IIT Guwahati: ఇంజనీరింగ్ పూర్తికాక ముందే ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజ్ !
ABN , First Publish Date - 2022-11-14T20:49:25+05:30 IST
చదువు పూర్తవ్వకముందే ఉద్యోగం కొడితే ఆ కిక్కే వేరు. అందులోనూ భారీ వేతనంతో ఆఫర్లు దక్కించుకుంటే ఆ మజానే ప్రత్యేకం.
గువహటి: చదువు పూర్తవ్వకముందే ఉద్యోగం కొడితే ఆ కిక్కే వేరు. అందులోనూ భారీ వేతనంతో ఆఫర్లు దక్కించుకుంటే ఆ మజానే ప్రత్యేకం. అచ్చం ఈ తరహాలోనే ఐఐటీ గువహటి (IIT Guwahati) విద్యార్థి ఒకరు ప్రీ-ప్లేస్‌మెంట్స్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఆఫర్ అందుకున్నారు. ఏడాదికి ఏకంగా రూ.1.20 కోట్ల భారీ ఆఫర్ అందుకున్నాడని ఐఐటీ గువహటి వెల్లడించింది. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో ఒకటైన ఐఐటీ గువహటి (Indian Institute of Technology Guwahati) ప్రీ-ప్లేస్‌మెంట్స్‌లో దూసుకెళ్తోంది. క్రితం ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీ-ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ (pre-placements Offers) 21 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 218 మంది విద్యార్థులు ఆఫర్లు అందుకున్నారని, గతేడాది 2021-22లో ఈ సంఖ్య 179గా ఉందని ఓ ప్రకటనలో ఐఐటీ గువహటి పేర్కొంది. డిసెంబర్ 1న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మొదలవనున్నాయని, అప్పటివరకూ ప్రీ-ప్లేస్‌మెంట్స్ కొనసాగుతాయని తెలిపింది.
ఈ ఏడాది ప్రీ-ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరగడం సంతోషంగా ఉందని ఐఐటీ-గువహటి డైరెక్టర్ టీజీ సీతారామ్ అన్నారు. ఈ ఏడాది ప్రీ-ప్లేస్‌మెంట్స్ చూస్తుంటే విద్యార్థులు ఎంత కష్టపడ్డారో అర్థమవుతోందని ఆయన అన్నారు. పటిష్టమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రీ-ప్లేస్‌మెంట్స్‌లో అత్యధిక ప్యాకేజీ రూ.1.20 కోట్లుగా ఉందని, గతేడాది ఇది రూ.56 లక్షలు మాత్రమేనని సీతారామ్ చెప్పారు. ఈ ఏడాది అత్యధిక ప్రీ-ప్లేస్‌మెంట్స్ ఆఫర్ చేసిన కంపెనీలు వరుసగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, జేపీ మోర్గాన్, సామ్సంగ్ రీసెర్చ్-బెంగళూరు ఉన్నాయని ఆయన వెల్లడించారు.