Pragya Thakur: ఇళ్లల్లో కత్తులు ఉంచుకోండి...బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-12-26T18:58:53+05:30 IST
తరచు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. తమపైన, తమ గౌరవంపైన దాడులు జరిపే..
శివమొగ్గ: తరచు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (Pragya Sing Thakur) మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. తమపైన, తమ గౌరవంపైన దాడులు జరిపే వారికి దీటుగా జవాబిచ్చే హక్కు హిందువులకు ఉందని అన్నారు. తమను తాము రక్షించుకునేందుకు ఇళ్లల్లో పదనైన కత్తులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తు్న్న ప్రజ్ఞాసింగ్ ఆదివారంనాడిక్కడ జరిగిన హిందూ జాగరణ్ వేదిక సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడారు.
''లవ్ జీహాద్‌లో జీహాద్ సంప్రదాయం ఉంది. వాళ్లు లవ్ చేస్తే అందులోనూ జీహాద్‌ను చూస్తారు. మనమూ (హిందువులు) ప్రేమిస్తాం, దేవుడ్ని ప్రేమిస్తాం, ఒక సన్యాసి కూడా దేవుడ్ని ప్రేమిస్తాడు. భగవంతుడు ఈ సకల జగత్తును సృష్టించాడని సన్యాసి చెబుతాడు. అణచివేతలన్నింటినీ పాపంగా చెబుతాడు. ప్రేమకు సరైన నిర్వచనం ఇవ్వలేకపోతే ఇక్కడ ఎవరూ బతికి బట్టకట్టలేరు. లవ్ జీహాద్‌కు పాల్పడుతున్న వారికి కూడా అదే స్థాయిలో మనం సమాధానం ఇవ్వాలి. మీ అమ్మాయిలను కాపాడుకోండి, వారికి నిజమైన విలువల గురించి బోధించండి'' అని ప్రగ్యా ఠాకూర్ అన్నారు. శిమమొగ్గకు చెందిన హర్ష సహా పలువురు హిందూ కార్యకర్తలు హత్యలకు గురికావడాన్ని ప్రస్తావిస్తూ, స్వీయరక్షణ కోసం ప్రజలు తమ ఇళ్లలో కత్తులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
''మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోండి. ఏమీ లేకపోతే కనీసం కూరలు తరిగే పదునైనా కత్తులైనా అందుబాటులో ఉంచుకోండి. ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరికి స్వీయరక్షణా హక్కు ఉంది. ఎవరో అజ్ఞాతవ్యక్తులు ఇళ్లలోకి చొరబడి మనపై దాడులు చేస్తే వారికి సరైన రీతిలో బుద్ధిచెప్పడం మన హక్కు'' అని ప్రగ్యా ఠాకూర్ అన్నారు. మిషనరీ సంస్థల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు తహతహలాడవద్దని సూచించారు. ఇందువల్ల వృద్ధాశ్రమాలకు మీరే తలుపులు బార్లా తెరిచినట్టు అవుతుందన్నారు. మీ పిల్లలు మీకు, మీ సంస్కృతికి కాకుండా పోతారని, పిల్లలు ఓల్డేజ్ హోమ్స్ సంస్కృతిలో పెరిగి, స్వార్ధపరులుగా మారుతారని హెచ్చరించారు. ''మీ ఇళ్లలో పూజలు చేసుకోండి. మీ ధర్మం, మీ శాస్త్రం ఏమి చెప్పిందో చదవండి. దాని గురించి పిల్లలకు బోధించండి. అందువల్ల పిల్లలు తమ సంస్కృతి, విలువలు తెలుసుకోగలుగుతారు'' అని ప్రగ్యా హితవు పలికారు.