Himachal CM: హిమాచల్‌కు కాబోయే సీఎంపై వీడిన సస్పెన్స్.. అధిష్ఠానం తేల్చేసింది..!
ABN , First Publish Date - 2022-12-10T17:20:31+05:30 IST
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును..
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Himachal Pradesh Results) నెగ్గిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి (Himachal CM) ఎవరనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో 68 సీట్లకు గాను 40 స్థానాల్లో గెలిచి విస్పష్ట మెజార్టీ సాధించిన కాంగ్రెస్‌లో సీఎం ఎవరనే దానిపై శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు రాత్రి వేళ.. సీఎల్పీ భేటీ అనంతరం నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి అధిష్ఠానం పరిశీలకులుగా రాజీవ్ శుక్లా, భూపీందర్ హుడా, ఛత్తీ్‌సగఢ్ సీఎం భూపేష్ భగేల్ హాజరయ్యారు. దీనికి ముందు మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య, పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ వర్గ ఎమ్మెల్యేలు బల ప్రదర్శనకు దిగారు.
ప్రతిభాను సీఎం చేయాలంటూ.. గవర్నర్ రాజేంద్ర వద్దకు వెళ్తున్న పరిశీలకుల కారుకు అడ్డు పడ్డారు. కాగా, మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ముఖేష్ అగ్నిహోత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్వీందర్‌సింగ్ సుఖు, సీనియర్ నేత హర్షవర్ధన్ చౌహాన్ కూడా సీఎం పదవికి పోటీ పడగా.. చివరకు సీఎం సీటు సుఖ్వీందర్‌సింగ్ సుఖుకే ఆ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.