Ghantasala :ఘంటసాలను మరచిపోయారు
ABN , First Publish Date - 2022-12-03T23:58:44+05:30 IST
తెలుగు సినిమా తల్లికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు. ఆ రెండు కళ్లలోనూ కాంతి నింపిన ఘనత మధుర గాయకుడు ఘంటసాలదే. ఆ మహానటుల అభినయానికి తన పాటతో ఆ అద్భుత గాయకుడు ..
తెలుగు సినిమా తల్లికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు. ఆ రెండు కళ్లలోనూ కాంతి నింపిన ఘనత మధుర గాయకుడు ఘంటసాలదే. ఆ మహానటుల అభినయానికి తన పాటతో ఆ అద్భుత గాయకుడు జీవం పోశారు. వీరి ముగ్గురికీ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒక ఏడాది తేడాతో ముగ్గురికీ శత జయంతి ఉత్సవాలు జరుగుతుండడం. ఆదివారం ఘంటసాల శత జయంతి. ఈ సందర్భంగా ఆయన కోడలు కృష్ణకుమారి ‘నవ్య’కు అందించిన విశేషాల మాలిక.
ఘంటసాలగారి అభిమానులు ఆయన గురించి ఎక్కడ ఏ ఫంక్షన్ చేసినా అది ఫ్యామిలీ ఫంక్షన్‌లాగానే భావిస్తాం. అందుకే ఎవరు పిలిచినా సాధ్యమైనంతవరకూ ఎవరో ఒకరు ఆ ఫంక్షన్స్‌కు హాజరు కావడానికే ప్రయత్నిస్తాం. అన్నమయ్య గారి తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన ఎదురుగా కూర్చుని భక్తి పాటలు పాడిన ఏకైక గాయకుడు మా మామయ్యగారే. ఆ వేంకటేశ్వరుని భక్తుడు కావడంతో ఆయనకు దక్కిన వరం ఇది.
మా మామయ్యగారు స్వర్గస్తులై 48 ఏళ్లయింది. ఎటువంటి వ్యక్తి అయినా మరణించిన కొద్ది రోజులకే మరిచిపోతున్న ఈ రోజుల్లో మామయ్యగారంటే జనంలో ఇప్పటికీ అదే ప్రేమ, అభిమానం ఉండడం నిజంగా విశేషమే. సాధారణంగా త్యాగరాజ ఉత్సవాలు ఏడాదికి ఒకసారి మాత్రమే చేస్తుంటారు. కానీ మా మామయ్యగారి జయంతికి, వర్ధంతికి కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎంతో మంది కళాకారులు ఇప్పటికీ మామయ్యగారి పాటలతో జీవనం సాగిస్తున్నారు. మామయ్యగారికి ఇప్పటికి 54 విగ్రహాలు ఉన్నాయి. మూడు గుళ్లు కట్టి ఆయన్ని దేవుడిని చేశారు. ఇప్పటికీ రోజూ అక్కడ ధూప దీప నైవేద్యాలతో పూజలు జరుగుతుంటాయి. ఆయన శత జయంతి సందర్భంగా కొత్తగా మూడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురంలో మా శ్యామలగారు, పిడుగురాళ్లలో నేను ఆ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాం. దేశవ్యాప్తంగానే కాదు ఆదివారం రోజున మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా), న్యూజెర్సీ, సింగపూర్, దుబాయ్‌లో కూడా ఆయన శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన మీద భక్తి, ప్రేమ, అభిమానం ఏ మాత్రం తగ్గలేదు.
తొలి సంపాదనతో టేప్ రికార్డర్ కొని..
