Darling Swetha: నేను మీ డార్లింగ్‌ శ్వేత...

ABN , First Publish Date - 2022-11-17T03:42:20+05:30 IST

పదాల్లో పాజిటివ్‌నెస్‌.. భావాల్లో ప్రేమతత్వం కలగలిపిన ఆ తీపి మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రేడియో జాకీ.. ఇన్‌స్టా క్రియేటర్‌...

Darling Swetha: నేను మీ డార్లింగ్‌ శ్వేత...

పదాల్లో పాజిటివ్‌నెస్‌.. భావాల్లో ప్రేమతత్వం కలగలిపిన ఆ తీపి మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రేడియో జాకీ.. ఇన్‌స్టా క్రియేటర్‌... తెలుగు హీరోయిన్లకు సు‘స్వరం’ అందించే డబ్బింగ్‌ ఆర్టి్‌స్ట .. ఆమే డార్లింగ్‌ శ్వేత. ‘రేడియో మిర్చి’ శ్రోతలకూ, సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆ మాటల ఊటతో ‘నవ్య’ ముచ్చటించిందిలా...

‘‘కొందరు ఫోన్‌ చేస్తారు. ఇన్‌స్టాలో మెసేజ్‌ చేసి వారి రిలేషన్‌షిప్స్‌ గురించి చెబుతారు. ఆనందమైన, బాధైనా పంచుకుంటారు. అంతెందుకూ.. యాభై ఏళ్ల వయసున్న వారు కూడా ప్రేమ జ్ఞాపకాలను నా షోకి ఫోన్‌చేసి మరీ షేర్‌ చేస్తుంటారు. ప్రేమతో ఏదైనా ఒక పని చేస్తే.. ఆ ప్రేమ మళ్లీ దక్కుతుందంటే ఇదేనేమో! వాళ్లెవరో తెలీదు. వాళ్లేమి చెప్పినా ఆ విషయాన్ని నేనెవరికీ చెప్పలేను(నవ్వులు). చెప్పను కూడా. సొంత మనిషిలా.. ‘మా డార్లింగ్‌ శ్వేత’ అంటూ చనువుతో కొత్త వ్యక్తులు వాళ్ల ఫీలింగ్స్‌ పంచుకుంటుంటే.. ఆ సమయం బావుంటుంది. ఒకప్పుడు శ్రోతగా రేడియోలో ఏవో పాటలు వినే నేను.. ఇలా ఆర్జేగా చాలామంది డార్లింగ్స్‌ అభిమానాన్ని అందుకుంటానని ఏనాడూ అనుకోలేదు.

నానమ్మ ప్రభావం వల్లే..

వైజాగ్‌లో పుట్టి పెరిగాన్నేను. మా నాన్న ‘కేంద్రీయ విద్యాలయం’లో ఉపాధ్యాయులుగా పని చేశారు. అమ్మ గృహిణి. నాకో అక్క ఉంది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అభిప్రాయాలు వ్యక్తపరచటానికి స్వేచ్ఛ ఉండేది. స్కూల్‌డే ఐనా.. పంద్రాగష్టు అయినా.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. వక్తృత్వ పోటీల్లో, డిబేట్స్‌లో పాల్గొనటం వల్లే అభిప్రాయాలు సూటిగా చెప్పటం అలవాటైంది. నేవీ ప్రాంతంలో మా ఇల్లు ఉండేది. అక్కడి పిల్లలు హిందీ మాట్లాడటం వల్ల హిందీలో పట్టు వచ్చింది. షాయిరీలంటే ప్రత్యేకమైన ఇష్టం. మీకో విషయం తెలుసా? ఎనిమిదో తరగతి చదివేప్పుడే ‘జంగ్లీ లవ్‌’ అనే కథ రాశా. చిన్న సినిమా తీద్దామనే ఆలోచన ఉండేది. స్కూల్‌ లంచ్‌ టైంలో తరగతిలోని విద్యార్థులంతా నా చుట్టూ గుమికూడేవాళ్లు. ఏవో కథలు చెప్పేదాన్ని. ఒకరకంగా ఈ కథల పిచ్చి పట్టుకుంది మాత్రం మా నానమ్మ వల్లే. ఆమె క్లాసికల్‌ డ్యాన్సర్‌. మంచి స్టోరీ టెల్లర్‌. దానిమ్మ గింజలు వొలుస్తూ ఒక్కో గింజ తింటే ఇలాంటి శక్తి వస్తుందంటూ ఊహాత్మక కథలు చెప్పేది. అవి కొత్తగా ఉండేవి. పుస్తకాల్లో కనిపించనవవి. ఆమె ప్రభావం నామీద ఎప్పటికీ ఉంటుంది. బోలెడన్ని మాటలు, కథలు, కబుర్ల బ్యాంక్‌ నా దగ్గర ఉందంటే ఆమె చలువే.

