Zen Story : శిష్యుల కోరిక
ABN , First Publish Date - 2022-12-08T23:57:31+05:30 IST
జపాన్ నుంచి జెన్ బౌద్ధాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీసుకువెళ్ళిన కొద్దిమంది ప్రముఖులలో నకగావ సోయెన్ ఒకరు. సోయెన్ గురువు జెంపో యమామొటీ. ఆయనకు రోషీ ..
జపాన్ నుంచి జెన్ బౌద్ధాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీసుకువెళ్ళిన కొద్దిమంది ప్రముఖులలో నకగావ సోయెన్ ఒకరు. సోయెన్ గురువు జెంపో యమామొటీ. ఆయనకు రోషీ అనే బిరుదు ఉంది. జపాన్‌లో 1866లో జన్మించిన జెంపో నిరక్షరాస్యుడు. అయినప్పటికీ జెంపోలోని సత్య జిజ్ఞాస ఆయనను బౌద్ధంలో అత్యున్నత శిఖరానికి చేర్చింది. ఆయన తన ఇరవై అయిదోయేట సన్యాసాన్ని స్వీకరించి, జపాన్‌లోని వివిధ ఆలయాలనూ, మఠాలనూ దర్ళించాడు. ఎందరెందరో గురువులతో, అర్చకులతో చర్చించాడు. కింజై తెగకు చెందిన బౌద్ధ మార్గం, హకూయిన్ ఎకాకు అనే గురువు బోధలు ఆయనను ఆకర్షించాయి. ఆ గురువు అడుగుజాడల్లోనే నడిచాడు. అందుకే ఆయనను ‘ఇరవయ్యో శతాబ్దపు హకూయిన్’ అంటారు. తొంభయ్యేళ్ళకు పైగా జీవించిన ఆయన తన శిష్యులెందరినో గురువులుగా తీర్చిదిద్దాడు. ధ్యాన, జ్ఞానాలతో సమానంగా శారీరక శ్రమకూ, సాధారణ పనులకూ కూడా ప్రాధాన్యాన్ని ఇచ్చేవాడు. శ్రమతో కూడిన ఏదో ఒక పని చెయ్యకుండా ఏ రోజూ ఆయన ఆహారం తీసుకోలేదు, నిద్రపోలేదు.
జెంపో తొంభై అయిదేళ్ళ వయసులో కూడా క్రమం తప్పకుండా రోజూ తోట పని చేసేవాడు. ఆయన అలా శ్రమ పడడం చూడలేక... పనిముట్లనూ, పరికరాలనూ ఆయన శిష్యులు దాచేశారు. వాటి కోసం జెంపో అన్ని చోట్లా వెతికాడు. చివరకు శిష్యులతో ‘‘నాయనలారా! రోజూ నేను తోటలో వినియోగించే పనిముట్లు కనిపించడం లేదు. అవి ఎక్కడున్నాయో కాస్త వెతికి తీసుకురండి’’ అని అడిగాడు.
అప్పుడు శిష్యులు ‘‘గురువుగారూ! మీరు చాలా వృద్ధులయ్యారు. శారీరక బలం తగ్గింది. ఇక ఏ పనీ చెయ్యకుండా విశ్రాంతి తీసుకోండి. పనులన్నీ చేయడానికి మేం ఇంతమందిమి ఉన్నాం కదా! ఆ పనిముట్లను మీకు అందుబాటులో లేకుండా మేమే దాచి ఉంచాం. మమ్మల్ని మన్నించండి’’ అన్నారు.
‘‘అలాగా! సరే!’’ అన్నాడు జెంపో. రోజంతా ఏదీ తినకుండా ఒకమూల పడుకున్నాడు.
‘‘గురువుగారూ! మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. మేము చేసిన పదార్థాలు నచ్చలేదా?’’ అని అడిగారు శిష్యులు.
‘‘అలాంటిదేమీ లేదు. పని చెయ్యలేదు కాబట్టి తినలేదు’’ అన్నాడు జెంపో. పని చేసిన వాడికే తినే హక్కు ఉంటుందని ఆయన అభిప్రాయం.
‘‘తినకపోతే ప్రాణాలు పోతాయి’’ అన్నారు శిష్యులు.
‘‘అవును. పోవలసిన సమయం వచ్చింది. ఏ పనీ చేయలేని జీవితం ఎందుకూ?’’ అంటూ ఏదీ తినకుండా చావును ఆహ్వానించడానికి సిద్ధపడ్డాడు జెంపో.
‘‘కానీ గురువర్యా! ఇది చలికాలం. ఎంత చల్లగా ఉందో చూడండి. ఇప్పుడు మీరు మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి మాకెంతో శ్రమ. ఆహారం తీసుకోండి. చలికాలం గడిచేవరకూ జీవించండి’’ అని కోరారు శిష్యులు.
వారి మాటలు విని జెంపో నవ్వుతూ ‘‘సరే! ఇవ్వండి’’ అని ఆహారం తీసుకున్నాడు.
చలికాలం వెళ్ళిపోయాక... ఒక రోజు జెంపో పడుకుని... బుద్ధుణ్ణి స్మరిస్తూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. గురువు జీవించి ఉండగానే ఆయన అంత్యక్రియల గురించి ప్రస్తావించడం జెన్ శిష్యులకే చెల్లింది. అలాగే జననం ఎంతో, మరణమూ అంతేనని అనుకోవడం, ఆ మరణం పరులకు శ్రమ కలిగించరాదని భావించడం జెన్ గురువులకే సాధ్యమయింది.
రాచమడుగు శ్రీనివాసులు