నా దురదృష్టం ఏమిటంటే నేను పెరిగి పెద్దయ్యేసరికి మామయ్యగారు చనిపోయారు. వారిని చూసే అవకాశం కూడా నాకు కలగలేదు. అయితే మా ఇంట్లో పెద్దలకి మావయ్యగారంటే ఎంతో అభిమానం. మా తాతగారు వాళ్ల ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. నేను చిన్పప్పటి నుంచీ వారి పాటలు వింటూ పెరిగాను. ఘంటసాలగారి పాటలు వినడం కోసం నా తొలి సంపాదనతో టేప్ రికార్డర్ కొన్నా. పెద్ద సౌండ్ పెట్టుకుని ఇంట్లో ఆయన పాటలు వింటుండేదాన్ని. నేను అభిమానించే వ్యక్తి ఇంటి కోడల్ని అవడం నా పూర్వజన్మ సుకృతం. మా ఆయన రత్నకుమార్‌గారు గాయకుడిగా ఎదుగుదామని ట్రై చేశారు. కొన్ని రాజకీయాల కారణంగా ఆయన గాయకుడిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. అందుకే డబ్బింగ్ ఫీల్డ్ ఎంచుకుని పన్నెండు వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇందులో తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత భాషల చిత్రాలు ఉన్నాయి. యువ హీరోలందరికీ ఆయన డబ్బింగ్ చెప్పారు. అలాగే టీవీ సీరియల్స్‌లో పది వేల ఎపిసోడ్స్ కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. ఎన్నో అనువాద చిత్రాలకు రచన చేశారు. ఏకధాటిగా ఎనిమిది గంటలు డబ్బింగ్ చెప్పి ఓ రికార్డ్ కూడా ఆయన నెలకొల్పారు. మా పెద్దమ్మాయి వీణ పాడుతుంది, డబ్బింగ్ చెబుతుంది. ఘంటసాలగారిని నేను కలుసుకోలేక పోయినా మా అత్తగారు, మా వారు ఎప్పుడూ ఆయన గురించే చెబుతుండం వల్ల భక్తి భావం ఇంకా పెరిగిపోయింది.
ఘంటసాలను మరిచిపోయారు
ఘంటసాలగారి శత జయంతి ని చిత్ర పరిశ్రమ పట్టించుకోవడం లేదు. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసిన గొప్పగాయకుడు ఆయన. నిజానికి ఆయన వందేళ్ల వేడుకను చిత్ర పరిశ్రమ ఘనంగా నిర్వహించాలి. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందులో ఘంటసాల గారి పేరు ఎవరూ తలుచుకోరు. ఆమధ్య చెన్నైలో జరిగిన వందేళ్ల సినిమా పండుగ లో కూడా ఆయన ప్రస్తావన ఎవరూ తీసుకురాకపోవడం బాధ కలిగించింది. తెలుగు పాటకీ, పద్యానికీ ఎంతో గౌరవం తెచ్చిన ఘంటసాలగారిని మరిచిపోవడం అన్యాయం. ఆ బాధ మా అందరిలో ఉంది. మేం చెన్నైలోనే ఉన్నా కనీసం మాకు ఆహ్వానం లేదు. ఆ వేడుకలోనే తమిళ చిత్ర పరిశ్రమ తరఫున గాయకుడు సౌందర్యరాజన్ కుమారుడిని పిలిచి సన్మానించారు. ఆ సమయంలో ఘంటసాలగారినీ, వారి వారసుల్ని ఎందుకో మరిచిపోయారు. ‘తెలుగులో ఎంతో మంది హీరోలకు పాడింది నాన్నగారే కదా. ఆయన్ని గుర్తు చేసుకోకపోతే ఎలా’ అని మా వారు రత్నకుమార్ ఎంతో బాధ పడ్డారు. బాలుగారు బతికి ఉంటే కచ్చితంగా శత జయంతికి ఓ గొప్ప వేడుక జరిగి ఉండేది. ‘శత జయంతి ఉత్సవాల్లో చివరి రోజు కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తాను. అందరం కలసి చేద్దాం’ ఆయన ప్రామిస్ చేశారు. ఆయన కూడా లేకపోవడం దురదృష్టకరం. అందుకే అభిమానులే మా దేవుళ్లు. వారి సహకారంతోనే శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం. మాలో ఘంటసాలగారిని చూసుకుంటూ మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా.
వినాయకరావు