Dhanya Vijayan: సంకల్పమే బలం

ABN , First Publish Date - 2022-11-29T22:41:26+05:30 IST

పుట్టుకతోనే ఆమె పోరాటం మొదలైంది. జన్యుపరమైన రుగ్మత కుంగదీసినా... ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది.

Dhanya Vijayan: సంకల్పమే బలం

స్ఫూర్తి

పుట్టుకతోనే ఆమె పోరాటం మొదలైంది. జన్యుపరమైన రుగ్మత కుంగదీసినా... ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. తనలోని లోపాన్ని సాకుగా చూపకుండా... సవాలుగా తీసుకుని భరతనాట్యం నేర్చుకుంది. ఇప్పుడు తనలాంటి ఎందరికో నాట్య గురువుగా మారిన 36 ఏళ్ల ధన్యా విజయన్‌ కథ ఇది...

ధన్యా విజయన్‌... అందరిలాంటి అమ్మాయి కాదు. పుట్టినప్పటి నుంచి సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంది. రెండేళ్లప్పుడు తన నడవడిలో తేడా ఉందని ఆమె తల్లితండ్రులు గమనించారు. ఏం చేప్పినా అర్థం చేసుకోలేకపోవడం... దేన్నీ గుర్తించలేకపోవడంతో ఆందోళన చెందారు. ధన్యకు నాలుగేళ్లు వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుడిని సంప్రతిస్తే... ‘డౌన్‌ సిండ్రోమ్‌’గా తేల్చారు. ‘‘అది నయం చేయలేని జెనెటిక్‌ డిజార్డర్‌. దానివల్ల మూడేళ్లు వచ్చే వరకు తను నడవలేకపోయింది. ఐదో ఏడులో పడినా సరిగ్గా మాట్లాడలేకపోయింది’’ అంటూ కూతురు బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు గీత. ఆమె గృహిణి. కేరళ రాష్ట్రం కొళికోడ్‌ వారి స్వస్థలం. ధన్య తండ్రి విజయన్‌ బీఎ్‌సఎన్‌ఎల్‌లో సబ్‌ డివిజనల్‌ ఇంజనీర్‌గా రిటైర్‌ అయ్యారు. వీరికి రెండో సంతానం ధన్య.

ఆందోళన చెందినా...

కూతురు పరిస్థితి చూసి తల్లితండ్రులు కుంగిపోయారు. తన భవిష్యత్తు ఏమైపోతుందోనని తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ‘‘అయితే ఆ బాధను ధన్య ముందు కనిపించనీయలేదు. అసలు ఏ లోపం లేదనే భావనతోనే తనను పెంచాం. సాధారణ పిల్లలతో కలిసినప్పుడు తను ప్రత్యేకంగా అనిపించకూడదన్నది మా ఆలోచన. దాని కోసం పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌పై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాం. స్పీచ్‌ థెరపీ చేయించాం. అయితే ‘ప్రత్యేక’ స్కూల్‌లో చేర్పించలేదు. అందరితో పాటు స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌కు పంపించాం. అక్కడే తను పదో తరగతి పూర్తి చేసింది’’ అంటున్న గీత తన కూతురుకు నాట్యంపై ఉన్న ఆసక్తిని బాల్యంలోనే గమనించారు.

ఆసక్తిని ప్రోత్సహించి...

ధన్యకు పదేళ్ల వయసప్పుడు భరతనాట్యం శిక్షణలో చేర్పించారు గీత, విజయన్‌. ఆ తరువాత అదే ఆమె వ్యాపకం అయిపోయింది. నాట్యంతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకుంది. నాట్య గురువు కళామండలం వినోదిని శిష్యరికంలో నైపుణ్యం సంపాదించింది. ‘‘ఆరంభంలో ధన్య చాలా సమస్యలు ఎదుర్కొంది. చెప్పింది అర్థం చేసుకోవడంలో, స్టెప్స్‌ గుర్తుపెట్టుకోవడంలో, లయబద్దంగా నర్తించడంలో... ఇలా అనేక ఇబ్బందులు. కానీ రాత్రింబవళ్లూ కష్టపడి, వాటన్నిటినీ అధిగమించింది. విశేషమేమంటే... కొన్ని నెలల తరువాత మోహినీయట్టం కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది ధన్య. తన ప్రతిభ, కష్టపడే తత్వం చూసి గురువు కళామండలం సారావతి ముగ్ధులయ్యేవారు. ఇక అక్కడి నుంచి మా అమ్మాయి జ్ఞాపకశక్తి, మాట్లాడే విధానం, నాట్యాభినయంలో గణనీయమైన పురోగతి కనిపించింది’’ అంటారు గీత.