అలా రేడియో జాకీగా క్రేజ్‌..

బిఎస్సీ డిగ్రీ చేశాక 2017లో హైదరాబాద్‌కి వచ్చా. ఊరికే రాలేదు మరి. ఇక్కడ సినిమా దర్శకురాలు అవ్వాలని వచ్చా. ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పని చేశా. డబ్బులు రాకున్నా కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో పని చేశా. ఓ న్యూస్‌ ఛానెల్‌లో చేరితే వాళ్లు జీతం ఇవ్వలేదు. ఆ బాధతో ఒక రోజు ఇంటికి వెళ్తుంటే.. ‘ఫీవర్‌’ అనే హిందీ ఎఫ్‌.ఎమ్‌. రేడియో స్టేషన్‌ కనిపించింది. మనకు హిందీ వచ్చు కాబట్టి ఉద్యోగం కన్ఫం అయింది. ఆ తర్వాత హిందీ కంటే తెలుగు బాగా మాట్లాడుతున్నావంటూ.. వాళ్లే ‘రేడియో మిర్చి’ ఎఫ్‌.ఎమ్‌ స్టేషన్‌కు రిఫర్‌ చేశారు. అలా ఉదయం న్యూస్‌ ఛానెల్‌లో, ఽమధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ‘రేడియో మిర్చి’లో వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టుగా పని చేసేదాన్ని. అప్పుడే ‘మళ్లీ రావా’ చిత్రంలో కథానాయిక ఆకాంక్ష సింగ్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. మంచి పేరొచ్చింది. ఆ వెంటనే ఆడిషన్‌లో పాసై ‘రేడియో మిర్చి’లోనే జాకీగా ఉద్యోగం సంపాదించా. మధ్యాహ్నం చేసే కార్యక్రమం సూపర్‌ హిట్‌ అయింది. అలా పాపులర్‌ ఆర్జేనయ్యాను.

ప్రయాణాన్ని ఆస్వాదిస్తా...

ఎఫ్‌.ఎమ్‌ రేడియో స్టేషన్‌లో ప్రతి రోజూ కంటెంట్‌ రాసుకోవడం కష్టం. ఎవరైనా వారం లేదా నెల సర్వైవ్‌ అవ్వొచ్చు. అయితే రిలేషన్‌షి్‌ప్సపై ‘మీ డార్లింగ్‌ శ్వేత’ అంటూ లేట్‌నైట్‌ షో రెండేళ్లనుంచి చేస్తున్నానంటే.. అది కేవలం చదవటం, మనుషులతో మాట్లాడటం, ప్రతిదీ గమనించటం వల్లే సాధ్యమవుతోంది. అర్ధరాత్రి ఏదైనా ఆలోచన వస్తే ఫోనులో రికార్డు చేసి నిద్రపోతా. మైన్యూట్‌ డీటైల్స్‌ కూడా ఎఫ్‌.ఎమ్‌.లో చెబుతుంటా. చాలాసార్లు పర్సనల్‌గా ఏదీ ఉంచుకోలేదంటనే ఫీలింగ్‌ వస్తుంది. వాస్తవానికి అదే నా కంటెంట్‌. ప్రస్తుతం మార్కెట్లో మ్యూజిక్‌ యాప్స్‌, సోషల్‌ మీడియా, రీల్స్‌, యూట్యూబ్‌.. లాంటి పలురకాల మాధ్యమాల వల్ల రేడియో వినటం కష్టం. ఎవరైనే రేడియో వింటున్నారంటే.. వాళ్ల ఆటిట్యూడ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. రేడియో పాసివ్‌ మీడియమ్‌. ఎవరైనా సరే వాళ్ల పనులు చేసుకుంటూ వింటారు. అలాంటప్పుడు మా మాటలు ఎఫెక్టివ్‌గా ఉండాలి. కంటెంట్‌తో పాటు ఎమోషనల్‌ కోషంట్‌, ఇంటెలిజన్స్‌, ఎంటర్‌టైనింగ్‌తో పాటు సమాచారం ఉండాల్సిందే. ఇక పోతే డబ్బింగ్‌లో బిజీగా ఉంటూనే.. మహిళల ఇయర్‌ రింగ్స్‌, యాక్ససరీ్‌సపై ఓ స్టార్టప్‌ ప్రారంభించా. ‘బ్యూటిఫుల్‌ గర్ల్‌’ అనే సినిమాకు డైలాగులు, స్ర్కీన్‌ప్లే రాశా. ఇది త్వరలో విడుదలకానుంది. ఓ వెబ్‌సిరీ్‌సకూ మాటలు రాశా. నేను గోల్‌ ఓరియంటెడ్‌ కాదు. ప్రాసెస్‌ ఓరియంటెడ్‌. గోల్స్‌ వల్ల ఎక్స్‌పెక్టేషన్స్‌.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి. సినిమా ఫీల్డ్‌ ఇష్టం. పనితో బిజీగా ఉండాలనుకుంటానంతే. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా. ఇటీవలే నా పెళ్లయింది. మా ఆయన మల్టీనేషనల్‌ కంపెనీలో పని చేస్తారు.

