Sharada Srinivasan : వేల పాత్రలకు పలుకునయ్యాను
ABN , First Publish Date - 2022-11-01T23:52:49+05:30 IST
రేడియో నాటకమనగానే మొదట గుర్తొచ్చే పేరు శారదా శ్రీనివాసన్. ఆమె తలపుల తోవలోకి వెళితే సాహితీ దిగ్గజాలెందరో తారసపడతారు.
రేడియో నాటకమనగానే మొదట గుర్తొచ్చే పేరు శారదా శ్రీనివాసన్. ఆమె తలపుల తోవలోకి వెళితే సాహితీ దిగ్గజాలెందరో తారసపడతారు. వాచికాభినయంతో సుప్రసిద్ధ నవలా నాయికలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన 88 ఏళ్ల శారదా శ్రీనివాసన్... నేడు ‘పాపులేషన్ ఫస్ట్’ జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతిష్టాత్మక ‘లాడ్లీ జీవన సాఫల్య పురస్కారం’ అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది...
‘‘నాకు ‘లాడ్లీ మీడియా’ జీవన సాఫల్య పురస్కారం ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. పాత సినిమా పాటలంటే ఎక్కడంటే అక్కడ వినచ్చు. కనుక అప్పటి గాయకులు ఇవాళ్టికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మెదులుతుంటారు. కానీ... ఆనాటి రేడియో నాటకాలను వినేందుకు అవకాశమే లేని ప్రస్తుత సందర్భంలో, ఓ ఆర్టిస్టుగా నన్ను గుర్తుపెట్టుకొని ఈ అవార్డుకు ఎంపికచేయడం, నాకు లభించిన అరుదైన గౌరవం. ఈ సందర్భం మళ్లీ నా రేడియో అనుభవాలు, మధుర స్మృతులు ఎన్నింటినో గుర్తుకు తెస్తోంది. నా 35 ఏళ్ల ఆకాశవాణి ఉద్యోగ ప్రయాణంలో కొన్ని వేల రేడియో నాటకాలలో... వేల పాత్రలకు పలుకునయ్యాను. అయితే మొదటి నుంచి సన్మానాలకు, అవార్డులకు నేను చాలా దూరం. ఎందుకంటే అంతకు మించిన సత్కారాలను, పురస్కారాలను ప్రముఖుల నోటి మాటల ద్వారా అందుకున్నాను కనుక. అవి నా గొంతుకు సత్తువ కూడా!
ప్రశంసల పురస్కారాలు...
నేను 1959 నుంచి 1995 వరకు ఆకాశవాణిలో పని చేశాను. అదొక సువర్ణ యుగం. తొలినాళ్లలో డ్రామా విభాగానికి స్థానం నరసింహారావు, సాహిత్యానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, గ్రామీణ కార్యక్రమాలకు త్రిపురనేని గోపీచంద్, సంగీతానికి వింజమూరి వరదరాజయ్యంగార్, పాలగుమ్మి విశ్వనాథం, స్త్రీల కార్యక్రమాలకు న్యాపతి కామేశ్వరమ్మ, రాఘవరావు దంపతులు, స్కూలు బ్రాడ్‌కాస్టింగ్‌కు మునిమాణిక్యం నరసింహారావు తదితరులు ప్రొడ్యూసర్లు. ఇంకా బుచ్చిబాబు, రజనీ, భాస్కరభట్ల కృష్ణారావు తదితర ప్రసిద్ధులతో మా కార్యాలయం భువనవిజయాన్ని తలపించేది. ‘‘అమ్మా శారదా... నేను స్టేజీకి, నీవు రేడియోకి...’’ అన్న ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు ప్రశంసకు మించిన పురస్కారం ఉంటుందా! ‘పురూరవ’ నాటకం విని, అందులో నేను పోషించిన ఊర్వశి పాత్ర నచ్చి, ఇంటికొచ్చి మరీ అభినందించి, నా మీద కవిత్వం రాసి కానుకగా ఇచ్చారు మనసుకవి ఆత్రేయ. అంతకు మించిన అవార్డు ఏముంటుంది!
