distance relationship లో బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే!!

ABN , First Publish Date - 2022-07-11T21:27:23+05:30 IST

భార్యాభర్తల మధ్య దూరం అనేది కొన్నిసార్లు తప్పనిసరి కావచ్చు. కానీ దాన్ని మానసిక దూరంగా మారకుండా చూసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా బంధంలో ఉన్న భార్యభర్తలే.

distance relationship లో బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే!!

మనుషుల మధ్య బంధాలు చాలా విలువైనవి. వాటిని కాపాడుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భార్యాభర్తల బంధం అపురూపమైనది. కానీ ఆ బంధం ఈరోజుల్లో ఎక్కువకాలం నిలవడంలేదు. ఈ భార్యాభర్తల బంధాన్ని బలహీనం చేస్తున్నవి ఆర్థిక కారణాలు, వ్యక్తిగత కారణాలే కాకుండా మరొ రకంగా భార్యాభర్తల మధ్య పెరుగుతున్న దూరం కూడా ప్రధాన కారణంగా నిలుస్తుంది. సాధారణంగా భార్యాభర్తలు దగ్గరగా ఉన్నా మానసికంగా దూరదూరమున్నట్టు ఉండేవాళ్లను చూస్తుంటాం. ఈ సమస్య మానసిక స్థితిని మార్చుకోవడం ద్వారా పరిష్కారం అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు భౌతికంగా దూరంగా ఉండవలసి వస్తే వారు మాత్రం బంధాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సిందే అంటున్నారు నిపుణులు(Experts). 


కాకపోతే భౌతికంగా దూరంగా ఉంటున్నవారు చెరొక దిక్కులోనూ ఉంటున్నారు. దీనికి చాలావరకు ఉద్యోగం, ఉన్నత చదువుల కారణంగా దూరం ఏర్పడుతోంది. కొందరు దూరంగా పట్టణం (towns)లో ఉంటుంటే, మరికొందరు ఏకంగా రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి నివసిస్తున్నవారూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య దూరం (distance relationship) లో స్వచ్ఛమైన ప్రేమను మనం చూడొచ్చు. 


దూరంగా ఉండడం వల్ల మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఒక్కోసారి బయటపడుతూ ఉంటుంది. దీనిలో కోరికలు వంటివి ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్యా దూరం ఎక్కువకాలం కొనసాగితే ఆ బంధం బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. వయసులో ఉన్నవారి మధ్య శారీరక కోరికలు కలగడం సహజం, అలాగే కొన్ని ఎమోషన్స్ (emotion) ని పంచుకోడానికి భాగస్వామి సాన్నిహిత్యం కోరుకోవడం కూడా సహజమే. తమ మధ్య కాలం ఏర్పరుస్తున్న దూరాన్ని అధిగమించి బంధానికి బీటలువారకుండా చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని రిలషన్షిప్ కౌన్సిలర్స్(Relationship counselors) సూచిస్తున్నారు.


◆ దూరంగా ఉన్నవారు సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం.  ఉన్నది కొద్దిసమయమే అయినా, ఇద్దరూ మాట్లాడుకునేది ఫోన్లో లేదా వీడియో ద్వారా అయినా ఆ సమయాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా మరింత ఆహ్లాదంగా మార్చుకోవాలి.  గడిపిన సమయం పట్ల తృప్తి కలిగేలా ఉండాలి. 


◆ మాట్లాడిన ప్రతిసారి సంతోషంగా మాట్లాడుకోవాలి. రోజులో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు, వింతలు, విశేషాలు ఒకరికొకరు పంచుకోవాలి. బిజీ పేరుతో మాట్లాడటాన్ని, స్పందించడాన్ని దాటవేయకూడదు.


◆ ఇలాంటి పరిస్థితిలో ఉన్న చాలామందిని అపార్థాల వలయంలోకి తోసేది అభద్రతాభావం. మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు తమ భాగస్వామి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. అలా కాకుండా దూరంగా ఉన్నారు తమకు దూరమవుతారేమో అనే అభద్రతాభావాన్ని మనసులోకి రానివ్వకూడదు.


◆ కొందరు తమ దగ్గరి స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా (Social Mediaలో Post) చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో భాగస్వామితో వాదనలకు గొడవలకు దిగకూడదు. వ్యక్తిగత స్వేచ్ఛ (Personal freedom) ను గౌరవించాలి. 


◆ గతంలో కలిసి గడిపిన సమయాలను గుర్తుచేసుకుని వాటిని చర్చించుకుంటూ ఉండాలి. అవన్నీ మధురజ్ఞాపకాలుగా ఇద్దరినీ సంతోషపెడతాయి.


◆ ఒకరికొకరు నేరుగా బహుమతులు ఇచ్చుకునే సౌలభ్యం లేకపోయినా ఇప్పుడున్న ఆన్లైన్ షాపింగ్ (Online shopping) ద్వారా ఒకరికొకరు బతుమతులు పంపుకోవడం, ఒకరిని మరొకరు ఆశ్చర్యపరుచుకోవడం చేయచ్చు. దీనివల్ల దూరంగా ఉంటున్నామనే బాధ అంతగా ఉండదు.


◆ మనుషులన్నాక  ఫీలింగ్స్ (Feelings) అనేవి పుడుతుంటాయి. భార్యాభర్తల మధ్య ఈ ఫీలింగ్స్ (Feelings), రొమాంటిక్ మూమెంట్ (Romantic moment) వైపుకి నడిపిస్తాయి. ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మానసికంగా దగ్గరితనం పెరుగుతుంది. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే సంభాషణలు కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.


◆ దూరంగా ఉండటం అనే  విషయం బాధపెడుతూ ఉంటే ఒకరినొకరు ఓదార్చుకోవాలి అంతేకానీ దానికి చిరాకు పడటం, తిట్టడం, కోపం చేసుకోవడం చేయకూడదు. ఇద్దరికీ నచ్చే విషయాలను గురించి మాట్లాడుకోవడం ఉల్లాసాన్ని ఇస్తుంది.


◆ ఒకవేళ అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నట్టయితే ముందుగానే ఆ విషయాన్ని చెప్పడం మంచిది. లేకపోతే ఇద్దరి మధ్యా పొరపొచ్చాలకు తావిచ్చినట్టవుతుంది.


భార్యాభర్తల మధ్య దూరం అనేది కొన్నిసార్లు తప్పనిసరి కావచ్చు. కానీ దాన్ని మానసిక దూరంగా మారకుండా చూసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా బంధంలో ఉన్న భార్యభర్తలే. పైన చెప్పుకున్నవి పాటిస్తే మానసికంగా దూరంగా ఉన్నామన్న ఆలోచన దరిదాపుల్లోకి కూడా రాదు.


Updated Date - 2022-07-11T21:27:23+05:30 IST