Deve Gowda: ప్రాంతీయ పార్టీలంటే జాతీయ పార్టీలకు వణుకు
ABN , First Publish Date - 2022-10-28T21:51:17+05:30 IST
బెంగళూరు: ప్రాంతీయ పార్టీలంటే జాతీయ పార్టీలు వణికిపోతున్నాయని జనతాదళ్ సెక్యులర్ (JDS) అధినేత దొడ్డెగౌడ దేవెగౌడ (DeveGowda) ఎద్దేవా చేశారు.
బెంగళూరు: ప్రాంతీయ పార్టీలంటే జాతీయ పార్టీలు వణికిపోతున్నాయని జనతాదళ్ సెక్యులర్ (JDS) అధినేత దొడ్డెగౌడ దేవెగౌడ (DeveGowda) ఎద్దేవా చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలకు ప్రాంతీయ పార్టీలంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ఎవరితరమూ కాదని ఆయన చెప్పారు. కర్ణాటక(Karnataka)లోనే కాదు దేశంలోనే ఎక్కడా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయలేరని చెప్పారు. ఈ నెల 27న ఆయన జేడీఎస్ అధినేతగా మరోమారు ఎన్నికయ్యారు.
కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవంబర్ నెల ఒకటో తేదీన తొలి జాబితా విడుదల చేయాలని జేడీఎస్ నిర్ణయించడం సంచలనంగా మారింది. జనతాదళ్ పార్టీలన్నీ జాతీయ పార్టీగా అవతరించే విషయంపైన కూడా దేవెగౌడ స్పందించారు. బీజేపీకి జనతాదళ్ ప్రత్యామ్నాయం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో కటీఫ్ చెప్పి ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము గమనిస్తున్నామని, త్వరలో జనతాదళ్ పరివార్ అంతా ఒకే గూటికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జనతాదళ్ దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిందని దేవెగౌడ గుర్తు చేశారు.