Gujarat polls: కిడ్నాప్ దుమారం..ఎట్టకేలకు నామినేషన్ ఉపసంహరించుకున్న ఆప్ అభ్యర్థి

ABN , First Publish Date - 2022-11-16T14:26:14+05:30 IST

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ వ్యవహారం సంచలనమైంది. సూరత్ ఈస్ట్..

Gujarat polls: కిడ్నాప్ దుమారం..ఎట్టకేలకు నామినేషన్ ఉపసంహరించుకున్న ఆప్ అభ్యర్థి

అహ్మదాబాద్: గుజరాత్‌ (Gujarat)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థి కంచన్ జరివాలా (Kanchan Jariwala) కిడ్నాప్ వ్యవహారం సంచలనమైంది. సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కంచన్‌ను నామినేషన్ ఉపంసహరించుకోవాలంటూ తుపాకితో బెదరించినట్టు ఆప్ ఆరోపించింది. మంగళవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారని, బీజేపీ కిడ్నాప్ చేసిందని ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా మీడియా ముందు ఆరోపించారు. కేజ్రీవాల్ సైతం కంచన్ కనిపించడం లేదంటూ ఈ ఉదయం ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కంచన్ రిట్నరింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

కిడ్నాప్ ఇలా...

నామినేషన్ పత్రాల పరిశీలన కోసం మంగళవారం మధ్యాహ్నం రిట్నరింగ్ అధికారి కార్యాలయానికి కంచన్ వెళ్లారనీ, అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు బీజేపీ వ్యక్తులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారని మనీష్ సిసోడియా ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు ఇంతకంటే పెద్ద ఎమర్జెన్సీ ఏముంది? తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ను కోరామని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కంచన్‌ను బలవంతగా లాక్కువెళ్లారంటూ ఆప్ నేత రాఘవ్ చద్దా ఏకంగా ఒక వీడియోను విడుదల చేశారు. ''మా సూరత్ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు, బీజేపీ గూండాలు ఎలా లాక్కెళుతున్నారో చూడండి. నిష్పాక్షికంగా, పారదర్శికంగా ఎన్నికలు నిర్వహించడమనేది ఒక జోక్‌గా మారింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే'' అని ఆయన ట్వీట్ చేశారు. ఆప్ వరుస ట్వీట్‌ల తరుణంలోనే కంచన్‌ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యారు. సుమారు 500 మంది పోలీసులు ఆయనను చుట్టుముట్టి రిటర్నింగ్ కార్యాలయానికి తీసుకువచ్చినట్టు సిసోడియా తెలిపారు. అనంతరం కంచన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

Updated Date - 2022-11-16T14:29:16+05:30 IST