ ఇల్ సుంగ్ (Kim Il sung) మనుమడు, మూడో తరానికి సారథ్యం వహిస్తున్న కిమ్ జోంగ్ 2009లో Ri sol Ju ను వివాహం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే తొలి సంతానికి ఆమె జన్మనిచ్చారు. 2013, 2017లో రెండు, మూడవ సంతానం కలిగింది. మాజీ ఎన్‌బీఏ స్టార్ డెన్నిస్ రాడ్‌మాన్ 2013లో నార్త్ కొరియా వెళ్లినప్పుడు కిమ్ కుమార్తె కిమ్ జు-ఏను కలుసుకున్నట్టు చెప్పడంతోనే బయట ప్రపంచానికి ఆ విషయం తెలిసింది. కాగా, కిమ్‌తో కలిసి ఫోటోగ్రాఫ్‌లో కనిపించిన అమ్మాయి కిమ్ రెండో కుమార్తె జు-ఏ కావచ్చని సెంటర్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్‌కు చెందిన చియాంగ్ సియోంగ్-చాంగ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తండ్రితో కలిసి పాప కనిపించడం చూస్తే ఆమె కిమ్ వారసురాలు కావచ్చనే అభిప్రాయానికి తావస్తోందన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి సైతం తన పోలికలు ఎక్కువగా ఉండటంతోనే కిమ్ జోంగ్ ఉన్‌ను తన వారసుడిగా ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. జు-ఏ ఇకముందు కూడా తండ్రితో కీలక సందర్భాల్లో పాల్గొంటే అది బలమైన వారసత్వ సంకేతమవుతుందని అన్నారు.
రాబోయే తరం..
నార్త్ కొరియా ఈ ఏడాది వరుసగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఏ ఏడాదిలోనూ ప్రయోగించన్ని క్షిపణలు ప్రయోగించి రికార్డు సృష్టించింది. శుక్రవారం ప్రయోగించిన ICBM అమెరికాను ఢీకొనే సామర్థ్యం ఉందని జపాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో కిమ్ తన కుమార్తెను క్షిపణి ప్రయోగ స్థలికి తీసుకురావడం నార్త్ కొరియాలో కిమ్ హయాం కొనసాగుతుందనే సంకేతంగా భావించవచ్చని ప్రముఖ విశ్లేషకుడు సూ కిమ్ అభిప్రాయపడ్డారు. నార్త్ కొరియా భవిష్యత్ నాయకురాలిగా కూతుర్ని తీర్చిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కిమ్ తన కూతురిని దేశానికి భావి నాయకురాలిగా తయారుచేసే పనిలో ఉన్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తన వారసత్వం తన కూతురికే చెందుతుందనే బలమైన సంకేతం కిమ్ ఇచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు.