Assam: కత్తితో పాఠశాలకు వచ్చిన హెడ్మాస్టర్ సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-11-06T20:13:58+05:30 IST

అస్సాంలోని కచర్ జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది.

Assam: కత్తితో పాఠశాలకు వచ్చిన హెడ్మాస్టర్ సస్పెన్షన్

గువాహటి : అస్సాంలోని కచర్ జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన కత్తి పట్టుకుని రావడంతో ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఆయన కత్తి పట్టుకుని వస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పోలీసులు హుటాహుటిన వెళ్లి, ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ధృతమేధ దాస్ (38) అస్సాంలోని సిల్చార్, తారాపూర్‌లో నివసిస్తున్నారు. ఆయన 11 ఏళ్ళ నుంచి టీచర్‌గా పని చేస్తున్నారు. ఆయన కత్తి పట్టుకుని పాఠశాలకు వస్తున్నట్లు కనిపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రంగీర్‌ఖరి పోలీస్ ఔట్‌పోస్ట్‌కు కొందరు శనివారం ఫోన్ చేసి, ఈ సమాచారాన్ని తెలిపారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకుని, ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఆ కత్తిని దాచేసి, తనకేమీ తెలియదని చెప్పారని పోలీసులు చెప్పారు. అయితే తాము పాఠశాలకు వెళ్లినపుడు, అక్కడి విద్యార్థులు, టీచర్లు చాలా భయపడుతున్నట్లు గుర్తించామన్నారు. తమకు ఆయన వద్ద రెండు లేఖలు కనిపించాయని తెలిపారు. తనకేమైనా జరిగితే నలుగురు టీచర్లదే బాధ్యత అని ఒక లేఖలో కనిపించిందని చెప్పారు. మరొక లేఖలో, ముగ్గురు టీచర్లను చంపాలనుకుంటున్నట్లు రాశారని తెలిపారు. కత్తిని స్వాధీనం చేసుకుని, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను కోరినట్లు తెలిపారు.

కచర్ జిల్లా పాఠశాలల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ నీచల్ హజారీ మాట్లాడుతూ, సహ ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతుండటంపై దాస్ ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఈ పాఠశాలకు ఏడుగురు టీచర్లు అవసరం కాగా, 13 మంది టీచర్లు పని చేస్తున్నారన్నారు. టీచర్లలో క్రమశిక్షణ తేవాలంటే ఇలాంటిదేదో చేయాలని ఆయన భావించారన్నారు.

టీచర్లకు కత్తిని చూపించి వారిని అదుపులో ఉంచాలని ఆయన భావించారని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, దాస్‌పై అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

Updated Date - 2022-11-06T20:14:11+05:30 IST