Gita Saram :ఆసక్తి- విరక్తి- అనాసక్తి
ABN , First Publish Date - 2022-12-08T23:52:22+05:30 IST
నిత్య జీవితంలో మనం ఎన్నో కార్యాలను నిర్వహిస్తూ ఉంటాం. ఆ పనుల్లో కొన్నిటిని ఇష్టంగా చేస్తాం. మరికొన్నిటిని ఇష్టం లేకుండానే చేస్తూ ఉంటాం.
నిత్య జీవితంలో మనం ఎన్నో కార్యాలను నిర్వహిస్తూ ఉంటాం. ఆ పనుల్లో కొన్నిటిని ఇష్టంగా చేస్తాం. మరికొన్నిటిని ఇష్టం లేకుండానే చేస్తూ ఉంటాం. ఇష్టంగా చేయడం అంటే ఆసక్తితో చేయడం. ఇష్టం లేకుండా, విముఖతతో చేయడం అంటే విరక్తిగా చేయడం. జీవితంలో మనం గడిపేది ఈ రెండు స్థితులలోనే. అయితే, ఈ రెండూ కాని మూడో స్థితి ఒకటున్నదని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదే అనాసక్తి. అంటే అటు ఆసక్తినీ, ఇటు విరక్తినీ అధిగమించిన స్థితి. ‘‘జ్ఞానశూన్యులైన వారు కర్మల పట్ల ఆసక్తితో వాటిని ఆచరించే విధంగానే, జ్ఞాని లేదా విద్వాంసుడు సైతం అనాసక్తుడైనప్పటికీ లోక ప్రయోజనం కోసం కర్మలను ఆచరించాలి’’ అని (భగవద్గీత 3:25)లో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఆసక్తి మీదనో, విరక్తి మీదనో ఆధారపడిన కర్మలు మనల్ని దయనీయంగా మారుస్తాయి. మనకు ఇష్టమైన వ్యక్తి మన దగ్గర ఉంటే, అంటే ఆసక్తి ఉంటే... మనకు ఆనందం కలుగుతుంది. ఇష్టం లేని మనిషి ఉన్నప్పుడు, అంటే విరక్తి ఉంటే... అసంతృప్తి జనిస్తుంది. ఆసక్తి లేదా విరక్తి... ఈ రెండు సుఖ దుఃఖాలనే ద్వంద్వాల మధ్య మనల్ని ఊగిసలాడేలా చేస్తాయి. అందుకని, ఏదైనా పని చేసేటప్పుడు ఆసక్తినీ, విరక్తినీ దాటి... ఆసక్తిరహితంగా ఉండాలని చెప్పాడు శ్రీకృష్ణుడు.
అనాసక్తి అనేది నాటకంలో ఒక పాత్రను ధరిస్తూ... అదే సమయంలో ప్రేక్షకుడిలా ఆ నాటకాన్ని తిలకించడం లాంటిది. పాత్ర పోషణ... బాహ్య ప్రపంచంలో మనం ఆచరించాల్సిన కర్తవ్యం. ఇక ప్రేక్షకుడిగా ఉండడం మన అంతరంగానికి సంబంధించిన స్వవిషయం. జీవితం అనే ఈ రంగస్థలంలో మనకు సంప్రాప్తించిన పాత్రను పోషించాలి. దానికి అవసరమైన జ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ పెంచుకుంటూ ఉండాలి. ఎంపిక, ప్రేరణ, ప్రకృతుల మీద మనం చేసే కర్మ ఆధారపడి ఉంటుంది. కానీ ఆ కర్మలను అనాసక్తితో ఆచరించాలి. ఆసక్తి, విరక్తులకు అతీతంగా... అనాసక్తితో కర్మాచరణను ఆచరించే ప్రక్రియలో మనం ప్రావీణ్యం పొందాలి. భగవద్గీతను జీవితంలో ఆచరణలో పెట్టడం అంటే అదే.
కె.శివప్రసాద్. ఐఎఎస్