నండూరి విఠల్‌గారితో నేను చేసిన ‘సీతాపతి’, ‘కాలకన్య’, ‘రాగరాగిణి’ లాంటి వందలాది నాటకాలు పేరు తెచ్చాయి. బెజవాడ గోపాలరెడ్డిగారైతే, ‘సీతాపతి’ నాటకాన్ని మళ్లీ ప్రసారం చేయమని పదేపదే కోరేవారు. ‘కాలాతీత వ్యక్తులు’ ఇందిర పాత్రలో నా వాచికం విని డాక్టర్ పి.శ్రీదేవి, గోరాశాస్త్రిగార్లు మెచ్చుకున్నారు. నన్ను కూతురిలా ఆదరించిన గోపీచంద్, సోదరిలా అక్కున చేర్చుకున్న అక్కయ్య కామేశ్వరమ్మ... ఇలా ఒకరా, ఇద్దరా... ఒకటా, రెండా... అనేకమంది మహనీయుల ఆదరాభిమానాలు నాకు దక్కాయి.
మాటలకూ శృతిలయలు...
పాతతరం తెలుగు చదవడం మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. ముఖ్యంగా పానుగంటి ‘కంఠాభరణం’లో సుబ్బలక్ష్మి పాత్ర సంభాషణలు మరీ క్లిష్టంగా అనిపించేవి. అలాంటప్పుడు ఒకటికి నాలుగుసార్లు స్ర్కిప్టును వల్లెవేస్తూ, బాగా సాధన చేసేదాన్ని. రంగస్థల కళాకారులకు రిహార్సిల్స్‌కు కొంత సమయం ఉంటుంది. కానీ మాకు ఆ వెసులుబాటు లేదు. అయినా ‘నాకు ఇది రాదు, చేతకాదు, చదవలేను’... అని నేనెన్నడూ అనలేదు. నేనేది చదివినా, అందులో ఎక్స్‌ప్రెషన్ ఉంటుందని కృష్ణశాస్త్రిగారు అనేవారు. రేడియోలో పాత్ర స్వభావం తెలియజెయ్యడానికి స్వర మాధుర్యం ముఖ్యం. దానికి తోడు డిక్షన్ బాగుండకపోతే శ్రోతను ఆకట్టుకోలేం. కనుక చేతిలో స్ర్కిప్టు ఉంది కదా అని గబగబా చెప్పేయకుండా, మాట మాటకు మధ్య స్పేస్, టైమ్ ఇస్తూ... లయబద్ధంగా సంభాషణలు పలికేందుకు ప్రయత్నిస్తాను. సంగీతానికే కాదు, మాటలకూ శృతిలయలుంటాయి మరి.
శిక్షణ లేకుండానే...
ఏదైనా నాటకంలోని పాత్ర తాలూకు మానసిక స్థితిని ఊహించుకొని, ఆ రీతిలో సంభాషణలు పలకడమే కానీ, అభినయంలో నేనంటూ ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. అయితే, ఎక్కడికి వెళ్లినా... ఇతరుల సంభాషణల తీరును నిశితంగా పరిశీలిస్తుండేదాన్ని. శివరాంకారంత్ ‘మరణానంతరం’ నవలలో వృద్ధురాలి పాత్రకు నేను పలికిన సంభాషణలు ఎంతో మందికి నచ్చాయి. రంగనాయకమ్మ ‘బలిపీఠం’ నవల నాటకీకరణకు శ్రోతల నుంచి అభినందనల ఉత్తరాల జల్లు కురిసింది. నాకు తెలంగాణ, ఉత్తరాంధ్ర యాసలంటే చాలా ఇష్టం. అలా దాశరథి రంగాచార్య ప్రత్యేక కోరిక మేరకు ‘చిల్లరదేవుళ్ళు’లో వనజ పాత్ర, బలివాడ కాంతారావు ‘దగాపడిన తమ్ముడు’లో ఉత్తరాంధ్ర యాసలోని లీడ్ రోల్ చేశాను. అవి నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పీవీ నరసింహారావు అనువదించిన ‘ఎవరు లక్ష్యపెడతారు’ నవలను నాటకంగా ప్రదర్శించాం. అందులో నా వాచికాన్ని ఆయన తెగ మెచ్చుకున్నారు.
