MNREGS : గ్రామీణ ఉపాధి హామీ పథకానికి త్వరలో కొత్త రూపం!
ABN , First Publish Date - 2022-11-26T20:17:33+05:30 IST
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS)ని మరింత మెరుగ్గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS)ని మరింత మెరుగ్గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు ఈ పథకం మరింత సమర్థంగా ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నిస్తోంది. ఈ పథకాన్ని సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించేందుకు అమర్‌జీత్ సిన్హా నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఖర్చవుతున్న నిధులు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఖర్చవడానికి కారణాలేమిటి? అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఉపాధి అవకాశాలను రీడిజైన్ కూడా చేస్తుందని తెలిపారు. నిధులను మరింత సమర్థంగా వినియోగించడం కోసం అవసరమైన సిఫారసులను కూడా చేస్తుందన్నారు. పరిపాలన, అధికార యంత్రాంగం పని చేయవలసిన అంశాలపై కూడా సిఫారసులు చేస్తుందని చెప్పారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా సమర్పిస్తుందన్నారు.
ప్రభుత్వం 2021-22లో ఈ పథకం క్రింద రూ.98 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 73 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.10 లక్షల కోట్లను ఖర్చు చేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులను గ్రామీణులు తట్టుకునేందుకు భారీగా ఖర్చు చేసింది.
ఇదిలావుండగా, ఈ పథకం దుర్వినియోగమవుతోందనే విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉండటంతో ఈ పథకానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ పథకం క్రింద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చవాలని, లక్షిత లబ్ధిదారుకు చేరాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కన్నా ఆర్థికంగా వెనుకబడిన బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఖర్చవుతున్న నిధులు చాలా తక్కువ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.