ఆర్జే పని, డబ్బింగ్‌ చెప్పటం ఒక్కటే అనుకుంటారు. కానేకాదు. రేడియో.. నా జీవితంలో భాగం. పర్సనల్‌ డైరీ. ఆర్జేయింగ్‌ నా వ్యక్తిత్వం. శ్వేత అంటే ఏంటి? అనే విషయం తెలుస్తుంది. పూర్తి ఒపీనియన్‌ బేస్డ్‌. మూడ్‌ బట్టే షో ఉంటుంది. ఈ మధ్య జనాలకు రియల్‌ కంటెంట్‌ నచ్చుతోంది. ఫేక్‌గా ఉండటం నచ్చదు. ‘హే.. డార్లింగ్‌ ఇవాళ నా మూడ్‌ బాలేదు..’ అంటూ షో ప్రారంభిస్తే వెంటనే కనెక్టవుతారు. రేడియో జాకీగా ప్రతి ఒక్క మాట నాదే.. ప్రతి అభిప్రాయమూ నాదే. రాత్రి తొమ్మిదింటి నుంచి అర్ధరాత్రి దాటే వరకూ సాగే నా షోలో ప్రతి మాటకూ నాదే పూర్తి బాధ్యత. మా ఆఫీస్‌లో డార్లింగ్‌ అని పిలిచేవారు. ఇపుడు అందరినీ నేను పిలుస్తున్నా. హీరో ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పదాన్ని పాపులర్‌ చేశారు. ఆ తర్వాత నేనే ఆ పదాన్ని బాగా పాపులర్‌ చేశా(నవ్వులు). డబ్బింగ్‌ చెప్పటానికి హోమ్‌వర్క్‌ అవసరం లేదు. అయితే డబ్బింగ్‌ చెప్పటం వల్ల సహనం, నిశ్శబ్దం విలువేంటో నాకు తెలిసొచ్చింది.

నా తొలి డబ్బింగ్‌ చిత్రం ‘మళ్లీ రావా’. ఆ తర్వాత ‘హలో’ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌కి డబ్బింగ్‌ చెప్పా. కియారా అద్వానీ (భరత్‌ అనే నేను), కాజల్‌ అగర్వాల్‌ (అ!), పూజా హెగ్డే (వాల్మీకి), నిధి అగర్వాల్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌), వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో ఫారిన్‌ పైలట్‌కి గాత్రం అందించా. కథానాయిక కృతీ శెట్టికి ‘ఉప్పెన’ దగ్గర నుంచి.. ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ వరకూ నేనే డబ్బింగ్‌ చెప్పా(‘బంగార్రాజు’లో తప్ప). ఇలా ఇప్పటి వరకూ దాదాపు 85 చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పా. హైదరాబాద్‌ వచ్చే దాకా కథానాయికలది సొంత గొంతే అని అనుకునే నేను.. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా బిజీ అయ్యా.

-రాళ్లపల్లి రాజావలి

Updated Date - 2022-11-17T03:42:21+05:30 IST