నేటి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి
ABN , First Publish Date - 2022-10-05T10:07:51+05:30 IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో... విజయ దశమి రోజున శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఆమె సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి
దుర్గా నవరాత్రులు
ఆశ్వయుజ శుద్ధ దశమి
(విజయదశమి) బుధవారం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో... విజయ దశమి రోజున శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఆమె సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మను మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంతి స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గానూ పిలుస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు ఆమె అనుగ్రహిస్తుంది.
యోగమూర్తిగా... మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి అధిష్ఠాన దేవత అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవిని పూజిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, మనసారా కొలిస్తే బ్రహ్మజ్ఞానాన్ని ఆమె కలుగజేస్తుందనీ నమ్మిక. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. అమ్మవారిని ఎరుపు రంగు గాజులతో అలంకరించి, కుంకుమార్చన చేయడం శ్రేష్ఠం.
నైవేద్యం: పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు
అలంకరించే చీర రంగు:
ఆకుపచ్చ, తెలుపు అర్చించే పూల రంగు: ఎరుపు
పారాయణ: చెయ్యాల్సింది:
లలితా సహస్రనామం