Kashmir Pickles : కాశ్మీరు లోయలో.. పచ్చళ్ల తయారీలో...

ABN , First Publish Date - 2022-12-06T23:41:35+05:30 IST

కాశ్మీరు మహిళలు వంటింటికే పరిమితమైపోయే గృహిణులుగా మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. దృఢ సంకల్పంతో స్వయం స్వావలంబన దిశగా అడుగులేస్తున్నారు.

Kashmir  Pickles : కాశ్మీరు లోయలో.. పచ్చళ్ల తయారీలో...

కాశ్మీరు మహిళలు వంటింటికే పరిమితమైపోయే గృహిణులుగా మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. దృఢ సంకల్పంతో స్వయం స్వావలంబన దిశగా అడుగులేస్తున్నారు. అదే దారిలో నడుస్తున్న శ్రీనగర్‌కు చెందిన ‘నవా షా’, నిల్వ పదార్థాలు ఉపయోగించకుండా పచ్చళ్లు, జామ్‌లు తయారుచేస్తూ సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. తన పచ్చళ్ల ప్రయాణం గురించి ఆమె ఇలా వివరిస్తోంది...

‘‘నాకు వంటలు చేయడమంటే ఇష్టం. రెండేళ్ల క్రితం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో వేర్వేరు ఉపాధుల్లో విజయం సాధిస్తున్న ఎంతోమంది కాశ్మీరు మహిళలు కనిపించారు. దాంతో నాక్కూడా నాకిష్టమైన పనినే ఉపాఽధిగా మలుచుకోవాలనుకున్నాను. అలా స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తికి స్వస్థి చెప్పి, పచ్చళ్ల తయారీ మొదలుపెట్టాను. ప్రారంభంలో వాటిని బంధువులకూ, స్నేహితులకూ అందించాను. అవి వాళ్లకెంతో నచ్చాయి. అలా నేను నాకు తగిన ఫుడ్‌ బిజినె్‌సకు శ్రీకారం చుట్టాను. 2021, ఫిబ్రవరిలో మొదలుపెట్టిన నా పచ్చళ్ల వ్యాపారానికి ‘జంకిల్‌ జార్స్‌’ అనే పేరు పెట్టుకున్నాను. అయితే నాలా పచ్చళ్ల వ్యాపారం చేసేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ నేను వాళ్ల కోవలోకి చేరిపోవడం నాకిష్టం లేదు. కాబట్టి నాదైన శైలిలో పచ్చళ్ల తయారీలో కొత్తదనాన్ని ప్రదర్శించాలని భావించాను.’’

ప్రిజర్వేటివ్స్‌ లేకుండా...

పచ్చళ్లు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలంటే కచ్చితంగా వాటిలో ప్రిజర్వేటివ్స్‌ కలపాలి. కానీ అవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఎన్నో ప్రయోగాలు చేసి, అంతిమంగా ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా పచ్చళ్లను తయారుచేయగలిగాను. అంతేకాకుండా పచ్చళ్ల ప్యాకింగ్‌ కూడా ఎంతో పరిశుభ్రంగా సాగుతుంది. మొదట జార్స్‌ను శుభ్రం చేసి, స్టెరిలైజ్‌ చేసిన తర్వాతే వాటిని పచ్చళ్లతో నింపుతాను. వీటి విక్రయాన్ని ఇంటి నుంచే మొదలుపెట్టాను. మాకు క్లౌడ్‌ కిచెన్‌ కూడా ఉంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ నా పచ్చళ్ల ప్రమోషన్‌కు ఎంతో బాగా ఉపయోగపడింది. దాదాపు 70ు ఆర్డర్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే అందుతూ ఉంటాయి. ప్రారంభంలో అమ్మకాలు కాశ్మీరు వరకే పరిమితమైనప్పటికీ, తక్కువ కాలంలోనే ఇతర రాష్ట్రాలకూ విస్తరించాయి. ప్రస్తుతం మటన్‌, చికెన్‌, ఖర్జూర, వెల్లుల్లి, ఇతరత్రా కూరగాయల పచ్చళ్లను తయారుచేస్తున్నాను.

జామ్స్‌ కూడా...

తాజాగా జామ్స్‌ తయారీ కూడా మొదలుపెట్టాను. ఎటువంటి ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా తాజా పండ్లతో జామ్స్‌ తయారుచేయడం నా ప్రత్యేకత. ప్రస్తుతం స్ట్రాబెర్రీ, మల్బరీ, క్విన్సీ.. ఇతరత్రా పండ్లతో జామ్స్‌ తయారు చేస్తున్నాను. పచ్చళ్ల జార్‌లు వేర్వేరు సైజులను బట్టి 200 నుంచి 650 రూపాయలకు విక్రయిస్తున్నాను. త్వరలో వెబ్‌సైట్‌ రూపొందించి దాని ద్వారా విక్రయాలు జరపాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం జమ్ము కాశ్మీరుతో పాటు కేరళ, ఒడిషా, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి నాకు ఆర్డర్లు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్డర్లు అందుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను.

కాశ్మీరు మహిళగా, మరీ ముఖ్యంగా గృహిణిగా, పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ, వ్యాపారంలోకి దిగడం ఒక సాహసమే! ఇటు ఇంటి పనులు చక్కబెడుతూ, అటు వ్యాపార పనులను కూడా సమర్థంగా నిర్వహించగలగడం నాకెంతో సంతోషంగా ఉంది. వ్యాపారంలో కుటుంబ సహాయసహకారాలు కూడా ఉన్నాయి. కాశ్మీరు మహిళలకు నా కథ స్ఫూర్తినందించి, వాళ్లను స్వయం స్వావలంబన వైపు నడిపించగలిగితే నాకంతే చాలు.

Updated Date - 2022-12-06T23:41:36+05:30 IST