చలం నుంచి ఉత్తరం...
చలం ‘పురూరవ’ నాటకం ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. ఆ నాటకం యూట్యూబ్‌లో విన్నామని, ఎంతో బాగుందంటూ చాలామంది నుంచి ఫోన్లు వస్తుంటాయి. అయితే, ఆ నాటకం వేయడానికి ఆనాడు నాకు అంత ధైర్యం లేదు. నిర్వాహకుడు చిరంజీవిగారికి ఇష్టమే లేదు. డ్రామా విభాగాధిపతి శ్రీగోపాల్ ఆదేశాల మేరకు ‘పురూరవ’ చేశాం. మాకు ఇష్టంలేదు కదా అని, నిర్లక్ష్యంగా చేయలేదు .ప్రాణం పెట్టి అభినయించాం. ఆ నాటకం విని, అందులోని ఊర్వశి పాత్ర ద్వారా నా వాచికం చాలా బాగుందంటూ చలం గారు ఉత్తరం రాశారు.
అభిమానుల లేఖలు...
గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు చాలామంది నన్ను చూడాలని ఆకాశవాణి కేంద్రానికి వచ్చేవారు. ‘మీరెంత బాగా చదువుతారో! అన్నీ నోటికి ఎలా వస్తాయి’ అని కొందరు నన్ను అమాయకంగా అడిగేవారు. ఇక అభిమానుల నుంచి వచ్చే ఉత్తరాల సంగతి సరేసరి! ఒక కుర్రాడు అయితే, నన్ను పొగుడుతూ రోజుకొక ఉత్తరం రాసేవాడు. ‘మీరు ముందు చదువు మీద శ్రద్ద పెట్టండి’ అంటూ బదులు రాసేదాన్ని. ఇదంతా 1970ల నాటి సంగతి. గుమ్మడి గారు అయితే, నాతో కలిసి నటించడం కోసమే ‘పెద్దమనుషులు’ రేడియో నాటకంలో అడిగి మరీ పాత్ర పోషించినట్లు ఆయనే చెప్పారు.
సినిమాలకు డబ్బింగ్...
అప్పట్లో కమలాకర కామేశ్వరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, దుక్కిపాటి మధుసూదనరావు లాంటి దర్శక దిగ్గజాలు తమ సినిమాల్లో నటించమని కోరిన సందర్భాలున్నాయి. మొదటి నుంచి నాకు ఆ రంగం మీద ఆసక్తి లేకపోవడంతో వద్దనుకున్నాను. దుక్కిపాటి ‘బంగారు కలలు’ సినిమాలో వహీదా రెహమాన్‌కు డబ్బింగ్ చెప్పాను. తర్వాత అక్కినేని కుటుంబరావు, ఓల్గాతో నాకున్న స్నేహం కొద్దీ వాళ్లు తీసిన ‘తోడు’ సినిమాలో కథానాయిక గీతకు డబ్బింగ్ చెప్పాను. అదే సినిమాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం సమకూర్చారు. తొలినాళ్లలో ఆయన ఆధ్వర్యంలోని ‘భక్తిరంజని’ కార్యక్రమాల్లో పాటలు పాడేదాన్ని. కొంతకాలం బాలమురళీగారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నాను. గురుసమానులైన ఆయన ‘తోడు’ సినిమాలో నా డబ్బింగ్ విని... ‘శారదా... నిన్ను చూసి నేను గర్వపడుతున్నానోయ్’’ అనడం ఓ మధుర జ్ఞాపకం.
మెచ్చిన పాత్రలు...
