Gujarat Polls: రామారావ్ ఆన్ డ్యూటీ తరహాలో ఇన్‌స్టా పోస్ట్ పెట్టి...
ABN , First Publish Date - 2022-11-18T14:25:39+05:30 IST
న్యూఢిల్లీ: అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు...నిష్పాక్షికంగా పనిచేయాల్సిన ఐఏఎస్ ఉన్నతాధికారి ఒకరు సొంత ప్రచారం కోసం అత్యుత్సాహం చూపి చిక్కుల్లో....
న్యూఢిల్లీ: అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు...నిష్పాక్షికంగా పనిచేయాల్సిన ఐఏఎస్ ఉన్నతాధికారి ఒకరు సొంత ప్రచారం కోసం అత్యుత్సాహం చూపి చిక్కుల్లో పడ్డారు. ''చేసింది చాలు కానీ...ఇక దయచేయండి'' అంటూ ఆయనకు ఎన్నికల కమిషన్ 'ఎగ్జిట్ డోర్' చూపింది. ఉత్తరప్రదేశ్ కేడర్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ (Abhisekh singh) ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. గుజరాత్ (Gujarat) ఎన్నికల కోసం జనరల్ అబ్జర్వర్ (Geneal observer)గా అభిషేక్‌ను ఈసీ నియమించింది. అహ్మదాబాద్, బాపూనగర్, అస్వారా అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలు ఆయనకు అప్పగించింది. ఇదే విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోతో సహా షేర్ చేశారు. ''గుజరాత్ ఎన్నికల పరిశీలకుడిగా అహ్మదాబాద్‌లో జాయిన్ అయ్యాను'' అంటూ సూటుబూటుతో సహా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వాహనంతో ఆయన ఫోటోకు ఫోజిచ్చారు. దానిపై ఎన్నికల కమిషన్ గుర్రుమంది. అధికారిక హోదాను పబ్లిసిటీ స్టంట్‌గా ఉపయోగించుకోవడాన్ని తప్పుపడుతూ ఎన్నికల అబ్జర్వర్ విధుల నుంచి ఆయనను తప్పించింది.
ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అభిషేక్ సింగ్ చేసిన పనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించిందని, అతనిని విధుల నుంచి తప్పించడమే కాకుండా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఎన్నికల విధుల నుంచి డిబార్ చేసిందని ఈసీ వర్గాలు తెలిపాయి. శక్రవారంనాడు ఆయన తన నియోజకవర్గం విడిచిపెట్టాల్సి ఉంటుందని, అబ్జర్వర్ విధుల్లో ఆయనకు కేటాయించిన సౌకర్యాలన్నీ తక్షణమే రద్దవుతాయని ఆ వర్గాలు చెప్పాయి. అభిషేక్ స్థానంలో మరో ఐఏఎస్ అధికారి కృష్ణ బాజ్‌పేయిని ఈసీ నియమించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా ఈనెల 1,5వ తేదీల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.