Rajiv assassination case: రాజీవ్ హత్య కేసులో కీలక పరిణామాలు ఇవే..
ABN , First Publish Date - 2022-11-11T17:32:48+05:30 IST
రాజీవ్ గాంధీ హత్య కేసులో (rajiv gandhi assassination) జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని (Nalini Sriharan), జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌ల జైలు జీవితానికి విముక్తి లభించింది. వీళ్లంతా 1991 నుంచి ఇప్పటివరకు 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష అనుభవించిన విముక్తి లభించింది.
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi assassination case) దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మే 18, 2022న ఏజీ పెరరివలన్‌ను విడుదలలో అనుసరించిన విధానాన్నే మిగిలిన దోషుల విషయంలోనూ అనుసరిస్తున్నట్టు బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం తెలిపింది. దీంతో రాజీవ్ గాంధీ హత్య కేసులో (rajiv gandhi assassination) జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని (Nalini Sriharan), జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌ల జైలు జీవితానికి విముక్తి లభించింది. వీళ్లంతా 1991 నుంచి 30 ఏళ్లకుపైగా జైలుశిక్ష అనుభవించిన తర్వాత విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ హత్య కేసులో ఎప్పుడెప్పుడు ఏమేం పరిణామాలు జరిగాయో ఒకసారి పరిశీలిద్దాం..
రాజీవ్‌పై ఎల్‌టీటీఈకి పగ ఎందుకు?
పరాయి దేశం శ్రీలంకలో క్రియాశీలకంగా ఉండే ఎల్‌టీటీఈ (Liberation Tigers of Tamil Eelam) భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎందుకు హత్య చేయించిందనే చరిత్రలోకి వెళితే... శ్రీలంకలో వివక్షకు గురవుతున్న తమిళుల కోసం వెలుపిళ్లై ప్రభాకరన్ స్థాపించిన ఎల్‌టీటీఈ ఆగడాలు మీతిమీరుతున్నాయని, అణచివేతకు సహకారం అందించాలని నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న భారత ప్రభుత్వాన్ని శ్రీలంక కోరింది. ఇందుకు స్పందించిన భారత ప్రభుత్వం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌ను (IPKF) అక్కడికి పంపించింది. ఎల్‌టీటీఈ అణచివేత కోసం శ్రీలంక సాయుధ దళాలకు శిక్షణ కూడా ఇచ్చి ఎల్‌టీటీఈపై పోరాటంలో సహకరించింది. ఈ క్రమంలో ఐపీకేఎఫ్ శ్రీలంక తమిళలను వేధింపులకు కూడా గురిచేసిందని పలు సందర్భాల్లో ఎల్‌టీటీఈ ఆరోపణలు కూడా చేసింది. ఆ తర్వాతి కాలంలో రాజీవ్ పదవి నుంచి దిగిపోయారు. ఒకవేళ రాజీవ్ గాంధీ మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంక సైన్యానికి భారత సైన్యం నుంచి సహకారం పెరుగుతుందని, దాంతో తమ మనుగడ కష్టసాధ్యమని భావించిన ఎల్‌టీటీఈ రాజీవ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది.
మే 21, 1991: చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరుంబదూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీ హత్యకు (Rajiv gandhi) గురయ్యారు. ఈ ఘటన రాత్రి 10.20 గంటల సమయంలో జరిగింది. ఎల్‌టీటీఈకి చెందిన థాను/థెన్మోజి రాజరత్నం ప్రణాళిక ప్రకారం బెల్ట్ బాంబ్‌ను పేల్చేసుకోవడంతో రాజీవ్ గాంధీ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యతో సంబంధముున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఏడుగురిలో ఒకరైన నళిని ఆ సమయంలో గర్భవతిగా ఉంది. జైలులోనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
21 మే 1991: కేసు దర్యాప్తునకు ప్రత్యేక సిట్ ఏర్పాటు.
జూన్ 11 1991: 19 ఏళ్ల వయసులో పెరరివలన్ అరెస్ట్.. టాడా చట్టం కింద కేసు.
1992: రాజీవ్ హత్యోదంతంలో ఎల్‌టీటీఈ పాత్ర ఉందని ప్రత్యేక సిట్ (SIT) తేల్చింది. దీంతో అరెస్టయిన వారందరిపైనా టాడా (TADA) (టెర్రిరిస్ట్ అండ్ డిస్‌రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం కింద కేసులు పెట్టారు.
1992: చనిపోయిన 12 మంది, పరారైన ముగ్గురు సహా మొత్తం 41 మందిని సిట్ నిందితులుగా పేర్కొంది.
1998: మురుగన్, సంథాను, ఏజీ పెరరివలన్, నళిని సహా మొత్తం 26 దోషులకు మరణశిక్షపడింది. టాడా కోర్టు (TADA) ఈ తీర్పునిచ్చింది.
1999: నలుగురు నిందితుల అప్పీల్‌ను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. దిగువస్థాయి కోర్టు విధించిన మరణశిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. మరో ముగ్గురికి జీవితకాల శిక్ష విధించిన కోర్ట్.. ఈ హత్య కేసులో టాడా నిబంధనలను తొలగించింది. ఫలితంగా మరణశిక్ష పడిన 19 మందికి ఉపశమనం దక్కింది. మరోవైపు దోషులుగా తేలిన నళిని, మురుగన్, శాంథాను, పెరవివలన్ తమిళనాడు ప్రభుత్వాన్ని క్షమాభిక్ష అభ్యర్థించారు. అయితే వీరి అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది.
2000 : అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ (Sonia Gandhi) అభ్యర్థన మేరకు నళిని మరణశిక్షను జీవితకాల శిక్షకు తగ్గించాలని తమిళనాడు గవర్నర్‌కు నాటి సీఎం ఎం.కరుణానిధి సారధ్యంలోని తమిళనాడు కేబినెట్ సిఫార్సు చేసింది.
2001: శాంథాను, మురుగన్, పెరరివలన్ భారత రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు.
2011: వీరి క్షమాభిక్ష పిటిషన్‌ను నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తిరస్కరించారు. అదే ఏడాది సెప్టెంబర్ 9న ముగ్గురికి విధించాల్సిన మరణశిక్షపై మద్రాస్ హైకోర్ట్ (Madra High court) స్టే విధించింది. వీరి మరణశిక్షను జీవితకాల శిక్షకు తగ్గించాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి నాటి ముఖ్యమంత్రి జయలలిత ఆమోదం తెలిపారు.
2018: ఏడుగురు నిందితులను విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ సిఫార్సు చేసింది.
2019: 1991లో అరెస్టయ్యాక నళిని శ్రీహరన్‌కు మొదటిసారి సాధారణ పెరోల్ లభించింది. నెలా 20 రోజులపాటు ఆమె బయట ఉన్నారు.
2021: తల్లి ఆరోగ్యం బాగాలేదంటూ నళిని శ్రీహరన్ విజ్ఞప్తి చేసుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం మరోసారి పెరోల్ ఇచ్చింది. అదే ఏడాది మరో దోషి రవిచంద్రన్‌కు కూడా పెరోల్ లభించింది. అతడి తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం మద్రాస్ హైకోర్ట్ ఈ పెరోల్ ఇచ్చింది.
మే 2022: సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత మే 18న పెరరివలన్ జైలు నుంచి విడుదలయ్యాడు.
సెప్టెంబర్ 2022: నళిని, రవిచంద్రన్‌ను ముందుస్తు విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ ఆదేశాలు.
నవంబర్ 2022: మిగతా ఆరుగురు దోషులను కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్ట్ తీర్పు.