నేను చేసిన వేల నాటకాల్లో నాకు అత్యంత తృప్తినిచ్చింది... తిలక్ ‘సుప్తశిల’లోని అహల్య పాత్ర. మరింత బాధను కలిగించిన పాత్ర అంటే ‘రాజా ఈడిప్‌స’లోని జోకస్తా పాత్ర. రంగనాయకమ్మ ‘స్త్రీ’, ఉప్పల లక్ష్మణరావు ‘అతడు ఆమె’, పిలకా గణపతిశాస్త్రి ‘గృహిణి’ లాంటి కొన్ని వందల నవలల్ని రేడియోలో చదివాను. అందులోని కొన్ని స్త్రీపాత్రల ద్వారా మానసికంగా ఎదిగాను. బెజవాడ హిందీ మహావిద్యాలయంలో ప్రవీణ కోర్సు చదువుతున్న నన్ను మా అధ్యాపకులు వేమూరి రాధాకృష్ణమూర్తి ఆకాశవాణికి పరిచయం చేశారు. తొలినాళ్లలో పింగళి లక్ష్మీకాంతంగారు నాతో కొన్ని సంస్కృత నాటకాలు కూడా వేయించారు. ఇలా కొన్ని వందల నవలలు, కొన్ని వేల నాటకాలు కలిస్తే నా జీవితం.
సమానత్వం ఎక్కడ..?
అప్పుడు, ఇప్పుడు... ఎప్పుడూ మహిళ తగ్గి ఉండాల్సిందే. అది ఇంట అయినా, బయట అయినా! కొందరు పోరాట యోధులు, ధీరలు సమానత్వం కోసం గొంతెత్తబట్టి ఈ మాత్రమైనా హక్కులను పొందగలుగుతున్నాం. అయితే స్త్రీ-పురుష సమానత్వం అనేది ఎక్కడా లేదు. దాని కోసం ఆడవాళ్లు నిరంతరం పోరాడాల్సిందే! ఐదేళ్ల కిందటి వరకు బిర్లా ప్లానిటోరియంలో తెలుగు వ్యాఖ్యానాన్ని చెప్పాను. మూడేళ్ల కిందట ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ కోరిక మేరకు ‘ఆమ్రపాలి’ నాటకంలో నటించాను. కరోనా సమయంలో జీవీ సుబ్రహ్మణ్యం కథలను వాళ్ల కుటుంబ సభ్యులు నా గొంతుతో రికార్డు చేశారు. ఆకాశవాణిలో ఒకనాడు ప్రసారమైన అలనాటి మేటి నాటకాలను సేకరించి, లాక్‌డౌన్‌లో తిరిగి ప్రసారం చేశారు. వాటిని యూట్యూబ్‌లోనూ ఉంచారు. ప్రస్తుతం నేను నగర శివారులోని వయోధికులకు సౌకర్యవంతంగా ఉండే ఓ కమ్యూనిటీలో నా కూతురు నీరదతో ఉంటున్నాను. అమ్మాయికి నా పర్యవేక్షణ అనునిత్యం అవసరం. తాను కూచిపూడి కళాకారిణి కూడా.’’
ప్రేమ వివాహం...
నా భర్త శ్రీనివాసన్ స్వస్థలం తమిళనాడు. ఆయన ఆకాశవాణిలో మొదట ఫ్లూటు కళకారుడు. ఒకరినొకరం ఇష్టపడ్డాం. అదే విషయం ఇంట్లో చెబితే... మా నాన్న కాజా ఆదినారాయణశాస్త్రి మొదట అంగీకరించలేదు. దాంతో విషయం దేవులపల్లిగారి దృష్టికి తీసుకెళ్లాను. ‘అబ్బాయి మంచోడు. ఆలోచించకండి’ అని ఆయన మా నాన్నను ఒప్పించారు. అలా పెద్దల అంగీకారంతో 1961, జూలై 10న శ్రీనివాసన్, నేను ఒక్కటయ్యాం. మా పెళ్లి ముహూర్తం పెట్టింది మరెవరో కాదు, బాలాంత్రపు రజనీకాంతరావు గారే.!
సాంత్వన్, ఫొటోలు: కటకం సింహాచారి