Gujarat election2022: గుజరాత్‌లో తొలిసారి ఓటు వేయనున్న పాకిస్తానీ శరణార్థులు!

ABN , First Publish Date - 2022-11-05T15:39:12+05:30 IST

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు గుజరాత్ ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పాకిస్తానీ హిందూ శరణార్థులు (Pakistani Hindu refugees) ఎంతో ఆసక్తిగా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.

Gujarat election2022: గుజరాత్‌లో తొలిసారి ఓటు వేయనున్న పాకిస్తానీ శరణార్థులు!

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల (Gujarat elections2022) నగారా మోగింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుండగా 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఓట్ల యుద్ధానికి అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు అన్నీ మొదలెట్టేశాయి. ఇక ఓటర్లు కూడా అంతా నిశితంగా గమనిస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సన్నద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పాకిస్తానీ హిందూ శరణార్థులు (Pakistani Hindu refugees) ఎంతో ఆసక్తిగా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. గత 5 ఏళ్లలో భారత పౌరసత్వం పొందిన పాకిస్తానీ హిందూ శరణార్థులంతా ఈ ఎన్నికల్లోనే తొలిసారి ఓటు వేయనుండడం దీనికి కారణం. ఈ కేటగిరికి చెందిన ఓటర్ల సంఖ్య వెయ్యికిపైగానే ఉండడంతో గుజరాత్ ఎన్నికల ఫలితాలపై వీటి ప్రభావం ఏమేర ఉంటుందనే అంశంపై చిన్నపాటి చర్చ మొదలైంది. కాగా అహ్మదాబాద్ కలెక్టరేట్ కార్యాలయం రికార్డుల ప్రకారం.. 2016 నుంచి 1032 మంది పాకిస్తానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. కాగా పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గంగా ఉన్న హిందువులు వేధింపులకు గురవుతున్న పలు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఇతర దేశాలకు ఆశ్రయం కోసం వెళ్తున్నారు. ఇలా కొందరు శరణార్థులు భారత్‌ను కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

శరణార్థులకు పౌరసత్వం ఎవరిస్తారు?

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శీ శరణార్థులకు భారత పౌరసత్వం పత్రాన్ని జారీ చేసే హక్కు కలెక్టర్ కార్యాలయానికి ఉంటుంది. అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్సీ సంస్థల ఆమోదం తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుంది. గత ఆగస్టులో గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘ్వీ మొత్తం 40 మంది పాకిస్తానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు భారత పౌరసత్వం అందుకున్నవారిలో ఒకరైన దిలీప్ మహేశ్వరి చెప్పారు. గుజరాత్ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నికోవడంలో భాగస్వామ్యమవుతున్నందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. కాగా గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 1న మొదటి విడతలో 89 సీట్లు, డిసెంబర్ 5న రెండవ విడతలో 93 సీట్లకు పోలింగ్ జరగనుంది.ా

Updated Date - 2022-11-05T15:40:37+05:30 IST