Gujarat Bridge Tragedy: మోదీ పాత వీడియోను విడుదల చేసి నిలదీసిన విపక్షాలు

ABN , First Publish Date - 2022-10-31T19:49:38+05:30 IST

కోల్‌కతా: గుజరాత్‌లోని మోర్బి బ్రిడ్జి దుర్ఘటనలో130 మందికి పైగా మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తృణమూల్ కాంగ్రెస్ నిలదీసింది. 2016లో బీజేపీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన వీడియోను రిలీజ్ చేసింది. గుజరాత్ దుర్ఘటనపై ఇప్పుడు మోదీ ఏమంటారని నిలదీసింది.

Gujarat Bridge Tragedy: మోదీ పాత వీడియోను విడుదల చేసి నిలదీసిన విపక్షాలు

కోల్‌కతా: గుజరాత్‌లోని మోర్బి బ్రిడ్జి (Gujarat Morbi bridge) దుర్ఘటనలో130 మందికి పైగా మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తృణమూల్ కాంగ్రెస్ (TMC) నిలదీసింది. 2016లో బీజేపీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన వీడియోను రిలీజ్ చేసింది. గుజరాత్ దుర్ఘటనపై ఇప్పుడు మోదీ ఏమంటారని నిలదీసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకానంద రోడ్ ఫ్రైఓవర్ కూలిపోయింది. అవకతవకల కారణంగానే వంతెన కూలిపోయిందంటూ మమతా బెనర్జీని తప్పుపడుతూ అప్పట్లో మోదీ మాట్లాడటం ఆ వీడియోలో ఉంది.

''ఇంత పెద్ద బ్రిడ్జి కూలిపోతే, ఈ వ్యక్తులు ఏమంటున్నారో తెలుసా? దేవుడు చేసిన పని అంటున్నారు. దీదీ... ఇది దేవుడి పని కాదు, ఇది అవినీతి చర్య. దాని ఫలితమే బ్రిడ్జి కూలిపోయింది. ఇది సిగ్గుచేటు'' అని ప్రధాని తన ప్రసంగంలో మమతాబెనర్జీపై విమర్శలు గుప్పించారు. తాజాగా మోర్బీ బ్రిడ్జి విషాదంపై విపక్ష పార్టీలు ఎదురుదాడికి దిగాయి. 2016 నాటి మోదీ ప్రసంగం వీడియోను విడుదల చేస్తూ, గుజరాత్ దుర్ఘటనకు సొంత పార్టీ బాధ్యతను అంగీకరిస్తారా అని నిలదీశాయి.

ఇప్పుడేమంటారు మోదీజీ? : టీఎంసీ, శివసేన

''కోల్‌కతా ఫ్లైఓవర్ కూలిపోయినప్పుడు మమతా బెనర్జీని ప్రధాని తప్పుపట్టారు. గుజరాత్‌లో కొత్తగా పునరుద్ధరించిన బ్రిడ్జి (ఆదివారం) కూలిపోయిన ప్రమాదంలో 132 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి కనీసం నాలుగు చుక్కలైనా కన్నీళ్లు కారుస్తారా మోదీజీ...''అని టీఎంసీ నేత, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ట్వీట్ చేశారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం మరో ట్వీట్‌లో ప్రధానమంత్రిపై విమర్శలు ఎక్కుపెట్టారు. పశ్చిమబెంగాల్‌లో వంతెన కూలిపోయినప్పుడు అది దేవుడి పని కాదనీ, అవకతవకలే కారణమని ప్రధానమంత్రి చేసిన ప్రసంగం తనకు గుర్తుకొస్తోందని అన్నారు. ఇది ఏమాత్రం సున్నితత్వం లేని, నిర్లక్ష్యంతో కూడిన చర్య కావడంతోనే తాను వీడియోను పోస్ట్ చేయడం లేదని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ 2016 మార్చి 31న కూలిపోయింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో దీనిని బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రం చేసుకుంది.

Updated Date - 2022-10-31T19:49:39+05:30 IST