అంతర్జాతీయ వేదికపై...

క్రమంగా పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది ధన్య. భరతనాట్యం పోటీల్లో వరుసగా మూడేళ్లు విజేతగా నిలవడం ఆమెలోని పట్టుదలకు నిదర్శనం. అది ధన్యలో ఆత్మవిశ్వాసం పెంచింది. కొళికోడ్‌, చుట్టుపక్కల జిల్లాల్లో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొని బహుమతులు, ప్రశంసలు ఎన్నో అందుకుంది. ‘‘ధన్య సాధించిన వాటిల్లో అన్నిటి కంటే సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన సందర్భం... చెన్నై(2015)లో నిర్వహించిన ‘ప్రపంచ డౌన్‌ సిండ్రోమ్‌ కాంగ్రెస్‌’ వేదికపై తన నాట్యాన్ని ప్రదర్శించడం. నాలుగేళ్ల తరువాత బెహ్రయిన్‌లో జరిగిన వార్షిక వేడుకలో మరో ప్రదర్శన ఇచ్చింది. ఆ క్షణం మా కళ్లు ఆనందంతో చమర్చాయి. తల్లితండ్రులుగా తనకు ఒక దారి చూపించాం అంతే. కానీ ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ... అనుకున్నది సాధించింది మాత్రం ధన్య సంకల్పమే. అదే తన బలం’’ అంటూ గీత భావోద్వేగంగా చెబుతారు.

ఎందరికో గురువు...

చెన్నై వేదికపై ప్రదర్శన ఇచ్చిన రెండేళ్ల తరువాత ధన్య కప్పడ్‌లోని ‘థనాల్‌ స్పేస్‌ ఒకేషనల్‌ సెంటర్‌’లో డ్యాన్స్‌ టీచర్‌గా సరికొత్త అధ్యాయం ప్రారంభించింది. తనలా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు నాట్యంలో శిక్షణ ఇస్తోంది. అంతేకాదు... వాళ్లతో డ్రామాలు కూడా వేయిస్తోంది. డౌన్‌ సిండ్రోమ్‌ గల డ్యాన్స్‌ టీచర్లు ప్రపంచంలోనే చాలా అరుదనేది ఆమె తల్లితండ్రుల అభిప్రాయం.

అంతకు మించి ఏం కావాలి..!

‘‘నాట్యం నన్ను సంతోషంగా ఉంచుతుంది. నాలాంటి విద్యార్థులకు బోధించగలుగుతున్నానంటే గర్వంగా అనిపిస్తుంది. నా ఈ ప్రయాణం అంత సులువు కాదని తెలుసు. అయితే జీవితం ఓ సముద్రం. పట్టుదలతో కష్టపడితేనే తీరం చేరగలం. నా కథ విన్నాక ఎవరికైనా తమ జీవితాలను ఆనందంగా గడపవచ్చని అనిపిస్తుందనేది నా భావన. ఏదిఏమైనా నన్ను చూసి ఏ ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు... అంతకు మించిన ఆత్మసంతృప్తి నాకు మరొకటి ఉండదు.

ఆరంభంలో ధన్య చాలా సమస్యలు ఎదుర్కొంది. చెప్పింది అర్థం చేసుకోవడంలో, స్టెప్స్‌ గుర్తుపెట్టుకోవడంలో, లయబద్దంగా నర్తించడంలో... ఇలా అనేక ఇబ్బందులు. కానీ రాత్రింబవళ్లూ కష్టపడి, వాటన్నిటినీ అధిగమించింది.

Updated Date - 2022-11-29T22:41:27+05:30 IST