Smart English Tutorials : ఇంగ్లీష్‌ నేర్చుకోవటం.. ‘అనిత’ర సాధ్యమేమీ కాదు!

ABN , First Publish Date - 2022-11-03T03:49:05+05:30 IST

ఇంగ్లీష్‌ అంటే ఇప్పటికీ చాలా మందికి బ్రహ్మపదార్థమే. అయితే అనంతపురం జిల్లాలోని సింగంపల్లి అనే పల్లెలో తెలుగు మీడియం చదువుకున్న అనిత మాత్రం ‘గట్టిగా అనుకోండి చాలు ఇంగ్లీష్‌ వస్తుంది’ అంటోంది.

Smart English Tutorials : ఇంగ్లీష్‌ నేర్చుకోవటం.. ‘అనిత’ర సాధ్యమేమీ కాదు!
అనిత

ఇంగ్లీష్‌ అంటే ఇప్పటికీ చాలా మందికి బ్రహ్మపదార్థమే. అయితే అనంతపురం జిల్లాలోని సింగంపల్లి అనే పల్లెలో తెలుగు మీడియం చదువుకున్న అనిత మాత్రం ‘గట్టిగా అనుకోండి చాలు ఇంగ్లీష్‌ వస్తుంది’ అంటోంది. రోజువారి జీవితంలో జరిగే విశేషాలను ‘స్మార్ట్‌ ఇంగ్లీష్‌ ట్యుటోరియల్స్‌’ పేరుతో యూట్యూబ్‌ షార్ట్స్‌, రీల్స్‌లో సరళంగా బోధిస్తున్నారు. పదిమందికీ స్పూర్తిగా నిలుస్తున్న ఇంగ్లీష్‌ టీచర్‌ అనితను ‘నవ్య’ పలకరిస్తే తను నేర్చుకున్న విధానం, అసలైన సవాళ్లనూ పంచుకున్నారిలా..

‘‘గత ఏడాది యూట్యూబ్‌ ప్రారంభించా. ఎంటర్‌ టైన్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ‘ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌’ చూస్తారో లేదోననుకున్నా. అయితే నేర్చుకున్నది చెప్పాలనుకున్నా. కయూట్యూబ్‌లో చేసిన పెద్ద వీడియోలకంటే ఇటీవల చేసిన షార్ట్స్‌, రీల్స్‌ పాపులరయ్యాయి. ఇది ఊహించలేదు. ఆ మాటకొస్తే ఇంగ్లీషు నేర్చుకుంటానని ఏనాడూ అనుకోలేదు.

అలా ఆలోచన వచ్చింది..

గూగుల్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌.. ఇలా ఎక్కడైనా ఇంగ్లీషే. ఈ భాష నేర్చుకోలేకపోతే భవిష్యత్‌లో ముందుకెళ్లలేం... చాలా పోగొట్టుకుంటానేమో అనిపించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అమ్మాయిగా ఇంగ్లీషంటే బెరుకే. టెన్సెస్‌ బట్టీపట్టి నేర్చుకుని.. ఇక ఇంగ్లీషు రాదని టెన్షన్‌ పడిన బాపతే నాది. పెళ్లయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టాక.. ఖాళీగా ఉన్నపుడు ఏదోటి చేయాలనిపించింది. ఒకరోజు మా అబ్బాయి స్కూల్‌కి వెళ్లా. అక్కడి టీచర్లతో పేరెంట్స్‌ అంతా ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్‌ వచ్చిన వాళ్లదే పైచేయి అనిపించింది. నాకైతే నామోషీ అనిపించింది. అసలు నాకెందుకు ఇంగ్లీషు రాదు? ఇంగ్లీషు అంత కష్టమా? అనే ఆలోచనలు ఆ రోజంతా వేధించాయి. మా వారితో మాట్లాడితే.. ‘నాకు చదువు విలువ తెలుసు. నువ్వు ఏదైనా నేర్చుకోగలవు. నేర్చుకో ఇంగ్లీషు. పిల్లోళ్లను చూసుకుంటా నేను కూడా’ అంటూ తోడుగా నిలిచారు. అలా 2016లో ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి ముందడుగేశా.

అలా ఆత్మవిశ్వాసం...

ఇంగ్లీష్‌ నేర్చుకోవాలనే ఎమోషన్‌ ఎవరికైనా ఉంటుంది. నేర్చుకోవటమే కష్టం అనిపించింది. వెనక్కి తగ్గలేదు. పుస్తకాలు చదివా. రోజువారి పనుల్ని, మన కళ్లముందు కనిపించేవన్నీ వాక్యాలుగా రాసుకున్నా. ఇంగ్లీషులో మాట్లాడుతుంటే నా చుట్టు ఉండేవాళ్లు ‘రాకున్నా బడాయిగా ఇంగ్లీష్‌ మాట్లాడుతోంద’ంటూ కామెంట్స్‌ చేశారు. నేనేమీ పట్టించుకోలేదు. ప్రతిరోజూ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునేదాన్ని. సందేహాలొస్తే గూగులమ్మను అడిగేదాన్ని. అమెరికాలో ఉండే బంధువులతో ఇంగ్లీషులో మాట్లాడేదాన్ని. యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్‌ ఫాలో అయ్యేదాన్ని. గృహిణిగా అన్ని పనులు చేసుకుని, ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుని రోజుకు రెండు గంటలు సాధన చేసేదాన్ని. ఇదే పెద్ద చాలెంజ్‌. నాలుగైదు నెలలపాటు ఇంగ్లీషులోనే ఆలోచించడం, మాట్లాడటం, రాయటం, చదవటమే నా ప్రపంచం. నాలోని మొండితనమే భాష నేర్చుకోవటానికి కారణమైంది. బయటివాళ్లు ఏమనుకుంటారోననే భయంతో.. ఇంట్లో మా పిల్లలతోనే ఇంగ్లీష్‌ మాట్లాడేదాన్ని. ‘బాగా మాట్లాడుతున్నావ’ని కొందరంటే... ఒక ఇంగ్లీష్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ట్రైనర్‌గా వెళ్లా. అక్కడ డెమో ఇచ్చా. గృహిణులు, ఉద్యోగులు, బిటెక్‌ చదివినవాళ్లున్నారు ఆ తరగతి గదిలో. ‘గ్రామర్‌ లేకుండా ఇలా బోధించటం బావుంద’ని స్టూడెంట్స్‌ అన్నారు. సొంతంగా చేసుకున్న మెటీరియల్‌తో పాటు బోధనా తీరు అక్కడి మేనేజ్‌మెంట్‌కి నచ్చింది. ప్రశంసలందుకున్న రోజు ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా మూడేళ్లు ఉద్యోగం చేశా.

