Mahalaya Amavasya: ఇవాళ ‘మహాలయ అమావాస్య’.. పైగా ఆదివారం.. ఈ పని చేశారా.. లేదా..!
ABN , First Publish Date - 2022-09-25T21:40:43+05:30 IST
దివంగత తల్లిదండ్రులు, మన వంశానికి మూలపురుషులైన తాతముత్తాతలను గుర్తుపెట్టుకోవటం, వారికి సందర్భానుసారంగా సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పిన విధంగా..
పితృ దేవతల రుణం తీర్చే ‘మహాలయ అమావాస్య’ !
ఆదివారం రావడం మరింత ప్రాధాన్యం
దివంగత తల్లిదండ్రులు, మన వంశానికి మూలపురుషులైన తాతముత్తాతలను గుర్తుపెట్టుకోవటం, వారికి సందర్భానుసారంగా సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పిన విధంగా పితృకార్యక్రమాలు నిర్వహించటం ప్రతి ఒక్కరి విధి. దీనిని హిందువుల్లో ఒక్కో కులం వారు ఒక్కో విధంగా ఆచరిస్తుంటారు. వీటి వల్ల వంశం అభివృద్ధి చెందటమే కాకుండా, పితృదేవతల ఆశీస్సుల వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పటం జరిగింది. అసలు తల్లిదండ్రి జీవించి ఉన్నపుడు ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అని వారిని దైవ సమానంగా భావించాలని హిందూ ధర్మం బోధిస్తుంది. అదేవిధంగా చనిపోయిన వారిని పితృ దేవతలు అని సంబోధించటం ద్వారా వారు సాక్షాత్తు దేవతలతో సమానమని శాస్త్రం చెబుతుంది.ఆ విధంగా పితృకార్యక్రమాలు ఆచరించటానికి అత్యంత పుణ్యప్రదమైన రోజులు ‘మహాలయ పక్షాలు’. పక్షం అంటే 15 రోజులు. ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు ఉంటాయి. ఇందులో ప్రతిరోజు పుణ్యప్రదమైనదైతే, చివరి రోజైన మహాలయ అమావాస్య ఎంతో శుభప్రదమైనది.
పితృదేవతలకు ఇష్టమైన కాలం...
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతారాధనకు శుభకరమైనది. అదే విధంగా కృష్ణ పక్షం పితృదేవతలకు ఇష్టమైన కాలం. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృ దేవతలు ప్రతిరోజు మనం వారికి పెట్టే అన్నం, జలం కోసం ఎదురుచూస్తుంటారు. అదే విధంగా మహళాయ అమావాస్యగా పిలిచే భాద్రపద అమావాస్య రోజున మనం వారికిచ్చే తర్పణాల కోసం కూడా పితృదేవతలు ఎదురుచూస్తుంటారని, వాటిని ఇవ్వటంతో వారు సంతృప్తిని చెంది మనకు సకల శుభాలను ఇస్తారని ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల ఈ కాలంలో చేసే అన్నదానం అనంతకోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్నిస్తుందని శాస్త్రం పేర్కొంది. మహాళాల పక్షాల్లో తల్లిదండ్రులు ఏ తిథిన మరణించారో ఆ తిధి రోజు శ్రాద్ధకర్మ చేయటం, తర్పణం ఇవ్వటం మంచిది. అలా కుదరని వారు మహళాయ అమావాస్య రోజున వీటిని చేయొచ్చు. అయితే ఈ తర్ణ విధిని చేయలేని వారు కనీసం ఆ రోజున ఆవును పూజించి దానికి గడ్డి, పళ్లు వంటి వాటిని పెట్టటం కూడా తర్పణంతో సమానమని, దీనివల్ల పితృ శాపం తొలగిపోతుందని సనాతన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మహాలయ అమావాస్య విధిని వీలైతే ఇంట్లో లేదా శి వాలయంలో, నది ఒడ్డున నిర్వహించుకోవచ్చు. ఈ ఏడాది మహాలయ అమావాస్య ఆదివారం రావటంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.