make your relationship: రిలేషన్ దీర్ఘకాలం కొనసాగించాలంటే..
ABN , First Publish Date - 2022-08-03T21:23:06+05:30 IST
గొడవ జరిగింది కాబట్టి, అలాగే వదిలేయకుండా, కాస్త చొరవ చూపండి. దీనితో సమస్య చిన్నదైపోతుంది.
పూర్వపు రోజుల్లో ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం కొన్నేళ్ళ పాటు కంచుకోటలా నిలిచేది. మరి ఇప్పుడో ఇద్దరి మధ్య పెనవేసుకునే బంధం చాలా పెళుసుగా మారుతున్న కాలమిది. బంధం నిలబడాలంటే చాలా శ్రమ, త్యాగం, ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం అవుతున్నాయి. ఓ ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సంవత్సరాల కాలం కావాలి. ఇంత కష్టపడి నిర్మించుకున్న కోట ఆవేశ నిర్ణయాల కారణంగా సెకన్ల వ్యవధిలోనే విచ్ఛిన్నమవుతుంది.
అపార్థాలు, చిన్న చిన్న గొడవలు లేని బంధాలు ఉండవు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా దూరం తగ్గి, అపార్థం దూరమై, ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు. గొడవ జరిగింది కాబట్టి, అలాగే వదిలేయకుండా, కాస్త చొరవ చూపండి. దీనితో సమస్య చిన్నదైపోతుంది. బలమైన బంధం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
1. తోడుగా ఉన్నాననే భరోసాను ఇవ్వండి.
రిలేషన్ లో ఉన్నప్పుడు మీ భాగస్వామికి ఏది అమితమైన ఇష్టమో తెలుసుకోండి. మూడ్ బాగోనపుడు, తగాదా పడుతున్న సమయాలల్లో ఆ ట్రిగ్గర్ ను ప్రయోగించండి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కౌగిలింత, సరదాగా కబుర్లు చెపుతూ మూడ్ మార్చండి. దిగులుగా ఉన్న సమయాల్లో తోడుగా ఉన్నాననే భరోసాను ఇవ్వండి.
2. ఇద్దరిలోనూ సారీలు చెప్పుకునే నేచర్ ఉండాలి.
ప్రేమించుకునే ఇద్దరు వైఫల్యాలను గుర్తు చేయకుని ఒకరినొకరు బాధించుకోవద్దు. రిలేషన్లో క్షమాపణ చెప్పేయడం అనేది చాలా ముఖ్యం. ఏదైనా సమస్య వస్తే వాదనలకు దిగకుండా కలిసి కూర్చుని ప్రశాంతంగా పరిష్కరించుకోండి.
3. పొగిడి చూడండి.
బంధం పెనవేసుకుంటున్న సమయంలో ఒకరిపై ఒకరికి శ్రద్ధ చాలా అవసరం. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, అప్పుడప్పుడూ మనసు పొంగేలా మెచ్చుకోవడం, కాస్త పొగడ్తలు గుప్పించడం మంచిదే. కాకపోతే అవి మనసులోంచి స్వచ్ఛమైన అభిప్రాయాలుగా ఉంటే మరీ అందంగా ఉంటుంది.
4. సమయం ఇవ్వండి.
ఒకరి భావాలు, భావోద్వేగాలను పంచుకోవాలంటే ఇద్దరికీ సమయం కావాలి. హఢావుడిగా తేలిపోయే ఏ విషయంలోనూ మనస్పూర్తి నిర్ణయాలు ఉండవు. ఒకరికి ఒకరు కొంత సమయాన్ని కేటాయించుకుని అభిప్రాయాలను పంచుకోవడం చాలా అవసరం.
5. దగ్గరతనాన్ని సజీవంగా ఉంచండి.
అవే నాలుగు గదుల్లో ఉండిపోక అప్పుడప్పుడూ ప్రయాణాలు చేస్తూ, కొత్త ప్రదేశాలను చూసి రావడం వల్ల ఇద్దరి మధ్యా ప్రేమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన తేదీలను గురుతుంచుకోవడం, కలిసి సాయంత్రాలు నడవడం, కొన్ని అభిప్రాయాలు పంచుకోవడం వల్ల ఇద్దరి మధ్యా దగ్గరితనం వస్తుంది. ఇది ఏ విషయాన్నైనా పంచుకునే చొరవ వచ్చి చేరుతుంది. ఇద్దరి మధ్యలో ప్రేమ, స్నేహం, అర్థం చేసుకునే గుణాలు విజయవంతమైన భాగస్వామ్యానికి పునాదులు.