అమ్మోనియా నైట్రేట్ ఎగుమతులకు బ్రేక్
ABN , First Publish Date - 2022-03-06T08:57:19+05:30 IST
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దేశంలోని బొగ్గు గనులపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తిలో పేలుడు పదార్థాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే..
బొగ్గు గనులపై రష్యా యుద్ధం ప్రభావం
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దేశంలోని బొగ్గు గనులపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తిలో పేలుడు పదార్థాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే.. యుద్ధం నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ ఎగుమతిపై రష్యా ఆంక్షలు విధించడంతో పేలుడు పదార్థాలకు కొరత ఏర్పడింది. ప్రపంచంలో అత్యధిక అమ్మోనియం నైట్రేట్‌ను(సుమారు 61.64శాతం) రష్యన్ ఫెడ రేషన్‌లోని దేశాలే ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు 700-750 టన్నుల పేలుడు పదార్థాలు సింగరేణికి అవసరం ఉండగా.. వాటిలో 150 టన్నులను స్వయంగా సింగరేణి మణుగూరు, రామగుండంలో ఉత్పత్తి చేస్తోంది. మిగిలిన 600 టన్నుల కోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థల నుంచి 350 టన్నుల వరకూ మాత్రమే అందుతోంది. సుమారు 200 టన్నుల కొరత ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ఉంటోంది.
పేలుడు పదార్థాల కోసం టెండర్లు
పేలుడు పదార్థాల సరఫరా మరింత మెరుగుపడేందుకు దోహదపడేలా నూతన టెండర్ ప్రక్రియను చేపట్టినట్లు సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం) ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. కాంట్రాక్టు విషయంలో కోల్ ఇండియా తదితర సంస్థలు పాటిస్తున్న పద్ధతులను పరిశీలించిన అనంతరం పలు నిబంధనలను కొత్త టెండర్‌లో పొందుపరచనున్నట్లు వివరించారు. పేలుడు పదార్థాల సరఫరాదారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. సరఫరా కంపెనీలు ఎదుర్కొంటున్న క్షేత్ర స్థాయి సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత టెండర్ ఆహ్వాన నోటీసులో(ఎన్‌ఐటీ) పలు నిబంధనలు చేర్చినట్లు చంద్రశేఖర్ ఈ సందర్భంగా వివరించారు.