positive mindset : పిల్లలు సవాళ్లను ఎదుర్కొవాలంటే సానుకూల మనస్తత్వాన్ని ఎలా పెంచాలి.
ABN , First Publish Date - 2022-07-30T21:30:20+05:30 IST
కథల పుస్తకాలను తెచ్చి కథలను కాస్త ఆసక్తిగా తల్లితండ్రులే చెపుతుంటే నెమ్మదిగా కథల పుస్తకాల వైపుకు మళ్ళుతారు. అదో అలవాటుగా చేసుకుంటారు. ఇలా పుస్తకాలు చదవడం అనేది వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
చిన్న సమస్య వచ్చినా తట్టుకునే ధైర్యం, తెగువ ఇప్పటి కాలం పిల్లల్లో తక్కువే. సమస్య వస్తే దానిని పరిష్కరించుకునే మనస్తత్వం కావాలి. తెలివితేటలతో పాటు పిల్లల్లో సానుకూల మనస్తత్వం, ఉల్లాసమైన వైఖరి, సందర్భం ఏదైనా మంచిపై దృష్టి పెట్టడం ఇవి ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు. దీనిని పెంచడంలో తల్లితండ్రుల పాత్ర చాలా అవసరం. వారిలో సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని వారే నింపాలి. చిన్న చిన్న అలవాట్లను కూడా తల్లితండ్రులే చేయాలి. అవేంటో చూద్దాం.
మంచి కథల పుస్తకాలను పరిచయం చేయండి.
పిల్లల్లో చిన్నతనం నుంచి పుస్తకాలు చదివే అలవాటును పెంచడం అంటే వాళ్ళకు మంచి స్నేహితుణ్ణి పరిచయం చేసినట్టే. మామూలుగా పుస్తకాలంటే నేటి పిల్లలు భయంతో పారిపోతారు. దానికీ కారణాలు లేకపోలేదు. ఎందుకంటే రోజంతా స్కూల్స్ లో పుస్తకాలతో కుస్తీలు పట్టే వాళ్ళకి మళ్ళీ పుస్తకాలంటే బోర్ కొడుతుంది. అందుకే అందమైన కథల పుస్తకాలను తెచ్చి కథలను కాస్త ఆసక్తిగా తల్లితండ్రులే చెపుతుంటే నెమ్మదిగా కథల పుస్తకాల వైపుకు మళ్ళుతారు. అదో అలవాటుగా చేసుకుంటారు. ఇలా పుస్తకాలు చదవడం అనేది వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఏకాగ్రత, నిర్ణయాలను స్వయంగా తీసుకోగలిగే చొరవా పిల్లల్లో అలవడుతుంది.
సవాళ్ళను స్వీకరించాలి.
సవాళ్ళు, ప్రతికూల పరిస్థితులు, అడ్డంకులు జీవితంలో ఒక భాగమనేది పిల్లలకు తెలిసేలా చేయాలి. మనీ నిషయంలో కూడా పిల్లలకు అవగాహన అవసరం. ఒక వస్తువు ఇంట్లోకి ఎంత కష్టపడితే వస్తుంది అనేది చిన్నతనం నుంచే పిల్లలకు తెలిసేలా చెప్పాలి. చిన్న చిన్న వస్తువులు కొన్నా అవి ఎంత పెట్టి కొంటున్నారో కూడా వారితో చెప్పాలి. మరీ ఆర్థిక వ్యవహారాలు చెప్పనవసరం లేదు గానీ.. పెన్సిల్, యూనిఫామ్, స్కూల్ ఫీజ్ వంటి విషయాలు పిల్లలకు తెలియడం మంచిదే. దీనితో వారికి ఊరికే ఏదీ రాదని కష్టపడాలనేది తెలుస్తుంది. వాళ్లకు కొనే ప్రతి వస్తువు వెనుక తల్లితండ్రుల కష్టం ఉందనే విషయం అర్థం అవుతుంది.
Self acceptance అవసరమే.
అయితే ముఖ్యంగా ఉండాల్సింది సెల్ఫ్ యాక్సెప్టెన్స్. దీన్నే స్వీయ అంగీకారం అని అంటారు. మంచైనా, చెడు అయినా, తప్పైనా, ఒప్పయినా ఉన్నదున్నట్టు స్వీకరించడం అనేది అలవడడం ముఖ్యం. చిన్నతనం నుండి పిల్లల్లో ఇలాంటి లక్షణం అలవాటు అయితే వాళ్లలో ఆత్మవిశ్వాసం స్థాయిలు చాలా వరకూ పెరుగుతాయి.
ఒత్తిడిని ఇలా తీసేయండి.
యుక్త వయస్సులో పిల్లల మనస్సు, శరీరంలో పలు మార్పులు సంభవించే సమయం., ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి, గందరగోళానికి, ఆందోళనకు, కొన్నిసార్లు డిప్రెషన్‌కు లోనవుతారు. ఈ సమయంలోనే మెదడు, శరీరం అభివృద్ధి చెందుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. దీనిని బ్యాలెన్స్ చేయాలంటే పిల్లలకు పుస్తకాలు చదవడం, యోగా, ధ్యానం చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. వీటితో ప్రేమ, నమ్మకం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పిల్లల్లో కలుగుతాయి. ఇది పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడకుండా ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనశైలికి కారణం అవుతుంది.
చిన్న నిరాశను కూడా తట్టుకోలేని లేత మనసులను కాస్త కఠినంగా మార్చడం అవసరమే..వారికి నచ్చిన విషయలలో ప్రోత్సహిస్తూ, ఉత్సాహంగా ఉండేలా చూడాలి. ప్రతి సమస్యనూ తేలికగా తీసుకోగలిగే తత్వాన్ని, జీవితం మీద దృఢమైన లక్ష్యాన్ని కలిగేలా వారిని ప్రోత్సహిస్తే.. ఇప్పటి కాలపు ఒత్తిడి చదువుల సవాళ్ళను తేలికగా దాటగలుగుతారు. మంచి పౌరులుగా పెరుగుతారు.