Shraddha Walkar Murder Case: బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోనున్న అఫ్తాబ్?
ABN , First Publish Date - 2022-12-17T14:24:31+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా బెయిలు పిటిషన్..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walkar Murder Case)లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftab poonawala) బెయిలు పిటిషన్ (Bail petition)పై విచారణ ఈనెల 22న జరుగనుంది. అఫ్తాబ్ పోలీసు కస్టడీ శనివారంతో ముగియనుండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు అడిషనల్ జడ్జి వ్రిందా కుమారి ముందు అతన్ని పోలీసులు హాజరుపరిచారు. వకాల్తానామాపై తాను సంతకం చేశానని, అయితే తన తరఫున బెయిల్ దాఖలు అయినట్టు తెలియదని అఫ్తాబ్ కోర్టుకు తెలిపాడు. బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నావా అని జడ్జి వెంటనే ప్రశ్నించారు. ఇందుకు అఫ్తాబ్ సమాధానమిస్తూ, న్యాయవాది తనతో మాట్లాడాలని కోరుకుంటున్నానని, అప్పుడు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటానని చెప్పాడు. దీంతో బెయిలు అప్లికేషన్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నట్టు జడ్జి ప్రకటించారు. నిందితుడిని న్యాయవాది కలుసుకున్న తర్వాత పిటిషన్‌ను చేపట్టే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి ప్రొసీడింగ్స్‌ను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.
కాగా, దీనికి ముందు అఫ్తాబ్ బెయిల్ అప్లికేషన్‌పై సాకేత్ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టి, నిందితుడి నుంచి క్లారిఫికేషన్ అవసరమని పేర్కొంది. కౌన్సిల్‌తో కమ్యూనికేషన్ లేకుండానే పొరపాటున బెయిల్ అప్లికేషన్ ఫైల్ అయినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వాదనను న్యాయవాది కొట్టివేశారు. కోర్టులో పూనావాలా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు తన వద్ద వకాల్తానామా ఉందని ఆయన చెప్పారు.