Low birthrate : మహిళలు మితిమీరి తాగుతున్నారు : పోలండ్ నేత
ABN , First Publish Date - 2022-11-08T09:28:37+05:30 IST
పోలండ్ అధికార పార్టీ నేత జరోస్లా కషింన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జననాల రేటు తక్కువగా
న్యూఢిల్లీ : పోలండ్ అధికార పార్టీ నేత జరోస్లా కషింన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జననాల రేటు తక్కువగా ఉండటానికి కారణం యువతులు మితిమీరి మద్యం సేవించడమేనని అన్నారు. దీంతో రాజకీయవేత్తలు, సెలబ్రిటీలతో సహా అన్ని వర్గాలవారు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆయన పితృస్వామిక భావజాలంతో, అర్థం లేకుండా మాట్లాడారని దుయ్యబట్టారు.
ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, జరోస్లా కషింన్‌స్కీ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘యువతులు 25 ఏళ్ళ వయసు వరకు తమతో సమాన వయసుగల పురుషులతో సమానంగా మద్యాన్ని సేవించడం కొనసాగిస్తే, పిల్లలు పుట్టరు’’ అన్నారు. పురుషులు మద్యానికి బానిసలవ్వాలంటే సగటున 20 ఏళ్లపాటు మితిమీరి తాగవలసి ఉంటుందని, అదే మహిళలైతే కేవలం రెండేళ్ళలోనే బానిసలైపోతారని చెప్పారు. ఓ డాక్టర్ తనతో పంచుకున్న అనుభవాలనే తాను చెప్తున్నానని తెలిపారు. మద్యానికి బానిసలైనవారిలో తనవద్దకు వచ్చిన పురుషుల్లో మూడో వంతు మందిని ఆయన తిరిగి సాధారణ స్థితికి తేగలిగారని, అయితే ఓ మహిళను తిరిగి సాధారణ స్థితికి తేలేకపోయారని చెప్పారు.
అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం పోలండ్‌లో జననాల రేటు ప్రతి మహిళకు 1.3 మంది పిల్లలు పుడుతున్నారు. ఈ రేటు యూరోపియన్ యూనియన్ జననాల రేటు కన్నా తక్కువ. అదే విధంగా నూతన తరం పునరుత్పత్తి జరగడానికి అవసరమైనదాని కన్నా తక్కువ.
మరోవైపు ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, గర్భస్రావం చేయించుకోవడంపై ఆంక్షల కారణంగా పోలిష్ యువతులు పిల్లల్ని కనడం లేదని తెలుస్తోంది.