Bihar: తాగేసి వచ్చారా? అసెంబ్లీలో కస్సుమన్న సీఎం

ABN , First Publish Date - 2022-12-14T17:23:35+05:30 IST

బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి సుమారు 20 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, అసెంబ్లీని సైతం ఈ అంశం..

Bihar: తాగేసి వచ్చారా? అసెంబ్లీలో కస్సుమన్న సీఎం

సరణ్: బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి సుమారు 20 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, అసెంబ్లీని సైతం ఈ అంశం కుదిపేసింది. నితీష్ సర్కార్‌పై విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారంనాడు విమర్శల దాడి చేయడంతో సీఎం ఓ దశలో సహనం కోల్పోయారు. ''తాగేసి వచ్చారా?'' అంటూ విపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.

బీహార్‌లో 2016 నుంచి మద్యం అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కట్టుదిట్టంగా దానిని అమలు చేయడంలో సర్కార్ వైఫలమైందని, ఆ కారణంగానే తాజా మరణాలు సంభవించాయని విపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా అసెంబ్లీలో నిలదీశారు. ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ పలువురు విపక్ష ఎమ్మెల్యేలు ప్లకార్లులు ప్రదర్శించారు. దీంతో నితీష్ అగ్రహానికి గురయ్యారు. ''మద్యం తాగి సభకు వచ్చారా? మీరు చేస్తున్నది సరైన పని కాదు. దీన్ని సహించేది లేదు'' అని తీవ్రస్వరంతో అన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.

వయసు పెరిగి కోపం వస్తోంది...

కాగా, మద్యం సాగి సభకు వచ్చారా అంటూ సీఎం అసెంబ్లీలో గద్దించడంపై బీజేపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆదరణ తగ్గి వయసు పెరుగుతుండటంతో ఆయనకు కోపం పెరుగుతోందని ఆ పార్టీ నేత గిరిరాజ్ సింగ్ విమర్శించారు. నితీష్ పని అయిపోయిందని, అందుకే కోపం ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అన్నారు. నితీష్ వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎమ్మెల్యేలు సభ బయట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Updated Date - 2022-12-14T17:24:53+05:30 IST