Covid: చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2022-12-20T21:43:26+05:30 IST
చైనా (China), ఇతర కొన్ని దేశాల్లో కొవిడ్-19 (Covid) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
న్యూఢిల్లీ: చైనా (China), ఇతర కొన్ని దేశాల్లో కొవిడ్-19 (Covid) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కరోనా (Corona) పాజిటివ్ కేసుల శాంపిల్స్‌ను ప్రాధాన్యత దృష్ట్యా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబోరేటరీస్‌కు (genome sequencing laboratories) పంపించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా కొత్త వేరియెంట్లను ట్రాక్ చేసేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACoG) నెట్వర్క్ ద్వారా సీక్వెన్సింగ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ తరహా కసరత్తు ద్వారా దేశంలో వ్యాపించే కొత్త వేరియెంట్లను సకాలంలో పసిగట్టవచ్చునని, తద్వారా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవచ్చునని ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఎన్సీడీసీ (నేషనల్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్), ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)లకు కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ లేఖ కూడా రాసింది. చైనాతోపాటు జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రెజిల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు సంస్థలను అప్రమత్తం చేసింది.
కాగా చైనాలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. జీరో-కొవిడ్ పాలసీ లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం ఇందుకు కారణమైంది. ఈ పరిణామంపై అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీస్ అండ్ ప్రివెన్షన్, ఇతర హెల్త్ ఏజెన్సీలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. కొవిడ్-19 కొత్త వేరియెంట్లతో అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.