ఎవరైనా నేర్చుకోవచ్చు..

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌లో రోజుకి ఆరుగంటల పాటు ఇంగ్లీషు బోధించా. నా దగ్గర నేర్చుకున్న వాళ్లు నాకంటే పెద్దవాళ్లు. ఏదో ఒక స్పోకెన్‌ ఇంగ్లీషుకెళ్లి ఇక భాష రాదని నిర్ణయించుకున్న వాళ్లే. అలాంటి వాళ్లు ధారాళంగా ఇంగ్లీషులో కమ్యూనికేట్‌ అవుతున్నప్పుడు.. పది వాక్యాలు ఇస్తే వంద వాక్యాలు రాయగల ఆసక్తిని చూసినపుడు.. అదో గ్రేట్‌ ఫీలింగ్‌!. ఎవరైనా ‘ఇంగ్లీష్‌ కష్టం’ అని నాతో అంటే.. ‘నేను తెలుగు మీడియం. నేనే మాట్లాడుతున్నా.. బోధిస్తున్నా’ అంటే ఆశ్చర్యపడతారు. ఎవరైనా, ఎప్పుడైనా భాష నేర్చుకోవచ్చు. ‘బెటర్‌ లేట్‌ దాన్‌ నెవర్‌’ అంటుంటా. ఇదేమి రాకెట్‌ సైన్స్‌ కాదు. నేర్చుకోవాలనే తపన, అవసరం, ఆసక్తి ఉండాలంతే. ఒక్కసారి రియలైజ్‌ అయితే మిమ్మలను ఎవరూ ఆపలేరు. నాకేమీ వనరుల్లేవు అని నిరుత్సాహపడద్దు. మీకు ఫోనుంటే.. అందులో గూగుల్‌, సోషల్‌ మీడియాను నమ్ముకుంటే సరిపోతుంది. అందరికీ చెప్పేదొక్కటే.. ఇంగ్లీష్‌ నేర్చుకోవడం ఒన్‌డే మ్యాచ్‌ కాదు. ఇదో నిరంతర సాధన. గట్టిగా అనుకుంటే అనితర సాధ్యమేమీ కాదు!

అదే నా కల!

ఒకప్పుడు వెటకారంగా ‘బట్లర్‌ ఇంగ్లీష్‌’ వెక్కిరించినోళ్లు ఇపుడు నాతో మాట్లాడటానికి జంకుతున్నారు. ఎందుకంటే వాళ్లది బ్రోకెన్‌ ఇంగ్లీష్‌. అప్పట్లో పట్టించుకోని వాళ్లు ఉపయోగం ఉంటుంది కదా! అని మాట్లాడుతున్నారు. లోకమంతే.. మీరు విజయం సాధిస్తే ప్రశంసిస్తారు. దగ్గరవ్వాలనుకుంటారు. ఇంగ్లీషు నేర్చుకుంటే ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయి. నేను సాఫ్ట్‌వేర్‌ కోర్సులు కూడా చేస్తున్నా. యూట్యూబ్‌లో నా వీడియోలు వంద కూడా ఉండవు. కొన్ని వీడియోలను లక్షల మంది చూశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన నేను ఇంగ్లీష్‌ నేర్చుకోవటానికి పడిన కష్టాలు ఇతరులు పడకూడదనుకున్నా. నేర్చుకున్న టెక్నిక్స్‌, టీచింగ్‌ మెథడ్స్‌ చెప్పాలనే వీడియోలు చేస్తున్నా. నేను సాధించిన ఈ చిన్న విజయం.. కొందరికైనా స్పూర్తిగా మిగిలితే చాలు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాలన్నదే నా కల. అటువైపే నా అడుగులు.’’

ఇంగ్లీష్‌ నేర్చుకోమని మా వారు గంగాధర్‌ ప్రోత్సహించారు. పెళ్లయ్యాక డిగ్రీతో పాటు ఎమ్‌.ఏ. ఇంగ్లీష్‌, ఎమ్మెస్సీ బయో కెమిస్ర్టీ చదివానంటే.. మా ఆయన సపోర్టే. నాకిద్దరు పిల్లలు. పెద్దబ్బాయి నాలుగో తరగతి. చిన్నబ్బాయి ఒకటో తరగతి. ట్రైపాడ్‌తో సొంతంగా వీడియోలు తీసుకుంటా. ఎడిటింగ్‌ చేసుకుంటా. ‘స్మార్ట్‌ ఇంగ్లీష్‌ ట్యుటోరియల్స్‌’ పేరుతో యూట్యూబ్‌ షార్ట్స్‌, రీల్స్‌ మంచి పేరు తీసుకొచ్చాయి.

రాళ్లపల్లి రాజావలి

ఫొటో: కె. శ్రీకృష్ణ

Updated Date - 2022-11-03T03:49:32+05:30 IST