Shraddha Murder: 37 బాక్సుల్లో సామాన్లను తరలించిన అఫ్తాబ్
ABN , First Publish Date - 2022-11-21T15:52:22+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) దారుణ హత్యా ఘటనలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తనతో సహజీవనం సాగిస్తున్న శ్రద్ధను అత్యంత పాశవికంగా ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) దారుణ హత్యా ఘటనలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తనతో సహజీవనం సాగిస్తున్న శ్రద్ధను అత్యంత పాశవికంగా హత్య చేసి 35 ముక్కలుగా విసిరివేసి ఎట్టకేలకు పట్టుబడిన అఫ్తాబ్ పూనావాలా గత మేలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తాము ఉంటున్న ఫ్లాట్‌లోని సామాన్లను 37 బాక్సుల్లో ఢిల్లీకి తరలించినట్టు పోలీసులు తాజాగా కనుగొన్నారు. ఇందుకోసం రూ.20,000 చెల్లించినట్టు గుర్తించారు.
ముంబై నుంచి ఢిల్లీకి మకాం మార్చే మందు వస్తువుల తరలింపు విషయంలో డబ్బులు ఎవరు చెల్లించాలనే దానిపై తనకు, శద్ధకు మధ్య గొడవ జరిగినట్టు తమ విచారణలో అఫ్తాబ్ వెల్లడించినట్టు పోలీసులు చెప్పారు. గుడ్ లక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీ ద్వారా గత జూన్‌లో ఫర్నిచర్, ఇతర సామాగ్రి రవాణా అయిందని, రూ.20,000 ఎవరి అకౌంట్ నుంచి చెల్లించారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ప్యాకేజింగ్ కంపెనీ ఉద్యోగి ప్రకటనను కూడా ఢిల్లీ పోలీసులు ఆదివారంనాడు రికార్డు చేశారు. అతనిని ప్రశ్నించిన తరువాతే వాసైలోని వైట్ హౌస్ సొసైటీ ఫ్లాట్ నుంచి ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలోని తన నివాసానికి అఫ్తాబ్ 37 బాక్సుల్లో సామానును తరలించిన విషయం వెలుగుచూసింది.
ఇంటి యజమానులను ప్రశ్నించిన పోలీసులు
శ్రద్ధ, అఫ్తాబ్‌లు 2021 వరకూ నివాసం ఉన్న ఇంటికి సంబంధించి ఆ ఇంటి యజమాని స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు ఆదివారం రికార్డు చేశారు. నిందితుడి కుటుంబ సభ్యులు గత 15 రోజుల క్రితం వరకూ ఉన్న ఫ్లాట్‌కు సంబంధించి దాని యజమానిని సైతం పోలీసులు ప్రశ్నించారు. ప్రస్తుతం అఫ్తాబ్ కుటుంబ సభ్యులు ఆ ఫ్లాట్ నుంచి గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు.
m